7)ధ్వజస్తంభం

బాదే వెంకటప్పారావుగారి తోటలో ఒక టేకు చెట్టు నిటారుగా పొడవుగా పెరుగుతోంది. అది ధ్వజస్తంభానికి సరిపోతుంది అని అనేవారు. దానిని కొట్టించి, చెక్కించి ఇత్తడి తొడుగు వేయించేదాకా నాదే బాధ్యత అని చెప్పేవారు. మేము ఒకసారి చూడటానికి వెళ్లాం. మాకు కూడా చాలా నిటారుగా బాగా కనపడింది. ధ్వజస్తంభం కోసమే పుట్టింది అన్నట్లు ఉంది. ఒక సమస్య చాలా తేలికగా వదిలి పోయింది అనుకున్నాం.

కొంతకాలం తర్వాత గుడి దగ్గర ఎంత పొడవు కర్ర కావాలో లెక్క వేశాం. 36 అడుగుల కంటే తక్కువ పొడవు ఉన్నది పనికిరాదని తేలింది. మళ్ళీ తోటలోకి వెళ్లి ఒక మనిషిని చెట్టు ఎక్కించి పొడవు కొలిపించాము. అది 25 అడుగులు మాత్రమే ఉంది. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఎంతో పొడవు ఉన్నట్లు కనపడినది 25 అడుగులే ఉంటే 36 అడుగులు ఉన్నది ఇంకా ఎంత పెద్దదిగా ఉంటుందో కదా అని మొదటిసారి అనిపించింది. అంత పెద్ద చెట్టు దొరకడం అంత తేలికయిన పని కాదని అర్థం అయ్యింది.

అందరం గుడి దగ్గరకు తిరిగి వచ్చాక నేల మీద కూలబడ్డాం. అంత ఎత్తు చెట్టు తేలేము కానీ కాంక్రీటు స్తంభం పోసేసి ఇత్తడి తొడుగు వేద్దాం అన్నాను. దానికి మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు తెలిసిన బంధువు ఒకరు సూదికొండ ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ గారు ఒకరు ఉన్నారు. అక్కడకు రేపు వెళ్లి సంప్రదిద్దామన్నారు. నాకు ఏమాత్రం నమ్మకం లేక పోయినా సరే అన్నాను.

మరునాడు ఒక నలుగురం సూదికొండ వెళ్లాం. ఆరోజు D.F.O. గారి విజిట్ ఉండటం వల్ల సాయంత్రం వరకు మాకు ఆఫీసర్ గారు దొరకలేదు. సాయంత్రం ఆయన మమ్ములను చూసి ఏం పని మీద వచ్చారని అడిగారు. ధ్వజస్తంభం అవసరం గురించి ఆయనకు చెప్పారు. అది ఒక పెద్ద టేకు అడివి(plantation). అందులో ఒకే ఒక చెట్టు తుపాను గాలికి వేళ్ళతో సహా లేచి పడిపోయింది. కొన్ని వేల చెట్లలో అది తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి. అంటే తుపానుకు దెబ్బతినకుండా నిలబడి ఉన్నాయి. దానిని మొదట చూసిన వాచర్ ఒక ముస్లిం. ఆ చెట్టు చాలా బాగుంది, ధ్వజస్తంభానికి బాగుంటుందని చెప్పాడంట. అది మీకేమయినా పనికి వస్తుందేమో మమ్మల్ని చూసి రమ్మన్నారు. అది రోడ్డుకి దగ్గర్లోనే, అంటే సుమారు 200 అడుగుల దూరంలో ఉంది. ఒక పక్కన చీకటి పడటానికి ఎంతో సమయం లేదు. ఆ వాచర్ ని మాకోసం రోడ్డుమీద నిలబడమన్నారు.

మేము చీకటి పడిపోతుందేమోనని కంగారుగా వెళ్ళాము. అతను మమ్మల్ని చెట్టు దగ్గరకు తీసుకువెళ్లాడు. దారంతా అడుగు మందం రాలిపోయిన టేకు ఆకులు ఉన్నాయి. వాటి క్రింద ఏముందో కూడా తెలియదు. అయినా వాటిని మేము తొక్కుకుంటూ వెళ్ళాము. అప్పడాలు విరిగి పోతున్నట్లు చప్పుడు అవుతోంది నడుస్తుంటే. కొద్దిపాటి వెలుతురులో ఆ పడిపోయిన చెట్టును చూశాము. అది ఒక బ్రహ్మాండమయిన వృక్షం. పడిపోయినప్పుడు పైకి లేచిన వేళ్ళే 10 అడుగుల పొడుగు ఉన్నాయి. చెట్టు 36 అడుగులదాకా pencil లా తిన్నగా భారీ సైజుతో ఉంది. అక్కడ నుండి వంపుతో మొత్తం 42 అడుగులు ఉంది. దాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. వెంటనే దానికి దండాలు పెట్టుకుని కళ్ళకద్దుకుని ఆఫీసరు గారి బంగళాకు తిరిగివచ్చాము.

మాకు అది సరిపోతుందని చెప్పాము. దానికి ఆయన ఏమన్నారంటే, అది తుపానుకు పడిపోయింది కాబట్టి మీకు ఇవ్వగలము. లేకపోతే కొట్టడానికి ఎవరికీ అధికారము లేదు. దాన్ని మేము photos తీసి పైకి పంపించి వారి అనుమతి వచ్చాక దీనిని వంపు దగ్గర కొట్టించి డిపోకి తరలిస్తాము. దీనిని ముక్కలు చెయ్యకుండా Depot లోకి చేర్చడం కూడా చాలా కష్టమయిన పని. ఆ తరువాత పాటలు ఎప్పుడు పెడతారో కబురు చేస్తాను. అప్పుడు వచ్చి పాడుకొండి, అప్పుడు కొంచెం సాయం చేస్తాను. ఈ లోపల మా పై ఆఫీసరుగారు మరెవరికయినా మాట ఇవ్వకుండా నేను మాట ఇచ్చానని చెబుతాను. దీనికంతా కనీసం నాలుగు నెలలు సమయం పడుతుందన్నారు. మేము సరేనని ఇంటి ముఖం పట్టాము. అన్ని వేల చెట్లలో ఒక్క చెట్టే పడటం. అది కూడా మన అవసరానికి తగినట్లు ఉండటం దానిని తేలిగ్గా గుర్తించ గలగటం ఇదంతా ఆయన దయవల్ల మాత్రమే జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముందుండి నడిపిస్తున్నారని అర్థం అయిపోతొంది. వెనక నడవటమే మన పని.

అప్పుడప్పుడు ఆదారికి వెళ్ళినప్పుడు ఆగి ఆకర్రను చూసేవాళ్ళం. దానిని డిపోకు చేర్చాక కూడా చూశాం. కొన్నాళ్ళకు పాట జరిగే తేదీ తెలియజేసారు. ఒక వారం రోజులు సమయం ఉంది. నేను వెంకటప్పారావు గారిని కలిసి వివరం చెప్పి ఆరోజుకి సొమ్ము సిద్ధం చేసి ఉండాలని, వెళదామని చెప్పా. ఆయన సరే అన్నా నాకు నమ్మకం కలగ లేదు. నేను Bank లో Gold loan పెట్టా. ఏదయినా తేడా వస్తే ఉపయోగ పడుతుందని సిద్ధంగా ఉన్నాను.

అనుకున్నట్లే అయింది. ఆయన సొమ్ము సిద్ధం చేయలేదు. రానులేదు. ముందురోజు రాత్రి మాధవరావు గారి తండ్రిగారికి stroke రావటం వలన ఆయన రాజమండ్రి ఆసుపత్రి లో ఉన్నారు. అందువలన ఆయన కాని వారి కారు కానీ అందుబాటులో లేరు. ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. అప్పటికప్పుడు బూరుగుపూడి Taxi ని ఏర్పాటు చేసుకున్నాము. అదృష్టం కొద్దీ అదయినా దొరికింది. కొంచెం భోజనం తయారు చేసుకుని 5 గురం బయలుదేరాము. సూదికొండ డిపోలో రేంజరుగారిని కలిశాము. అనేక లాట్లు Auction లో ఉన్నాయి. మీది ఆఖరులో పెట్టాము. మీరు అక్కడ ఉండండి అన్నీ అయిపోయాక వస్తామని చెప్పారు. మధ్యాహ్నం ఒక చెట్టు క్రింద భోజనం చేసి మా లాటు దగ్గర కూర్చున్నాము.

చాలా సేపటికి మిగతా లాట్ల Auction ముగించుకుని మేము ఉన్నచోటికి వచ్చారు. అప్పుడు రేంజర్ గారు ఉన్నవాళ్ళందరితో ఇలా అన్నారు. ఇది బుచ్చింపేట శివాలయం ధ్వజస్తంభం కోసం నిర్ణయించాము. ఎవరూ పాడవద్దు”. గవర్నమెంటు లెక్క ప్రకారం దాని ఖరీదు సుమారు 80,000 రూపాయలు కట్టారు. ఈ లోపల ఒకాయన పై  పాటకు సిద్ధం అయ్యాడు. ఆయన్ను వారించి, ఒక వంద రూపాయలు అతని చేత పాడించి, అంత కంటే మరొక వంద రూపాయలు కలిపి మాకు ఖాయం చేశారు. సంతకాలు తీసుకున్నారు. వెంటనే ఆఫీసులో నాలుగవ వంతు ధర చెల్లించి మిగిలినది నెల రోజులలో Bank లో D.D. తీసి ఇచ్చి తీసుకువెళ్లాలని చెప్పారు. ఆపని పూర్తి చేసి వాళ్ళిచ్చిన రసీదులు తీసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చాము. గడువు పూర్తయ్యేలోపల ఉన్న Amount కి D.D. లు తీసుకున్నాము.

ఎలా తీసుకు రావాలి?

ఒక ట్రాక్టరు రెండు ట్రక్కులు అయితే సాధ్యమవుతుందని నిర్ణయించాం. ముందు ట్రక్కు వెనకాల Hook ఉన్నది. దానికి రెండవ ట్రక్కు డ్రాబారు తగిలిస్తే ఒక ట్రాక్టరు లాక్కుని వెళ్ళవచ్చు. మొత్తం దారిలో 6 టర్నింగులు ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగా తిరిగితే ఇబ్బంది ఉండదు. టర్నింగుల దగ్గర Traffic ని ముందుగా అదుపు చేయాలి. మొత్తం ఒక వంద మంది పైన బయలుదేరారు. అందరికీ ఇక్కడ వంటలు వండించి తీసుకు వెళ్ళాము. సన్నాయి మేళం పెట్టి, వారికి ఒక Truck ఆటో పురమాయించాము. అందరం మోటారు సైకిళ్ళ మీద, ట్రాక్టరు మీద బయలు దేరాం. ఇంత మంది జనం ఉన్నారు కాబట్టి ధ్వజస్తంభం కర్రని ట్రాక్టరు మీదకు ఎగుమతి చెయ్యటం(ఎత్తడానికి) ఇతరత్రా ఏ ప్రయత్నాలు అక్కర్లేదని మా అబ్బాయి అభిప్రాయం. అంతమంది కలిసినా ఎత్తలేరని నా నిశ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే పట్టు చిక్కడానికి కష్టం. ఒకవేళ కొంచెం ఎత్తినా అలవాటు లేని వాళ్ళు జంకితే బరువు ఎక్కువ అయి వదిలేస్తారు. ఎవరి మీదయినా పడితే ఏ చేతులో విరిగిపోయే ప్రమాదం ఉంది. అందువలన (chain pulley block with tripod) బోర్లలో మోటార్లని దింపడానికి ఉపయోగించేదానిని, ఆ మనుషులు ముగ్గురుని కూడా రమ్మన్నాను.

జనం, ట్రాక్టరు ట్రాలీలు అంతా సూదికొండ ఫారెస్ట్ డిపో దగ్గరకు చేరుకున్నాం. అందరూ ధ్వజస్తంభాన్ని చూసి చాలా ఆనందించారు. మేము D.D. లు ఆఫీసులో ఇచ్చి, రసీదులు ఫారెస్టు పర్మిట్లు తీసుకున్నాము. జనం కర్రకంతా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి హారతి ఇచ్చి మేళంతో మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అందరూ తెచ్చిన భోజనాలు చేసి(వడ్డించిన నలుగురుకి ఏమీ మిగల్చకుండా తినేసి) చెట్ల నీడన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయారు. అప్పుడు అర్ధమయింది ఇందులో నిజంగా దుంగను పైకెత్తటానికి పనికొచ్చేవారు ఎంతమంది ఉన్నారో అని.

stambham_snippet

Chain pulley block ఉండటం వలన పెద్ద శ్రమ లేకుండా దుంగ మొదలు భాగంలో 15 అడుగులు వదిలి పెట్టి Tripod  నిలబెట్టి chain వేసి pulley block తో మెల్లిగా ఒక 6 అడుగుల ఎత్తు లేపారు. తరువాత ట్రాక్టరు మొదటి ట్రక్కుని దాని క్రిందకి తోసి దాని మీదకు దుంగని దింపారు. ఈసారి రెండవ వైపు లేచేలాగ పుల్లీ బ్లాకును జరిపి రెండవ ట్రక్కును దాని క్రిందకు తోసి డ్రాబారు ను మొదటి ట్రక్కు వెనకాల రింగులో పెట్టి Pin పెట్టేశారు. దానితో కర్ర ఎగుమతి ఒక అరగంటలో అయిపోయింది. మేళ తాళాలతో గేటు దాకా రమ్మని Forester గారిని కోరాము. ఆప్రకారంగా ఆయన కూడా జనంతో పాటు భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభానికి వీడ్కోలు చెప్పారు. దారిలో 2 check post లకు తనిఖీ కోసం ఆపవద్దని సమాచారం పంపించారు. జనం జాగ్రత్తగా ట్రక్కుల మీద కూర్చున్నారు. ముందు మేళం ఆటో బయలుదేరింది. గ్రామాలు తగిలినప్పుడు మాత్రమే వాయించ మని చెప్పాము. టర్నింగుల దగ్గర కర్ర ఆచివరకు ఈచివరకు అవసరాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పాము. Permits తీసుకుని ముందుగా Motor Cycle  మీద రెండు చెక్ పోస్టుల వద్ద చూపించి stamping చేయించాము. అందువలన వెనకాల వస్తున్న ట్రాక్టరుకు ఆగవలసిన పని లేకుండా నిదానంగా వచ్చేసింది. బూరుగుపూడి దగ్గర టర్నింగు కొంచెము ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాము కానీ జాగ్రత్తగా కర్ర బుచ్చింపేట చేరిపోయింది.

కొత్తూరు వినాయకుడి దగ్గర ఆపాము. అప్పటికే అక్కడకు చేరిన ఆడవారు హారతులిచ్చి స్వాగతం పలికారు. చీకటి పడిపోయింది. అక్కడ నుండి మేళం వారు నడుచుకుంటూ ముందు దారి తీస్తే మిగతా వాళ్ళం అంతా నడుచుకుంటూ కూడా గుడి దగ్గరకు తీసుకు వెళ్లి దక్షిణం భాగాన ఖాళీలో ఏవిధంగా ఎక్కించామో అదే విధంగా దింపి వేయడం జరిగింది. ఆ మరునాడు కర్రతో పందిరి వేసి తాటాకు కుట్టించాము. ఈ విధంగా ధ్వజస్తంభం కర్ర అడివి లోంచి గుడి దగ్గరకు చేరింది. తరువాత కొన్నాళ్ళకు పై బెరడు ఒక అంగుళం తీసేసి బాడిత పని వారు చేవ ఉండేలాగ తయారు చేసి నల్ల రంగు పూశారు.

ఇత్తడి తొడుగు:

ఇత్తడి తొడుగు తయారు చేయించడానికి కావలసిన ఇత్తడిని ఇళ్లనించి సేకరించుదామని నిర్ణయించాం. అప్పటికే ఇళ్లల్లో ఇత్తడి వాడకం తగ్గిపోయింది. అయినా చాలా మందికి సంవత్సరానికి ఒకసారి తళ తళ లాడే లాగా తోముకుని బోర్లించుకునే అలవాటు పోలేదు. అందుకని ఒక బండి పెట్టుకుని వీధుల్లో ఇంటింటికి ఆగి పనికిరాని ఇత్తడి సామాను ఇమ్మని అడిగాం. కొంత చొరవ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లి ఏదో ఒక పళ్ళెమో బిందో తెచ్చి పడేసే వాళ్ళు. అలాగ ప్రతి ఇంటి నుండి ఎంతో కొంత ఇత్తడిని సేకరించారు. మరి కొన్ని రోజులు ఒక ట్రక్ ఆటో పెట్టుకుని చుట్టు పక్కల ఊళ్ళల్లో కూడా తిరిగారు. బిందెలు, చెంబులు, పళ్ళాలు, గ్లాసులు ఇలాగ ఎన్నోరకాల చిన్న పెద్ద సామాన్లు వాడకంలో లేనివి చాలా వచ్చాయి. కొంత మంది బియ్యం కూడా ఇచ్చారు. అలా సేకరించిన సామాను మొత్తం 20 బస్తాలలో వేసి కుట్టారు. వేటినీ పాడు చెయ్యలేదు. ఆ సామానునంతా రెండు ట్రక్కుఆటోల్లో వేసుకుని రాజమండ్రి ఇత్తడి కొట్టులో దింపి కాటా పెట్టించాము. దాని విలువకు సరిపడ కొత్త మందపాటి ఇత్తడి రేకులను ధ్వజస్తంభం తొడుగు తయారు చేయడానికి కుదుర్చుకున్నసూరిబాబుకు (మండపేట) అప్పజెప్పాము. పని పూర్తయ్యేటప్పటికి సుమారు 4,000 రూపాయలు విలువ చేసే రేకు మాత్రమే కొని ఇవ్వవలసి వచ్చింది. భక్తుల ఇళ్లల్లో ఉండే పనికిరాని ఇత్తడి వస్తువులకు స్వామివారి ధ్వజస్తంభానికి తొడుగుగా మారే భాగ్యం కలిగింది. ఆ తొడుగు ఎన్నో సంవత్సరాలు ఉండేంత మన్నికతో అత్యంత సుందరంగా తయారు చేయబడింది. ఇందులో కొంతమంది తమ ఇత్తడిని చొరవచేసి కలపలేకపోయిన వారు ఉన్నారు. వాళ్లకు ఈ భాగ్యం తరువాత ఏమి చేసినా కలుగదు. దానితో పాటే ఆలయ గోపురాల మీద పెట్టటానికి కలశాలు, ధారాపాత్ర, మకర తోరణాలు, 108 చిన్న శివలింగాలు పెట్టడానికి Plate విడి విడిగా చేయించ బడ్డాయి.

One thought on “7)ధ్వజస్తంభం

  1. Kottu jagadheeswara rao అంటున్నారు:
    Kottu jagadheeswara rao's avatar

    చాలా ఉపయోగపడే లా ఉంది ఈ information.మాకు 39.5 అడుగుల ధ్వజస్తంభం కావాలి.సిద్ధి వినాయక సమేత ఉమా మహశ్వర ఆలయం కు.ఎవరైనా సాయం చేయగలరా?9493622911. జొలపుట్టు గ్రామం. విశాఖ జిల్లా.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి