మన దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయలు పని ప్రారంభించాడానికి ఇబ్బంది లేని నిధిగానే భావించాను కానీ తరువాత ఎటువంటి సహకారం అందదు అని అనుకోలేదు. ఒక దశదాకా పని పూర్తి చేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళ వచ్చని ఆశయం.
తరువాత ఏం చేద్దాం అనేదాని గురించి ఎవ్వరూ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆలా ఆగిపోవటం వలన దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేనట్లే ఉన్నారు. రోజులు నెలలు సంవత్సరాలు గడిచి పోతున్నాయి. 5 సంవత్సరాలయినా ఎటువంటి పురోగతి లేదు. చుట్టూ మళ్ళీ యధాప్రకారంగా కంచి విత్తనం చెట్లు పెరిగిపోయి రోడ్డు మీదకు కట్టడం ఆనవాలు కనపడకుండా పోయింది.
ఈ లోపల ఆ రెండు లక్షల రూపాయలతో ఒక చిన్న గుడి కడితే పోయేదానికి పెద్ద అంచనాతో పెద్ద నిర్మాణం పెట్టేశారు. దీనికి డబ్బు ఎక్కడ నుండి వస్తుందనుకున్నారు? చిన్నది కడితే మెల్లగా అదే అభివృద్ధి చెందుతుంది. అనవసరంగా అటూ ఇటూ కాకుండా ఉన్నదంతా దుర్వినియోగం చేసేశారని ఒకరు తూలనాడారు. ఇది జరగదని మాకు ముందే తెలుసని మరొకరు ఆనంద పడ్డారు. అంతకు ముందు LIC నాగేశ్వరరావు అని పిలువబడే భూస్వామి దగ్గరకు వెళితే అయన చందా ఇవ్వనన్నారు.
ఇలాంటివి ప్రారంభిస్తారు కానీ అనేక రాజకీయాల వల్ల పని జరుగదు. అలా అలా పోగుచేసిన చందాలు కొందరి జేబుల్లోకి వెళ్లిపోతాయి. మీరు పని చేసి రండి ఇస్తాను. అంతే కాని ముందు ఇవ్వనన్నారు. అలాంటివి గుర్తుకు వచ్చాయి. పని పూర్తయిన తరువాత ఆయన్ను మరొకసారి కలిశాము. అప్పుడు కూడా అయన ఏమీ ఇవ్వలేదు. అది వేరొక సంగతి.
అప్పుడు ఆంధ్రాబ్యాంకు మేనేజరుగా ఉన్న భాస్కరరావు గారు నాతో ఈ పరిస్థితికి కారణం ఏమిటని అడిగారు. నేను వివరించి ఆయన్ను ఒకసారి ఊరిలోకి వచ్చి నలుగురితో మాట్లాడి కదిలించమన్నాను. అయన వచ్చి మాట్లాడి వెళ్లారు. ఈ లోపల 15,000 రూపాయలు అందాయి. ఎంతో కొంత పని మొదలు పెడదామని చుట్టూ రైలింగుకు కావలసిన సిమ్మెంటు కోళ్లు తెచ్చి పని ప్రారంభించాను. మళ్ళీ కంచి విత్తనం చెట్లు కొట్టేసి శుభ్రం చేశాము.
దిడ్డి మాధవరావు గారు సహకరించడం మొదలు పెట్టారు. J.C.B. ఒకటి ఊళ్లోకి వచ్చింది. దానిని పెట్టి కోనేరు గట్టు ఏర్పాటు ప్రారంభించాము. రోడ్డు పక్కన కోనేరు పొడుగునా పెద్ద పొడవాటి గొయ్యి ఉండేది. ట్రాక్టర్లని పెట్టి దానిని రోడ్డు లెవలుకు పూడ్చివేసాము. J.C.B. శబ్దం, ట్రాక్టర్ల హడావుడికి జనం పోగయ్యారు. అప్పటికప్పుడు ఆ పనికి సరిపడగా సొమ్ము పోగయ్యింది. పని ప్రారంభించినప్పుడు OIL కి మాత్రమే డబ్బులు ఉన్నాయి. పూర్తయ్యేటప్పటికీ ఇబ్బంది లేకుండా డబ్బులు సరిపెట్టెయ్యగలిగాము.
ఈ లోపల రైతులంతా ఎకరానికి 500 రూపాయలు చందాగా ఇవ్వాలని తర్జన భర్జనలతో నిర్ణయించారు.








