2016 సెప్టెంబరులో గణపతి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఆరు రోజులు గడిచి పోయాయి. అప్పుడే దిడ్డి కనకరాజుగారు ఈ మండపం నిర్మాణం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. నేను గుడి చుట్టూ 10 అడుగుల వెడల్పు ఉండేలాగ తయారు చేయాలన్నాను. దాని గురించి ప్రస్తుతం ఎటువంటి నిధి లేదు. రెండు లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా. దాని గురించి ఎవరినీ అడిగేంత పరిస్థితి లేదు. మన ఊరికి సంబంధించి బయట పని చేసేవారి నుంచి సేకరిద్దామని అనుకున్నాము.
నవరాత్రులలో ఏడవరోజు రాత్రి ఒక చిన్న మట్టి గణపతి ప్రతిమను తీసుకువచ్చి మండపం నిర్మించదలచిన చోట ఈశాన్యం మూల పెట్టి చిన్న పూజ చేశాము. ఆయనకు ఈ మండప నిర్మాణం సమస్య విన్నవించి, చాలా త్వరలో పూర్తి అయ్యేలాగ అనుగ్రహించమని ప్రార్థించాము. ఆ ప్రార్థన విని ఆలయ అర్చక స్వామి ఒకింత ఆశ్చర్యపోయారు. మొదలు ఎలా పెట్టాలో తెలియదు కానీ త్వరగా పూర్తవ్వాలని కోరుకుంటున్నారని.
మా తమ్ముడు కాకాని శ్రీహరిరావుగారి అబ్బాయి విశ్వనాథ్ అమెరికా వెళ్ళుతూ రాజమండ్రి AIR PORT లో నాకు ఒక రూ 10,000 ఇచ్చాడు. మా రెండవ అబ్బాయి కృష్ణ ఒక రూ 10,000 ఇచ్చాడు. మూడు రోజులు గడిచాక చీంద్రిం చిట్టిబాబు గారిని ఒక రూ 30,000 చూడమన్నాను Material తెద్దామని. ఆయన ఒక రోజులో సొమ్ము సిద్ధం చేశారు. మేము మరొక రూ 30,000 తీసుకుని రాజమండ్రి వెళ్ళాము. ముందుగా సిద్ధం చేసుకున్న Design ప్రకారంగా Material ని తీసుకున్నాము. మొత్తం రూ 56,000 అయ్యింది. పని తలపెట్టిన వారం రోజులకు Material వచ్చేసింది. ఈ లోపల రాజమండ్రిలో ఉన్నచీంద్రిం వెంకట కృష్ణ గారిని సంప్రతిస్తే రూ 20,116 ఇచ్చారు. అప్పుడు అదే సమయంలో అక్కడే ఉన్న ఆయన తోడల్లుడిగారి అబ్బాయి నడిశెట్టి శివశేఖర్ గారు ఆ మరునాడే రూ 10,116 పంపించారు. అలాగ పని ప్రారంభం అయ్యింది.
సెప్టెంబరు నెలాఖరు వచ్చేటప్పటికి తూర్పు పడమరలు 70 అడుగులు, ఉత్తర దక్షిణాలు 50 అడుగులు ఉండేలాగ Frame తయారు అయిపోయింది. నర్రావుల శ్రీనుగారు దానికి Painting చేయించారు. Frame Work బాగుందని అందరికీ తెలిసిపోయింది. ఇంక దానికి రేకులు వేయించాలి. దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చవుతుంది. రేకుకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఆసక్తి ఉన్న వాళ్ళు ఇవ్వవచ్చని కరపత్రాలు ప్రింటు వేయించి పంచి పెట్టాము. ఎవరినీ కలిసి అడగలేదు. కానీ అక్టోబరు నెలలో మా పిలుపుకి గొప్ప స్పందన వచ్చింది. కావలసిన సొమ్ము జమ అయ్యింది. వెంటనే నవంబరు నెల మొదటి వారంలో రేకులు బిగించే పని పూర్తయ్యింది. ఆ తరువాత ఒకటి రెండు రోజులలోనే మన ప్రధాన మంత్రి గారు పెద్ద నోట్ల రద్దుని ప్రకటించారు. అంత విచిత్రంగా ఆ పని మొదలు పెట్టడం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వడం జరిగిపోయింది.


యాగశాల తీసివేసిన ప్రాంతం టైలు పని
గుడికి దక్షిణంగా పాత యాగశాల తీసివేసిన ప్రాంతం టైలు పని చేయకుండా ఉండిపోయింది. దానిని పాలిష్ రాళ్ళతో అందంగా తయారు చెయ్యాలని నా అభిమతం. దానికి రూ 50,000 ఖర్చవుతుంది. తరువాత పనిగా చేద్దామనుకున్నాను. ఒకరోజు రాజమండ్రి నుండి శ్రీ C.V.R. రెడ్డి గారు, వారి భార్య, అత్తగారు గుడి చూడటానికి వచ్చారు. అంతకు ముందు ఎప్పుడూ ఆవిడ రాలేదు. రెడ్డిగారు చెప్పిన మాటలు విన్నారంతే. గుడిని చూడకుండానే శ్రీ C.V.R. రెడ్డి గారి అత్తగారు ఆ పని నేను చేయిస్తానని చెప్పారంట. అదే విధంగా వారం గడవకుండా మొత్తం వెయ్యి అడుగులు తెలుపు, నలుపు రంగు పాలిష్ రాళ్ళు పంపించేశారు. మరొక వారం రోజులలో ఫొటోలో కనపడినట్లు పని పూర్తిచేసేశాము.
