దాత అంటే దానం చేసినవాడు అని అర్థం. తీసుకునే వాడిని గ్రహీత అంటాం. సాధారణంగా దానం ఇచ్చేవాడు ఉన్నవాడు తీసుకునేవాడు లేనివాడిగా ఉంటారు. కొన్ని క్రతువులో దానం చేసేవాడి కంటే దానం పట్టేవాళ్ళు ఎన్నో రెట్లు అధికులుగా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరే సంగతి.
కాని ఇక్కడకు వచ్చేటప్పటికి దేవాలయ నిర్మాణానికిగాని, నిర్వహణకు గాని ధన సహాయం చేసే వారిని దాత అనే పదం కంటే సేవకుడు, భక్తుడు అనే పదాలు వాడటమే సబబు అని నా అభిప్రాయం. దాతలు అనిగాని సేవకులు అనిగాని ఎవరి పేరు గోడల మీద రాయటం జరుగలేదు. వెయ్యి రూపాయలు ఇచ్చిన వారి పేరూ లేదు లక్ష రూపాయలు ఇచ్చిన వారి పేరూ లేదు. అన్నీ ఆలయం రికార్డులలో పదిలంగా ఉన్నాయి. భగవంతుడి దృష్టిలో ఎప్పుడూ ఉంటాయి.
ఆలయానికి ఇచ్చిన ద్రవ్యం ఒక రకమైన ఖర్చు. ఇతరత్రా పనులకు పెట్టేది ఇంకొక రకమైన ఖర్చు. కానీ రెండింటి ఫలితాలు వేరు. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. ఆయన కోసం ఇచ్చిన దానిని దేనిని ఉంచుకోడు. అంతకు అంతో ఇంకా ఎంతో వేసి తిరిగి ఇచ్చేస్తాడు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అంశం. ఇది పంట కోసం భూమిలో జల్లే విత్తనాలు వంటిది. భూమిలో ఒక బస్తా గింజలు పోస్తే వంద బస్తాల పంట వస్తుంది. భూమి తనకు ఇచ్చిన దానిని తిరిగి ఎన్నో రెట్లు చేసి తిరిగి ఇచ్చేస్తుంది. మనం ఆయన మనకు ఇచ్చిన దానిలొంచే ఆయనకు కొంచెం ఇస్తున్నాము. ఆయన ఇవ్వనిదే మనకు ఏదీ లేదు. అందుకని దేవుడికి మనం ఏదో ఇచ్చేస్తున్నామన్న భావన ఎవరికీ ఉండక్కరలేదు. ఇస్తే ఏదయినా తరిగిపోతుందేమో అని దాచుకోనక్కరలేదు. ఇచ్చిన దాని కంటే ఎక్కువే తిరిగి వచ్చేస్తుంది. ఇదికూడా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకే అర్థమవుతుంది.
ప్రతి ఒక్కరూ కూడా ఏదో సమయంలో దేవాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఒక నమస్కారం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఖర్చు అవ్వదు. గుడికి వెళితే రూపాయి ఖర్చవుతుందని మానక్కరలేదు. నెలకు ఒకసారి కూడా గుడికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పండగలప్పుడు కూడా రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎక్కడో కాశీనుంచి భగవానుడు మన ఊరికి వస్తే ఆయన మనకు ఇచ్చిన కాళ్ళతో గుడికి వెళ్ళి ఆయన ఇచ్చిన చేతులతో నమస్కారం చేసుకోలేకపోయిన ఈ కాళ్ళకి, కళ్ళకి ప్రయోజనం ఏముంది. ఒకసారి సద్గురు జగ్గీ వాసుదేవ్ గారిని ఒక మహిళ ఇలా అడిగింది. ఏమండీ నాకు శివుడిమీద భక్తి కలగటం లేదు అని. దానికి ఆయన వెంటనే ఏమన్నారంటే “శివుడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు”. అలాగ కొందరికి గుడి కట్టక పూర్వము గుడి కట్టిన తరువాత ఎటువంటి మార్పు రాలేదు.
అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం. గుడి నిర్మాణానికి పూర్వం ఊరంతా పాడు బడ్డట్లు ఉండేది. ఎన్నో సంవత్సరాలనుండి పాడుబడిన ఇళ్ళల్లోనే ఉండేవారు. ఎటువంటి కళ లేదు. ఊరికి ఎటువంటి గుర్తింపు లేదు. అనేకమంది పెళ్ళికాని పిల్లలు (మగ, ఆడ) ఉండేవారు. పెళ్ళిళ్ళు అవ్వటం లేదని వాపోవటం కూడా విన్నాను. గుడి కట్టాకా ఊరికి కళ వచ్చింది. చాలా మంది కొత్త ఇళ్ళు కట్టుకున్నారు. ఊరి రూపురేఖలు మారి పోయాయి. చాలా మందికి వివాహాలు కూడా జరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఇది నిజమా కాదా అని ఆలోచించుకుంటే ఎవరికి వారికే అర్థమయిపోతుంది.
కృష్ణ భగవానుడి కారణంగానే గోకులంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి. అలా అని వారికి తెలియదు. ఆయనేదో మాయింట్లో చొరబడి పాలు, వెన్న దొంగిలిస్తాడనుకుని ఆయనకు వెన్నదొంగ అని పేరు కూడా పెట్టారు. ఆయనకు పెట్టకుండా దాచుకుందామని చూశారు. ఈ వెన్న, పాలు ఆయనవే కదా. ఇంక దొంగతనం ఎక్కడ నుంచి వచ్చింది. ఆయనకు పెట్టకుండా దాచుకుందామనుకునే వాళ్ళే దొంగలు. అలాగ మనం కూడా భగవంతుడు మనకు ఇచ్చిన దానిలో కొంత ఆయనకు తిరిగి ఇవ్వాలి. ఈ ప్రాంతం రోజు రోజుకు అభివృద్ధి చెంది త్వరలోనే గుర్తింపు పొందే స్థాయికి చేరుకుంటుంది.
మన అవయవాలు మన మాట వినేటప్పుడే మంచి పనులు చేసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ జరిగింది. దిడ్డి మాధవరావు గారి తండ్రి కొండలరావు గారు ప్రతిరోజూ వారి బారన్ల దగ్గర కూర్చుండేవారు. అటు వెళ్ళినప్పుడు ఆయన్ను ఇక్కడ దాకా వస్తున్నారు కదా అక్కడకు కూడా రండి అనేవాడిని. ఆయన నాతో “నేను ఇక్కడనుండి చూస్తున్నాను” అనేవారు. కొంతకాలానికి ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తరువాత గుడికి రావాలని తలంపు పుట్టింది. అయితే ఎవరు తీసుకు వస్తారు. మన కాళ్ళు మన మాట వినే రోజుల్లో ఆ తలంపు వస్తే ఇంకొకళ్ళ అవసరం లేకుండా వెళ్ళవచ్చు. ఇప్పుడు తలంపు వచ్చింది కానీ తీసుకు వెళ్ళేవారు లేరు. ఒకటి రెండుసార్లు చక్రాల కుర్చీలో తీసుకువచ్చారు. ఒకసారి ఇద్దరు రెండు చేతులు భుజాల మీద వేసుకుని నడుము పట్టుకుని ప్రదక్షిణ చేయించారు.
ఇది సెప్టెంబరు రెండవ తారీకు 2016 సంవత్సరం. ఇక్కడితో ఈ కథనం ఆపు చేస్తున్నాను. కథ పూర్తవలేదు. ఇంకా ఉంది. ఉంటూనే ఉంటుంది. గుడి చుట్టూ రేకులతో ఎండ, జల్లు పడకుండా బేడా మండపం నిర్మించాలని ఆలోచనలో ఉన్నాము. త్వరలోనే అది సాకారం అవుతుంది. ఇంకా వంటకు వేరే ప్రత్యేకమైన ఏర్పాట్లు, కోనేరు అభివృద్ధి. కోనేరు ఉత్తరం గట్టు రోడ్డుకి చేర్చి ఉన్నదాన్ని రేవు క్రింద అభివృద్ధి చెయ్యడం అలాగ ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ చేయించినవాడు వాటినీ చేయించుకోగలడు.
మూకం కరోతి వాచాలం
పంగుం లంఘయతే గిరిమ్
యత్కృపా తమహం వందే
పరమానంద మాధవం
కృష్ణా, నీ దయతో మూగవాడు మాటకారి అవుతాడు. కుంటివాడు కొండలెక్కగలుగుతాడు. అటువంటి దయతోనే ఎందుకూ పనికిరాని మావంటి వారు ఇటువంటి కార్యాలు చేయగలుగుతారు.
ఎవ్వనిచే జనించు జగము! ఎవ్వనిలోపల నుండు లీనమై! ఎవ్వని యందు డిందు!
పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం బెవ్వడు,
అనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము తానయిన వాడెవ్వడు
వానిన్! ఆత్మభవున్! ఈశ్వరు నే శరణంబు వేడెదన్!