108 పాలరాతి శివలింగాలను కూడా కాశీ క్షేత్రం నుండే తీసుకు రావటం జరిగిందని ముందు రాసి ఉన్నాము. ఈ శివలింగాలను ఉంచడానికి ఒక Table, దాని మీద ఒక ఇత్తడి Plate 4’X4′ సైజుతో చేయించాము. సామూహికంగా అభిషేకాలు చెయ్యవలసి వచ్చినప్పుడు ఒకొక్కరు ఒక శివలింగాన్ని తీసుకుని ఎవరికివారు అభిషేకం చేసుకునేందుకు వాడుతున్నారు. పూలతో పూజించుకున్న తరువాత తిరిగి బల్ల మీద యధా స్థానంలో పెట్టేస్తారు. అంతా ఒక పద్ధతి ప్రకారం చెయ్యడం ముందు నుంచీ అలవాటు చేశాం.

దేవీ నవరాత్రులప్పుడు 10 రోజులు కుంకుమ పూజలకు కూడా ఒక క్రమశిక్షణతో నిర్వహించుకునేందుకు అలవాటు పడ్డారు. 10 రోజులు 10 రకాల నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం జరుగుతోంది. ప్రసాదాలను Gate దగ్గర పంచి పెడతారు. అందరు Q లైనులో అక్కడ తీసుకుని వెళతారు. ఆఖరు రోజున స్వామి వారిని అమ్మ వారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుంది. ఆడపిల్లలు, మగవారు ఎంతో ఉత్సాహంతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. దశమినాడు రాత్రి శమీపూజ, తెప్పోత్సవంతో దసరా సంబరాలు పూర్తవుతాయి.
కృష్ణాష్టమి కూడా ఉట్టి కొట్టే సంబరం ఉత్సాహంగా జరుగుతుంది. వినాయక చవితి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపు చేసి, నిమజ్జనం చెయ్యటం జరుగుతుంది. ప్రతి ఉగాదికి చాలా మంది స్వామివారి దర్శనానికి వస్తారు. పెద్ద పండుగ రోజులలో కూడా సందడి బాగా ఉంటుంది. ఈ విధంగా ఆలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వివాహాలు కూడా జరుపుకుంటుంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు.
ముఖ్యంగా చాలా శివాలయాలలో కొబ్బరికాయలను శివలింగం మీద నీళ్ళు పడేలాగ కత్తితో కొట్టి, ఆ చిప్పలనే పానుపట్టం మీద పెట్టి, నివేదన చేసి ఇస్తూ ఉంటారు.ఇది చాలా తప్పుడు పని. పరమ ఘోరమయిన అపచారం. పానుపట్టం మీద కొబ్బరి చెక్కలు, అరటి పళ్ళు, గంట లాంటివి ఉంచరాదు. అభిషేకం చెయ్యటానికి కొబ్బరి నీరుని ఉపయోగించిన కాయ నివేదనకు పనికి రాదు. ఇక్కడ గుడిలోపల ఒక్క కాయను కూడా కొట్టరు. అలా కొట్టడానికి ఎటువంటి ఏర్పాటు లేదు. ప్రతి ఒక్కరు కొబ్బరి కాయలను బయట కొట్టి తీసుకు రావలసిందే. శివారాధన అత్యంత భయ, భక్తి, శ్రద్ధలతో చేయవలసిన పని. నిర్లక్ష్యం పనికిరాదు.
కార్తీక మాసం 30 రోజులు ఆకాశ దీపం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఒక రోజు లక్ష దీపోత్సవం కూడా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కింద నుంచి స్వామి వారిని అమ్మ వారిని పల్లకీలో ఉంచి మూడు సార్లు దాటిస్తారు. ఆఖరున భక్తులు కూడా జ్వాలా తోరణం దాటుతారు. పెరుగు, వడపప్పు, పానకం, అరటి పళ్ళతో నివేదన చేసి హారతి ఇచ్చి స్వామి వారిని అమ్మ వారిని లోపలకి తీసుకు వెళతారు. కార్తీక మాసం ప్రతీ సోమవారం అన్నదానానికి కూడా ఎక్కువమంది డబ్బులు కడతారు (నలుగురు లేదా అయిదుగురు), అలాగే ఆ రోజులలో నాలుగైదు వందల మంది భోజనం చేస్తారు. 2016 లో ఒక కార్తీక సోమవారానికి 1300 మంది భోజనం చేశారు.