18) గులాబీ సువాసనలు, కృష్ణ భగవానుడి లీల

గులాబీ సువాసనలు

అంతకు ముందు ఒకసారి ఆలయం ప్రారంభానికి ముందు మల్లెపూల వాసనలు వెదజల్లడం గురించి ప్రస్తావించాను. అటువంటి అనుభవం ఇంకొకసారి జరిగింది. మూడు సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు సాయంత్రం మా ఇంటికి రాజమండ్రి నుండి నలుగురు బంధువులు వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో అర్చకులు లేరు. నాకు గుడి తీయవలసిన సమయం అయిపోతుండటం వలన స్నానం చేసి గుడికి బయలుదేరాను. వాళ్ళు కూడా వచ్చారు. సాంప్రదాయ ప్రకారంగా ముందు గంటను కొట్టి తలుపులు తెరిచాను. లోపల నుండి గులాబీల వాసన రావటం మొదలు పెట్టింది.

ఏంటి ఇంత గులాబీ వాసన వస్తోంది అని వాళ్ళు అడిగారు. ఉదయం స్వర్ణ గులాబీ అగరవత్తులు వెలిగించాం. ఇది దాని వాసనే అన్నాను. ఆ వాసన ఒక ఇరవై నిముషాలు అయినా తగ్గలేదు. అలా వస్తూనే ఉంది. ఎప్పుడో ఉదయం వెలిగించిన అగరువత్తుల వాసన సాయంత్రానికి కూడా ఇంతసేపు ఎలా వస్తుంది, అంత గొప్పగా ఉంటాయా ఆ అగరువత్తులు మేము కూడా కొంటాము అన్నారు.

ఇది స్వామివారి మరియొక లీల అని నాకు అర్థమవుతున్నా అదే మాట వాళ్ళతో అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మూర్ఖులకు చెప్పినా అర్థం కాదు. అందుకని వాళ్ళకు చెప్పటానికి ప్రయత్నం చేయకూడదు. ఇదే విషయాన్ని భర్తృహరిగారు తన పద్యంలో వివరించారు.

తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు

దవిళ మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు

తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు

చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు

అర్థం:

కష్టపడి ఇసుకలోంచి నూనెనయినా తియ్యగలం

పరిగెత్తికెళ్ళి ఎండమావిలో నీరైనా తాగగలం

తిరిగి తిరిగి కుందేలు కొమ్మునైనా తేగలం

కానీ మూర్ఖుడి మనస్సును మార్చలేము

అని అర్థం అవుతుంది. అయితే ఇక్కడ గ్రహించవలసిన మరి ఒక సందేశం ఉంది. ఒకటి మూర్ఖుడిని ఒప్పించడం ఎంత కష్ఠమో తెలుసుకోమని చెప్పుతూ, చివర రంజింపరాదు అని అన్నారు. ఇది చెప్పటానికి ప్రయత్నించే వారికి ఇచ్చిన హెచ్చరిక (warning). మూర్ఖుడు అంటే చదువురానివాడు అని కాదు అర్థం. చదువురాని వారు, లేక తక్కువ చదువుకున్న వారంతా మూర్ఖులు కారు. అందులో అతి తక్కువ మంది మాత్రమే ఈకోవలోకి వస్తారు. వాళ్ళు ఎలాంటివారు అని విడిగా వివరించనక్కరలేదు. మూర్ఖులుకాని వారికి ఏదయినా తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే వారికి చెప్పవచ్చును.

ఇంకొక కోవకు చెందిన వారు బలవంతులయిన మూర్ఖులు. బలం అంటే దేహబలం లేక కండబలం కావచ్చు, ధనబలం కూడా కావచ్చు. వీళ్ళు ఇంకా ప్రమాదకరమైన వారు. వీరిని ఆ దేవుడు తప్ప ఎవరూ మార్చలేరు. దున్నపోతుల మంద ఎదురుగా వస్తే, వాటిని తప్పించి ముందుకు వెళ్ళే కంటే మనమే తప్పుకుని అవి వెళ్ళిపోయాక ముందుకు వెళ్ళటం మంచిది కదా! వీళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళకి కూడా ఏదయినా సంఘటన కారణంగా వయస్సు మళ్ళిన కొద్దీ మార్పు రావచ్చు. ఎప్పటికి రాక పోయినా రాక పోవచ్చు. అందుకనే గాంధీగారు తన ప్రార్థనా గీతంలో ‘బలవాన్ కో దేదే జ్ఞాన్’ (బలవంతుడికి జ్ఞానాన్ని ప్రసాదించు) అని భగవంతుడిని ప్రార్థించారు. వీళ్ళకు సాధారణంగా భయంవల్ల భక్తి కలుగుతుంది. ఆ వెంటనే పోతుంది. వీళ్ళకి చేసే పని కంటే పేరు రావాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా పేరు వేయించుకోవాలని ఆరాట పడుతుంటారు. వీళ్ళకు జ్ఞానం రావటం చాలా కష్ఠం.

మూడవ వర్గం వారు బాగా చదువుకున్నవారు. వీరిలో కూడా మూర్ఖులు ఉంటారు. వీరిని చదువుకున్న మూర్ఖులు అని పిలవవచ్చు. వీరికి సైన్సు మరియు లౌకిక జ్ఞానం ఎక్కువ, దేవుడి పట్ల నమ్మకం తక్కువ. వీరికి దేవుడే ఒక పెద్ద మూర్ఖుడు లాగ కనపడతాడు. ఆ దేవుడిని నమ్ముకునే భక్తులు పిచ్చివాళ్ళలాగ కనపడతారు. పూజలు పునస్కారాలకు మూఢనమ్మకం అని ఒక ముద్దు పేరు పెట్టుకుంటారు. సైన్సుని నమ్మవద్దని ఎవరూ చెప్పరు. సైన్సుకి, దైవత్వానికి మధ్య చిన్న గీత ఉంటుంది. ఆ గీత మీద నిలబడి చూడ గలిగితే ఒక పక్క సైన్సు మరొక పక్క దైవత్వం రెండూ కనపడతాయి. అలా చూడము అంటే చేయ గలిగింది ఏమీ లేదు.

అంతా Natural అంటారు. ఆ Nature ని అర్థం చేసుకునేదే సైన్సు. ఒకే విషయంని ఒక విధంగా అర్థం చేసుకుంటే అది scientific out look. మరోవిధంగా అర్థం చేసుకుంటే Religion out look. బాగా బాగా ఉన్నతమైన చదువులు చదివిన మహా మేధావులు ఇంకా బాగా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది మాత్రం మేము నాస్తికవాదులం లేకపోతె హేతువాదులం అని పేరు పెట్టుకుని మేమేదో చాలా గొప్పవాళ్ళమని భావిస్తారు. లోకో భిన్న రుచీః అన్నారు కాబట్టి వాళ్ళకు ఎప్పటికయినా జ్ఞానం కలిగితే భగవతత్వాన్ని అర్థం చేసుకుంటారు. లేకపోతే అలాగే ఉంటారు.

ఇలాంటి సంఘటనలు కొన్ని కోట్లు జరిగాయి ఈ ప్రపంచంలో ఎంతో కాలంగా. అవేవీ కల్పనలు కావు. వాటిని అర్థం చేసుకోగలిగినవారు చేసుకుంటారు. చేసుకోలేనివారు చేసుకోలేరు. చేసుకోలేనివారు ఇతరులను విమర్శించడం మానేస్తే చాలు. కొన్ని నెలల తరువాత వాళ్ళే దసరాలలో అమ్మవారి పూజల సందర్భంగా వచ్చారు. అప్పుడు వారితో పాటు అందరికీ గులాబీ వాసనల మతలబు వివరించడం జరిగింది. అంతకు ముందు జరిగిన మల్లె వాసనలు గురించి కూడా చెప్పడం జరిగింది.

కృష్ణ భగవానుడి లీల

ఒకరోజు సాయంత్రం సుమతిగారు, వెంకటస్వామిగారి భార్య ఆంజనేయస్వామి వారి మండపం మీద కూర్చుని శ్రీకృష్ణ భగవానుడి మందిరం వైపు చూస్తున్నారు. సాయం సమయంలో గుడి దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి sound box లో ఏదో పాట వినిపిస్తోంది. ఇంతలో కృష్ణ భగవానుడు విగ్రహం బయటకు వచ్చి పాటకు అనుగుణంగా నాట్యం చేస్తున్నాడు. అది సుమతిగారికి కనపడింది. అలా చూడు కృష్ణుడు బయటకు వచ్చి నాట్యం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. నీకెలా కనపడుతోంది అని పక్క ఆవిడని అడిగారు. నాక్కూడా అలాగే అనిపిస్తోందని అంది ఆవిడ. ఈ లోపల పాట ఆగిపోయింది. కృష్ణుడు కూడా ఆగిపోయాడు. ఈ విషయం వాళ్ళిద్దరిని సంభ్రమాశ్చర్యంలో ముంచి వేసింది. తరువాత ఎంతో తన్మయత్వంతో ఆ విషయాన్ని చెప్పారు. ఇది ఎవరికి యోగ్యత ఉందో వారికే అర్థమవుతుంది అని వేరే చెప్పనవసరం లేదు.

సాధారణంగా శివాలయాలలో పాలు, పెరుగు అభిషేకాలలో వాడటం వలన, అవి సరిగా బయటకు పోయే మురుగు వ్యవస్థ లేక పోవటం వలన కొంచెము దుర్వాసన వస్తూ ఉంటుంది. దీనికి అనేక మంది నిర్లక్ష్యత కారణం. అలాగే పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచడానికి శ్రద్ధ తీసుకోరు. ఇక్కడ శుభ్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పని చేయడం గమనించ తగ్గ విషయం. అభిషేకం చేసిన ద్రవ్యాలు నేరుగా ఒక ఇత్తడి పాత్రలో పడి, అక్కడనుండి ఒక గొట్టం ద్వారా బయట కుండీలో పడి, అక్కడ నుండి నేరుగా భూమిలో కప్పెట్టబడిన పైపుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. Drainage System బాగుండటం వలన, నీరు నిలవ ఉండకుండా ఉండటం వలన ప్రాంగణంలో ఎటువంటి వాసనా రాదు.

వ్యాఖ్యానించండి