16)రేవులో ఈశ్వరుడి మందిరం, పూజారి ఇల్లు, ఆంజనేయస్వామి వారి మందిరం

రేవులో ఈశ్వరుడి మందిరం

ఎప్పుడో తెచ్చి గాలికి వదిలేసిన శివలింగం విగ్రహాలను ఇక్కడకు తరలించి రేవులో ఏర్పాటు చేస్తే అందరికి స్వయంగా నీళ్ళు పోసుకుని దీపాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని వాటిని తీసుకురావటానికి నిశ్చయించాం. అక్కడ పునాదుల చుట్టూ తుప్పలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. కొందరిని తీసుకుని కత్తులు తీసుకుని ఒక టైరు బండి కూడా పెట్టుకుని అక్కడకు వెళ్ళాము. తుప్పలు నరికి దారి బాగు చేశారు. కొందరు ప్రబుద్ధులు ఆ పునాదులతో పోసిన ఇసుకను తోడుకుపోవటం వల్ల విగ్రహాలు ఒక గజం లోతు గోతిలో దిగిపోయి ఉన్నాయి. ఆ ఇసుక తోడుకుపోయిన వాళ్ళు కనీసం ముందుగా ఆ విగ్రహాలను పునాది మీదకు ఎక్కించడానికి కూడా ప్రయత్నించలేదు. ఇసుకను మాత్రం తోడేసుకున్నారు.

శివుని పానుపట్టం పెద్దదిగా ఉండటం వలన బరువుగా ఉంది. కొంతమంది లోపలికి దిగి మెల్లిగా పునాది మీదకు ఎక్కించారు. దానిని బండి మీదకు గెంటి నంది విగ్రహాన్ని, వినాయకుడిని తీసుకువచ్చాము. అమ్మవారి విగ్రహం తల దగ్గర విరిగిపోయి ఉంది. దానిని కూడా తీసుకువచ్చి బయట చెట్టు దగ్గర పెట్టాము. అలాగ అవి కొన్నాళ్ళు రేవు దగ్గర ఉంది పోయాయి. వినాయకుడి విగ్రహాన్ని మాత్రం ఆలయంలో వినాయకుడి గుడి బయట మండపంలో ఇప్పుడు ఉన్నచోట పెట్టాము. కొన్నాళ్ళకు మా బంధువు ఒకాయన రూ 10,000 ఇచ్చాడు. దానికి ఇంకొక అయిదు వేలు ఖర్చు చేసి రేవులో ఇప్పుడు ఉన్న మాదిరిగా నిర్మాణం చేయడం జరిగింది.

DSC_0437

పూజారి ఇల్లు

అర్చకులకు సరి అయిన వసతి లేదు. పల్లెటూరు అవటం వలన ఎవరికి వారికి సరిపోయేలా ఇళ్ళు కట్టుకుంటారు. ఇంకొక కుటుంబం ఉండే అవకాశం లేదు. మా ఇంటి దగ్గర అంతకు ముందు మేము వాడుకున్న ఒక పెద్ద గది విడిగా ఉంది. అది 20 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పు ఉంటుంది. 2013 వరకూ అర్చకులు ఉండటానికి దానినే ఇచ్చాము. గుడికి దూరంగా, ఒకే ఒక్క గది ఆధారంగా, పాపం చాలా ఇబ్బందిగా ఉండేది. వినాయక్ గారు భార్యతో, చిన్న పిల్లవాడితో అందులోనే చిన్న పిల్లవాడితో ఉండి, ఎటువంటి complaints లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా లెక్క చెయ్యకుండా ఎంతో శ్రద్ధగా పని చేశారు.

2013 సంవత్సరంలో మా కోడలు శ్రీదేవి రెండు లక్షల రూపాయలు ఇచ్చింది. దానికి ఇంకొక 80,000 రూపాయలు కలిపి ఇప్పుడు ఉన్న ఇల్లు కట్టించాము. దానికి నీళ్ళ టేంకు కట్టించి నీటి వసతిని కూడా కల్పించాము. ఆ స్ధలం కూడా పెద్ద గొయ్యి. అక్కడ అలాగ కడితే అనుకూలంగా ఉంటుందని గ్రహించడానికి కూడా చాలా సమయం తీసుకుంది. అంతకు ముందు కట్టిన గది కూడా వాడుకోవడానికి వీలయ్యింది.

im12

ఆంజనేయస్వామి వారి మందిరం

శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి ఒక మందిరం నిర్మించాలని యువకులు నట్టే శ్రీనివాసు ఆధ్వర్యంలో కొంతమంది కలిసి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్కడ కడితే బాగుంటుందో సరిగ్గా అర్థం కాలేదు. స్వామివారి విగ్రహం కూర్చున్నట్లు ఉంటే బాగుంటుందని భావించాము. ముందు ఒక 60,000 అయితే సరిపోవచ్చనుకున్నాము. ఎంతో ఆలోచన చేసి ఇప్పుడు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేశాము. పునాదులు పోసి pillers పోశాక పని ఆగిపోయింది. ఇదంతా మామూలే. అంచనాలకు మించి ఖర్చు అవ్వటం, ఒకో పని ఎక్కువ సమయం పట్టటం. నేను ముందే అన్నాను. ప్రారంభం చేద్దాం. పూర్తి అవుతుంది. ఎప్పటికో చెప్పలేము.

అలాగ ఆగిపోయిన పని దాదాపు ఒక సంవత్సరం తరువాత తిరిగి ప్రారంభం అయ్యింది. కూర్చున్న ఆంజనేయ స్వామి Flexie వేయించి అదే మోడల్ లో విగ్రహం చేయించాము. మిగతా అన్ని పనులు చేసిన శివ చేతే గోపురం పని, విగ్రహం పని, రంగులు వేయించాము. మండపం సైజు, ఎత్తు అన్నీ చాలా బాగా వచ్చాయి. గ్రానైటుతో ఫ్లోరింగు, Tile work అన్నీ చేసేటప్పటికి ఖర్చు రెండు లక్షలు దాటింది. అనంత తేజో దివ్య దర్శనం ప్రారంభం అని 02-Aug-2014 తేదీన జరిపించాము. పులిహోర, అప్పాలు చేయించి పంచి పెడదామనుకున్నాను. కానీ అందరూ కలిసి మళ్ళీ ఊరందరికీ సంతర్పణ చేశారు.

0302245673

అసలే శ్రావణ మాసం వర్షాకాలం కనుక ఏమయినా ఇబ్బంది వస్తుందేమోనని భయపడ్డాం. కాని ఆరోజు పెద్దగా ఎండ లేకుండా ఆకాశం మబ్బులతో చల్లగా ఉంది. వాన రాలేదు. అనుకున్న దాని కన్నా చాలా బాగా కార్యక్రమం జరిగింది. ఆంజనేయస్వామి వారి విగ్రహం ఎంతో అందంగా, తేజోమయంగా, జీవకళ ఉట్టి పడేలాగ మొత్తం ప్రాంగణానికే అందం తెచ్చి పెట్టింది. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆంజనేయ స్వామి వారి రక్ష మొత్తం ఊరికి లభించింది.

DSC_0440

వ్యాఖ్యానించండి