15)అంతులేని కథ ఇంక ప్రారంభం అయ్యింది

అది నిత్య పూజాదికాలు నిర్వహించడం, అనేక పండుగలు చెయ్యడం. నిర్వహణలో ఎదురయ్యే అనేక సమస్యలను నిరంతరం పరిష్కరించడం. ఇంకా కొన్ని నిర్మాణాలు పూర్తి చెయ్యడం. గుడి నిర్మాణంలో ఉండగా బొబ్బిలి లంక నుంచి ఒకాయన వచ్చి గుడి పూర్తయిన తరువాత పూజారిగా ఉంటానని అనేవాడు. గుడి నిర్మాణం అనేక సంవత్సరాలు సాగుతూ ఉంది. ఆయన అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళుతూ ఉండేవాడు. అందువలన పూజారి గురించి పెద్దగా ఆలోచించలేదు.

గుడి పని పూర్తవుతున్న దశలో ఆయనకు కబురు చేశాను. గుడిని చూసి నేను చెయ్యలేనన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో పొద్దున్న వచ్చి, కసేపు దీపారాధన చేసి, రాజమండ్రి పనికి వెళ్ళి, తిరిగి వెళ్ళేటప్పుడు ఒకసారి ఏదో సమయంలో సాయంత్రం పూజ అని చిన్న తంతు చేసుకుని వెళ్ళిపోవచ్చని. వాళ్ళు ఇచ్చే జీతం, గుడి పని Part Time Job గా ఉండాలి, అసలు ఆదాయం వచ్చే పని వేరే. ఇంకా ముఖ్యంగా ఏదో గంట కొట్టి, హారతి ఇచ్చి, రెండు చెంబుల నీళ్ళు, రెండు పువ్వులతో పని కానిస్తే సరిపోతుందనే రకం అని అర్థమయ్యింది.

చాలా పల్లెటూరి గుళ్ళల్లో పూజార్లు వైద్యం చేసుకుంటూనో, ఇతర కార్యక్రమాలు చేసుకుంటూనో గుడి అనేది ఉదయం, సాయంత్రం తంతు లాగానే నిర్వహిస్తున్నారు. అందుకని Part Time అర్చకులకు నెలకు రూ 2,000 కూడా ఇచ్చేవారు కాదు. ఇక్కడ పరిస్థితి చూస్తే అలాగ జరిగేలా కనపడటం లేదు. Full Time అర్చకుడుగా ఉండాల్సిన అవసరం కనపడుతోంది. అటువంటి పరిస్థితిలో తెల్లవారిన దగ్గర నుండి అర్చకుడి అవసరం ఏర్పడింది. కొత్తగుడి. సందర్శకులు ఉంటారు.   అర్చకుడు లేకపోతే తెల్లవారే తలుపులు తీసేవారు ఉండరు.

అందుకని గురువుగారిని సంప్రతించి వారి శిష్యులలో ఎవరయినా ఒకరిని నియమించ వలసినదిగా కోరాము. చాలామంది ఎవరూ ఉండటానికి ఇష్ఠపడలేదు. ఆఖరకు ఒకతను రఘు అనే బ్రహ్మచారి ఉండటానికి సిద్ధపడ్డాడు. అతనికి మా ఇంటిలోనే బస, భోజనం పెట్టేలాగ, నెలకు రూ 3,500 జీతం ఇచ్చేలాగ ఒప్పించి తీసుకున్నాము. పళ్ళెంలో వచ్చే ఆదాయం అతనిదే.

శనివారం ప్రతిష్ఠ అయ్యింది, వెంటనే ఒకరోజు తేడాతో సోమవారం వచ్చేసింది. అతనికి కూడా పూజారిగా ఎటువంటి అనుభవం లేదు. సోమవారం అన్నదానం చేద్దామని అనుకున్నాం. ప్రతిష్ఠ అన్నదానంలో వాడగా కొన్ని సరుకులు మిగిలిపోయాయి. వాటి జతకు రూ 200 పెట్టి కొన్ని కూరలు కొని, ఒక వంద మందికి యాగశాలలో వంట చేశారు.

ఆరోజు సాయంత్రం ఒక 20 మంది గ్రామస్తులు (పెద్దలు) వచ్చి కూర్చున్నారు. అన్నదానం చెయ్యడం కుదరదన్నారు. అలా ప్రతి సోమవారం చెయ్యాలంటే ఎన్ని రూపాయలయినా చాలవు అన్నారు. అప్పుడు నేను వారితో నాకు అన్నదానం చెయ్యాలని కాని, ఈ గుడి నిర్వహణ బాధ్యత తీసుకోవాలని కాని లేదని చెప్పాను. ఏదో రెండు సోమవారాలు చేసి ఆపేస్తాం అని చెప్పాను. ఆ తరువాత అన్ని బాధ్యతలు ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుని వారికి అప్పచెప్ప మన్నాను.

ఆరోజు మధ్యాహ్నం గుడికి వచ్చి భోజనం చేసిన ఒక పొరుగూరు ఆయన ఆరోజు జరిగిన అన్నదానం ఖర్చు క్రింద ఒక రూ 1000 కట్టి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు భోజనం చేసిన మరొకాయన తరువాత సోమవారం అన్నదానం చెయ్యమని మరొక రూ 1000 కట్టేశాడు. అలాగ అనుకోకుండా రెండు సోమవారాలకు అన్నదానం చెయ్యడానికి డబ్బులు సమకూడాయి.

ప్రతిష్ఠ అప్పుడు హుండీలో పడిన డబ్బులు, నా దగ్గర అనేక సందర్భాలలో పోగయిన చిల్లర అంతా ఒక డబ్బాలో వేసి సెట్టాను. అవన్నీ కలిపి సుమారు రూ 10,500 దాకా ఉన్నాయి. Maintenance కోసం గొల్లబాబు గారిని ఎన్నుకున్నారు. ఆయనకు ఈ సొమ్ములు, హుండీ తాళం చెవులు అప్పజెప్పాను. ఇంకొక వారానికి శివరాత్రి వచ్చేసింది. మేము ఎటువంటి ప్రత్యేకమయిన ఏర్పాట్లు చెయ్యలేకపోయాము. కనీసం ఒక 100kg ల పులిహార తయారు చేయించి పంచలేకపోయాము. ఈ విధంగా దగ్గర దగ్గరగా వచ్చిన సందర్భాలకు అనుగుణంగా పనిచేయడానికి కావలసిన సన్నద్ధత ఇంకా జరుగలేదు.

గొల్లబాబు గారి అబ్బాయికి అనారోగ్యంగా ఉండటం వల్ల హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చి ఆయన కూడా ఆ బాధ్యతను కొండలరావు గారికి అప్పజెప్పారు.

ఇంతకీ సమస్య ఏమిటంటే నెల నెలా జీతాలు ఇవ్వటానికి, ఇతర ఖర్చులకు సొమ్ములు ఎలా సమకూరతాయి. హుండీలో వచ్చే ఆదాయం ఏమీ లేదు (అతి తక్కువ). అభిషేకానికి రూ 20 టిక్కెట్టు పెట్టాము. “శివాలయం డబ్బులున్నవాళ్ళకే రా” అని రక రకాల మాటలు వచ్చాయి. వెంటనే ఏ సేవకు ఎటువంటి రుసుములు లేకుండా చేశాము. అన్నదానానికి మాత్రం ఎవరో ఒకరు డబ్బులు కడుతున్నారు. అది మాత్రం ఆటంకం లేకుండా జరుగుతోంది. కొంతమంది ఉత్సాహంగా వచ్చి వంట చెయ్యడానికి సాయం చెయ్యడానికి వస్తున్నారు. స్వామివారితో పాటు అన్నపూర్ణమ్మ తల్లికూడా కాశీ నుండి వచ్చేసింది మరి.

నిర్వహణ ఖర్చులు సమకూర్చుకోవడానికి ఒక పధకం ఆలోచించాము. దాని ప్రకారం ఊరిలో ఉండే రైతులు అందరూ ప్రతీ సంవత్సరం వారి తాహతును పట్టి కొంత మొత్తం చెల్లించాలి. ఆ ప్రకారం చాలా మందిని అనునయించి వారి ఇష్ట ప్రకారం ఎంత ఇవ్వగలరో రాయించాము. కాని అది కూడా సక్రమంగా అమలు కాలేదు. ఇది ఒత్తిడి చేసే విషయం కాదు. మన ఊరిలోని దేవాలయాన్ని నిర్వహించుకోవటానికి కావలసిన నిధిని మనమే సమకూర్చుకోవడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

ప్రారంభంలో చేరిన గురువుగారి శిష్యుడు మూడు నెలలు తిరక్కుండా మానేశాడు. తెల్లవారి గుడి తెరిచి సేవా కార్యక్రమాలు చేసే బాధ్యత మామీద పడిపోయింది. మాకు ఇంటిలో నిత్యం దేవతార్చన అలవాటు ఉంది కాని, ఇంటిలో పనికి గుడిలో పనికి చాలా తేడా ఉంటుంది. ఇంటిలో పనికి బయటివారితో సంబంధం ఉండదు. గుడిలో అర్చకులు నిర్వహించే విధులు చేయటం అలవాటులేదు. అందువలన కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయినా తప్పదు. ఇది రాసే సమయానికి గుడి ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. 5 గురు అర్చకులు మారారు. ఒకాయన వెళ్ళిపోయాక మరొకరు చేరే మధ్య కాలంలో మేమె విధులు నిర్వహించవలసి వచ్చేది. అలా మధ్య మధ్యలో పనిచేసిన మొత్తం కాలము రెండు సంవత్సరాలకు సమానం అయ్యింది. ఆ సమయంలో ఎటువంటి జీతాలు, పళ్ళెం డబ్బులు తీసుకోకపోవడం వల్ల గుడికి కొంత ఆదాయం సమకూడి మిగులులోకి వచ్చేది.

ప్రతి సోమవారం అన్నదానం మాత్రం నిరాటంకంగా సాగిపోతున్నది. మొదటి సంవత్సరం కార్తీక మాసంలో మొత్తం నెల అంతా చేద్దామని కొండలరావుగారు అన్నారు. ప్రతి సోమవారం చేయడమే కష్టంగా ఉంది. పని అంతా స్వచ్ఛందంగా చేయటం వల్లనే జరుగుతోంది. ఎవరికీ ఎటువంటి ఖర్చులు ఇవ్వటం లేదు. 30 రోజులు ప్రతిరోజు చేయటం కష్టం, దానికి కావలసిన దానం సమకూరడానికి 30 మంది కావాలికదా చూద్దాం అన్నాను.

కానీ కార్తీక మాసం వచ్చాకా 30 కంటే ఎక్కువ పేర్లే నమోదయ్యాయి. చేసేవారు కూడా దీక్షగా 30 రోజులు వండటానికి వచ్చారు. అంచనాలకు మించి ఆ నెల అన్నప్రసాద వితరణ జరిగిపోయింది. యాగశాలలో క్రింద మట్టి. వండటానికి పుల్లలే వాడారు. కూర్చోవడానికి పొడవుగా కుట్టిన బరకం గుడ్డలు వాడారు. అయినా అందరూ సంతృప్తి చెందారు.

తరువాత రెండు సంవత్సరాలకు గాని కూర్చోవడానికి Polish రాయి బల్లలు, Polish రాయి టేబుళ్ళు, క్రింద cement గచ్చు చెయ్యలేకపోయాము. తరువాత పుల్లల పొయ్యికి బదులు గ్యాసు పొయ్యి వాడటం మొదలు పెట్టాము. కొన్నాళ్ళకు యాగశాల పడిపోయింది. దానిని తిరిగి పొడుగు పాకలాగ మార్చడం జరిగింది.

రెండవ సంవత్సరం నుండి ప్రతి శివరాత్రికి భారీ అన్నదానం చేయటం మొదలయింది. మొత్తం ఊరిలో ఉండే వారందరికి, మరియు చుట్టుపక్కల ఊళ్ళనుండి వచ్చేవారికి మొత్తం సుమారు రెండు వేల మందికి అన్నదానం జరుగుతూ వస్తోంది.

ప్రతిష్ఠ అయిపోయిన ఒక నెల రోజుల లోపే M.L.A శ్రీ చిట్టూరి రవీంద్రగారు వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని 50,000 రూపాయలు ఇచ్చారు. వాటిని ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులు చేయటానికి వినియోగిస్తామని చెప్పాను. అప్పటికి నవగ్రహ మండపం గోపురం ఫినిషింగు అవ్వలేదు. కృష్ణభగవానుడి విగ్రహం మీద గోపురం లేదు. ధ్వజస్తంభం దిమ్మకు ఫినిషింగు అవ్వలేదు. ఈ పనులు చేయటం మొదలు పెట్టాము.

రేవులో ఈశ్వరుడి మందిరం

వ్యాఖ్యానించండి