14)ప్రతిష్ఠా కార్యక్రమం

12-Feb-2008 ఉదయం మా అబ్బాయి కొవ్వూరు వెళ్ళి గురువుగారిని, వారితో పాటు మా బావమరిది భార్య, వారి అక్కగార్లను తీసుకు వచ్చాడు. వారి శిష్యులు సుమారు 15 మంది ప్రతిష్ఠకు నిర్దేశించిన రాగి యంత్రాలు వగయిరా తీసుకుని వచ్చారు. ఈ యంత్రాలు, వాటి జపాలు ఒక వారం రోజులు ముందు విజయనగరంలోని వారి ఆశ్రమంలో పూర్తి చేసుకువచ్చారు.

01

గురువుగారు ఒక మహోన్నతమైన వ్యక్తి, శక్తి. దేవీ ఉపాసకులు. అటువంటి వ్యక్తులు మన సమాజంలో చాలా అరుదుగా ఉన్నారు. ఆయన గురించి వ్రాయటానికి నా దగ్గర వ్యాక్యాలు లేవు. అంటే నా శక్తి చాలదు అని అర్థం. ఆయన మన గుడి ప్రతిష్ఠ చెయ్యడానికి అంగీకరించడమే మన అదృష్టం. ఆ పని మీద మన ఊరిలో 5 రోజులు ఉండటం మన ఊరికి లభించిన మహా భాగ్యం. ఆయన చేతుల మీదుగా జీవ ప్రతిష్ఠ, శిఖర కలశ ప్రతిష్ఠ జరగటం వలన ఆలయం నిరంతరం తేజోమయంగా దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతోంది.

ఆయన తన తపశ్శక్తిని, దివ్య శక్తిని మన ఆలయంలో స్ధాపించి, ఈ ప్రాంతానికి, సన్నిధికి దివ్యత్వాన్ని ప్రసాదించారు. ఈ విషయం సునిశితమైన గ్రాహక శక్తి కలవారికి మాత్రమే అవగతమవుతుంది. ఆయనకు అనేక మంది ప్రముఖులయిన శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు అంటే ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినవారు అనే అర్థంలో కారు. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయనకు అనుయాయులుగా (Followers) ఉన్నవారు. అటువంటి వారిలో నేను చాలా చిన్నవాడిని. గురువుగారంటే ఒక రకమయిన భయంతో కూడిన భక్తి కలవాడిని.

8

ఆయన కోసం మా ఇంటిలో ఒక A.C. గదిని ఖాళీ చేసి ఒక చెక్క మంచం మీద ఒక కొత్త పరుపు దుప్పటి సిద్ధం చేశాము. అలాగే ఆయన గుడి దగ్గర కార్యక్రమాలలో కూర్చునేటందుకు కాను కొంచెం పెద్దదయిన 9″ ఎత్తు పీట (ఆసనం) చేయించాను. ఆ పీటను చూడగానే ఆయన అవసరం సరిగా గ్రహించి శ్రద్ధ వహించినట్లు ఆయనకు అర్థం అయ్యింది. అలాగే యాగశాల ఏర్పాట్ల పట్ల కూడా సంతృప్తి చెందారు. ఆయనకు అవసరమైన విధంగా యాగశాల నిర్మాణం జరిగిందో లేదో, లేకపొతే ఏవయినా మార్పులు చేర్పులు చేయడానికి ఒక పరిశీలకుడిని ముందుగా పంపలేకపోయారు. మాకు అంతంత మాత్రం అనుభవం వల్ల మేము చేసిన ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేవో అన్న భయం అప్పటికి తీరింది.

గురువుగారు మా ఇంటికి వచ్చాక నేను ఆయనకు ఒక నమస్కారం చేసి ఒక విన్నపం చేసుకున్నాను. “మీకు ఏమి కావాలో అడిగే ధైర్యం నాకు లేదు. ఏమి కావాలన్నా సమకూరుస్తాము. మీరు దయతో ఆదేశించినట్లయితే ఏమి కావాలంటే అది చేస్తాము”. అని. గురువుగారి కూడా వచ్చిన ఇద్దరు (మా బావమరిది భార్య, వారి అక్కగార్లు) ఆయనతో కొంచెము ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నవాళ్ళు. అందువలన వారిద్దరు గురువుగారి అవసరాలను కనిపెట్టి  పనిచేయగలరని తీసుకురావటం జరిగింది. ఆయనకు అంతకు ముందే అనారోగ్యం కారణంగా కొంత సులువుగా లేరు. కార్యక్రమం ప్రారంభమయిన దగ్గర నుండి పూర్తి అయ్యేదాకా సంస్కృతంలో తప్ప తెలుగు మాట్లాడరు. పచ్చి కూరలు, పండ్లు, పాలు తప్ప ఆహారం తీసుకోరు.

కార్యక్రమం ప్రారంభించడానికి ముందు అక్కడకు చేరిన వారిని ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. ఆ తరువాత కార్యక్రమాలు ఆహ్వాన పత్రంలో ముద్రించిన విధంగా వైభవంగా సాగాయి. ప్రతిరోజూ వాన పడింది.(నాలుగు రోజులు). ఒక్క యాగశాల ప్రాంగణం మాత్రం గోవర్ధనగిరి లాగ కనిపించింది. మొత్తం పొడిగా ఉంది. ఫిబ్రవరి నెలలో వానలేం పడతాయి, నీడ ఉంటే చాలు అని నేను అనుకున్న అంచనా తలక్రిందులయ్యింది.

చుట్టుపక్కల ఒక కిలోమీటరు దూరం వరకు వర్షం ముంచెత్తేసింది. నీరు వరదలైపారింది. రాజమండ్రిలో ఒక గంటసేపు తీవ్రమయిన వర్షం పడుతోంది, అక్కడ ఎలాగ ఉందని Phone లో అడిగేవారు. ఇక్కడ కేవలం బట్టతడి చినుకులు మాత్రమే పడ్డాయి. బూరుగుపూడి వరకు, మిర్తిపాడు వరకు తీవ్రంగా కురిసిన వర్షాలు మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు ఆరిపోయిన నేలను కొద్దిగా తడిపి అప్పుడు ఉన్న పంటలను బాగా తయారు అయ్యేలాగ సహకరించాయి. అయిదవ రోజున అన్న దానానికి కాని వచ్చిన జనానికి కాని ఎటువంటి ఇబ్బంది రాకుండా అసలు వర్షమే పడలేదు.

ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ పని నిరాటంకంగా జరగడానికి కావలసిన శక్తి ఎక్కడ నుండి వచ్చిందో తెలుస్తుంది. మూడవ రోజు గురువుగారు స్వల్ప అస్వస్థకు గురి అయ్యారు. ఆయనను వెంటనే విశ్రాంతికి ఇంటికి చేర్చాము. తులసి కోటలో ముందుగానే కొంచెం తులసి నాటి, పెంచి శ్రీకృష్ణ భగవానుని చేర్చాము. ఆయన చిద్విలాసంగా జరుగుతున్న కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.

ఆఖరు రోజు తొక్కిసలాట లేకుండా ఉండటానికి చాలా దూరం నుండి Q line వచ్చేలాగ తాళ్ళు కట్టి, ఎవరూ తిన్నగా లోపలికి రాకుండా గేటు మూసి పెట్టాము. ఈ ఏర్పాట్లు పూర్తవడానికి అర్థరాత్రి దాటిపోయింది. ఉదయం 8:24 కే ముహూర్తం కాబట్టి లోపల తొక్కిసలాట లేకుండా విగ్రహాల ప్రతిష్ఠ జరిగిపోయిన తరువాత జనాల్ని రానిద్దామని ఉద్దేశ్యం. గేటు బయట జనం చేరి ఉన్నారు. లోపల కొద్దిమందితో ఖాళీగా ఉంది. గేటు ఎందుకు వేశామో తెలుసుకోకుండా ఒకాయన గేటు తీసేశాడు. వెంటనే జనమంతా ఒక్కసారిగా లోపలకు వచ్చేశారు. అందువల్ల యాగశాల నుండి విగ్రహాలను లోపలకు తరలించడానికి కష్టమయ్యింది.

నాలుగవరోజు రాత్రి ద్వారపాలకులను, నందీశ్వరుడిని, పానుపట్టాన్ని వాటి స్థానాలలో ఎక్కించారు. ద్వారపాలకులకు నామాలు పెట్టి దండలు వేసేటప్పటికే మండపానికి ఎంతో కళ వచ్చేసింది. కలశాల లోపలకు కావాల్సిన టేకు కర్రలు, ధ్వజస్తంభం క్రింద పెట్టడానికి కావలసిన వెండి ధ్వజస్తంభం ముందుగా చెప్పలేదు. అందువలన వాటిని స్వల్ప వ్యవధిలో సమకూర్చవలసి వచ్చింది.

im10im4im6im5

గురువుగారు ఆలయ శిఖరాల మీద కలశాలను ఉంచడానికి ఎక్కినప్పుడు మా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన శరీరం అందుకు అనువుగా లేదు. అయినా లెక్క చేయకుండా ఎక్కేశారు. మొదటి రోజు రాత్రి మేళం కోసం వచ్చిన వాళ్ళలో ఒకతను చూసుకోకుండా నడచి వచ్చేసి ధ్వజస్తంభం నిలబెట్టడానికి తయారు చేసిన 5 అడుగుల లోతు కుండీలో పడిపోయాడు. అతనిని బయటకు తీశారు. పాపం పెద్దగా దెబ్బలు ఏమీ తగలలేదు. కాసేపటికి అడబాల సోమరాజుగారు కూడా అందులో నిలువునా పడిపోయారు. ఆయన అసలే అవిటి మనిషి, భారీ కాయం. అలాగ పడిపోయిన వాళ్ళకు ఏ ఎముకలు విరగకుండా ఉండటం అసంభవం. అయినా దేవుని దయకు నిదర్శనంగా ఇద్దరికీ ఏమీ జరుగలేదు. ఆ గోతితో ఇటువంటి ప్రమాదం వస్తుందని ముందుగా ఊహించలేకపోవటం మా అసమర్ధతకు నిదర్శనం. ఏమీ జరగకుండా బయట పడటం ఆ పరమాత్మ కృపకు నిదర్శనం.

వెంటనే నాలుగు సప్లై కంపెనీ టేబుళ్ళను నాలుగు వైపులా పడుకోపెట్టి అడ్డు ఏర్పాటు చేశాము. ఆ తరువాత వాటితో గొయ్యి మీద మూత లాగా వేశాము. మళ్ళీ అంచనా తప్పింది. వాటిమీద ఒక్కసారిగా పదిమంది దాకా ఆడవాళ్ళు నిలబడ్డారు. మా ప్రయత్నం గోతిలో ఎవరూ పడకుండా రక్షణకు వేశాము. ఇలా దానిమీదకు ఎక్కి నిలబడతారని ఊహించలేకపోయాం. ఆ పాత టేబుళ్ల దగ్గర అంత మంది బరువు మోసే బలం లేదు. అయినా ఎలా ఆగాయో ఆగాయి. ఆ వెంటనే అంది మీదకు ఎవరూ ఎక్కకుండా ఏర్పాటు చేశాము. మొత్తం మీద ఎవరికీ ఏ ఆపదా రాకుండా రోజులు గడిచి పోయాయి.

ధ్వజస్తంభాన్ని గోతిలో నిలబెట్టడం

ఇది అన్నింటికన్నా కష్ఠమయిన పని. 36 అడుగుల బలమైన కొయ్యని 5 అడుగుల గోతిలో నిలబెట్టాలి. గురువుగారు ధ్వజస్తంభానికి చేయవలసిన పూజాదికాలు పూర్తి చేశారు. గొయ్యి అడుగున వెండి ధ్వజస్తంభాన్ని రాగియంత్రాన్ని ఉంచారు. మనుషులతో తాళ్ళతో పైకి లేపటానికి నేను ఇష్ట పడలేదు. Manage చెయ్యటం కష్ఠం. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక పక్కకి పడిపోతుంది. దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పెద్ద Crane ని రాజమండ్రి నుండి తేవటానికి అవకాశం కనపడలేదు. తూరల ఫ్యాక్టరీ లో ఒక J.C.B ఉంది. దానితో ప్రయత్నం చేద్దామని వాళ్ళని వెళ్ళి అడిగాము. ఇవ్వటానికి అభ్యంతరం లేదు కాని దీనితో పని జరగదన్నారు. ఇంతకంటే తక్కువ బరువు ఎత్తు ఉన్న ధ్వజస్తంభం గుమ్ములూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఎత్తడానికి తీసుకు వెళ్ళి కుదరక పంపేశారని చెప్పారు.  సరే ఏదయితే అదే అవుతుందని J.C.B ని తీసుకువచ్చాము.

జనం తక్కువగా ఉన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పని మొదలు పెట్టాము. పైన పక్కన తాళ్ళు నాలుగు వైపులా లాగటానికి వీలుగా కట్టి, ధ్వజస్తంభం Balance అయ్యేలాగ ఒక మోకును కట్టి J.C.B తో లేపాము. అనేక రకాల ప్రయత్నాలు చేసినా మొదలు గోతిలోకి దింపలేక పోయాము. J.C.B ఇంజను చేసే విపరీతమయిన శబ్దము వలన గట్టిగా అరిచినా వినపడటం లేదు. ఆఖరి ప్రయత్నంగా అప్పటిదాకా వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని మరొక రకమైన ఆలోచన చేసి ప్రయత్నం చేశాము.

భగవంతుని దయవల్ల ఈసారి ఫలితం కనపడింది. మెల్లిగా మొదలు గోతిలోకి దిగింది. వెంటనే దానిని సరిగా మధ్యలో ఉండేలాగ జరిపి, వాలిపోకుండా పైన కట్టిన తాళ్ళను నాలుగు వైపులా బిగించి కట్టాము. మేము తెచ్చిన తాళ్ళు సన్నగా ఉన్నా బలమైన Quality ఎంపిక చేసి తెచ్చాము. అనుకున్న పని అయ్యింది కాబట్టి J.C.B Driver కి మామూలు ఇచ్చి తిరిగి ఫ్యాక్టరీ వారికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళాము. ఈ J.C.B తో 36 అడుగుల పెద్ద కొయ్యను గోతిలో నిలబెట్టగలిగామంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత వెంటనే Line కరెక్టుగా చూసి, నిలువుకూడా సరిగ్గా ఉందని నిర్ధారించుకుని  1 1/2 feet మెటలు, ఇసుక, సిమెంటుతో ఆ గోతిని భూమి మట్టం వరకు concrete తో నింపేశాము. సుమారు 1/2 లారీ మెటలు పట్టింది.

ఈ లోపల మేము కట్టిన తాళ్లుతో నిలబడిన స్థంభాన్ని చూడటానికి బాదే రామచంద్రంగారు వచ్చారు. ఆయనకి ఆ తాళ్ళు దారాలలాగ కనపడ్డాయి. ఇంత సన్న తాళ్ళతో ఆ స్తంభం ఎవరిమీదయినా పడకుండా ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద మోకులు ఉండాలని ఒకటే గంతులు వేయటం మొదలు పెట్టాడు. దానితో ఆవేశం ఆయాసం రావడం మామూలే. ఏదయినా జరిగి, ఈ తాళ్ళు ఆపు చేయలేక కొయ్య ఎవరిమీదయినా పడిపోతే ఆ బాధ్యత మీదే అని కోపంగా వెళ్ళిపోయారు. ఒకసారి కొయ్య దాని మొదలు మీద నిలబడిపోతే తాళ్ళ మీద పెద్ద భారం ఏమీ ఉండదని చెప్పినా వినిపించుకోలేదు. ఇదంతా మామూలే కదా. ఇలాంటివి ఎన్నో పడి పడి అలవాటయిపోయింది. అందువలన ఒక రెండు గంటల పాటు concrete తో గోతిని నేలమట్టం వరకు నింపివేశాక మాకు కూడా బరువు దిగి పోయింది.

ఐదవరోజు 10 గంటల కల్లా యాగశాలలో పూర్ణాహుతి అయిపోయింది. అక్కడ రాత్రి నుండి ఒక 60 మంది వంటవాళ్ళు సహాయకులు వంటలు తయారు చేస్తున్నారు. వాన దేవుడి కరుణ వలన చినుకులు లేవు. షామియానాలు వేశారు. పదకొండు గంటలనుండి అన్నదానం ప్రారంభం అయ్యింది.

కొత్తూరు, పాతూరు మధ్య రోడ్డు మీద ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు. బూరుగుపూడి రోడ్డు, మిర్తిపాడు రోడ్డు కూడా వచ్చే పోయే వారితోను, వాహనాలతోను ఖాళీలేదు. ఊర్లో కూడా అన్ని రోడ్ల నిండా జనమే, అంతా ప్లేట్లలో భోజనమే. వచ్చేవాళ్ళు వస్తున్నారు. తినేవాళ్లు తింటున్నారు. వండేవాళ్ళు వండుతున్నారు. పెట్టేవాళ్ళు పెడుతున్నారు. ఇదంతా ఎలా Regulation జరుగుతోందో మతిలేదు. తెచ్చిన ప్లేట్ల లెక్క ప్రకారం మొత్తం 15,000 మంది దాటిపోయారు. సాయంత్రం 2 లేక 3 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది.

ఆ రాత్రి గురువుగారి చేతుల మీదుగా స్వామివారికి జరిపిన శాంతి కళ్యాణం తో తతంగం పూర్తయ్యింది. ఆరోజు సాయంత్రం 6 గంటలకు నలుగురం మాధవరావుగారి బారన్ల దగ్గర కూర్చుని ఇంకా ఎవరెవరికి ఏమి ఇవ్వాలో లెక్కలు చూస్తున్నాము. వంటవాళ్ళు, లైటింగువాళ్ళు, మేళం, ఫోటోగ్రాఫర్లు ఇంకా ఇతర చిల్లర మల్లర బాకీలు ఉన్నాయి. కంఠం రామ మోహన్ గారు ఒక చోట కూర్చుని ఇంకొందరి సహాయంతో భోజనాలు చేసి వెళ్ళేవారు, పొరుగు ఊరివారు గుడికి విరాళంగా ఇచ్చిన పదులు వందలు లాంటి వాటిని అప్పటికప్పుడు వారి పేరు చదివి పోగుచేశారు. అలావచ్చినవి రూ 60,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. అవి, మా దగ్గర ఉన్న మిగతా డబ్బులు పెట్టి ఒకొక్కళ్ళ Balance లు సద్దుబాటు చేయగలిగాము. గురువుగారికి రూ 50,000 ఇచ్చాము. ఆయనకోసం మరొకరు పంపించిన కారులో వెళ్ళిపోయారు. అంతకు ముందు జపాలు నిమిత్తం వారి అబ్బాయికి రూ 90,000 పంపించామని చెప్పాను.

im11im3

(ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయిన తరువాత గ్రామ పెద్దలు దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ సత్తిరాజు జగన్నాధ రావు గారు, ఆయన సతీమణి శ్రీమతి దుర్గా సూర్య కుమారి గారికి చేసిన సన్మాన కార్యక్రమము)

ఇంకా ధ్వజస్తంభం తొడుగు ఇతర మకర తోరణాలు తయారు చేసినందుకు, తలుపులు తయారు చేసినందుకు బాకీలు ఉన్నాయి. ఈ విషయాలను పట్టించుకోవడానికి ఎవరూ సుముఖంగా లేరు. అలా ఇవ్వతేలిన బాకీలు సుమారు రూ 65,000 వరకూ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పించుకోవడానికి ఇష్టంలేక, ఫలానా గుడికి ఈ పని చేశాం, మాకు డబ్బులు సద్దుబాటు చెయ్యడానికి నానా తిప్పలు పెట్టారు అనే మాట రాకుండా ఉండటానికి ఆ సొమ్ములను నేనే సద్దుబాటు చేయవలసి వచ్చింది.

గుడి నిర్మాణం ప్రారంభించిన నుండి అప్పటి వరకు ఒక్క మనిషి కూడా నాకు ఒక్క రూపాయి వస్తుందని నిలబడి అడిగే అవసరం లేకుండానే పని చేసుకువచ్చాము. ఇసుకకు కాని, సిమ్మెంటుకు కాని, ఇతరత్రా ఏ Material కి కాని ఒక్క గంట కూడా అరువుకు తేలేదు. అలాగే నిర్మాణ సమయంలో ఎవరినీ కానీ ఒక చేత్తో సిగరెట్టు పట్టుకునో లేక నోట్లో సిగరెట్టు ఉంచుకునో పని చెయ్యనియ్య లేదు. వారికి ఆ అవసరం అనిపించినప్పుడు రోడ్డుమీదకు వెళ్ళి కాల్చుకుని ఆ తరువాతే వచ్చి పని చెయ్యమన్నాము. ఇక్కడికి ఒక అంకం ముగిసింది.

వ్యాఖ్యానించండి