21) గుడి చుట్టూ మహా మండప నిర్మాణము

2016 సెప్టెంబరులో గణపతి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఆరు రోజులు గడిచి పోయాయి. అప్పుడే దిడ్డి కనకరాజుగారు ఈ మండపం నిర్మాణం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. నేను గుడి చుట్టూ 10 అడుగుల వెడల్పు ఉండేలాగ తయారు చేయాలన్నాను. దాని గురించి ప్రస్తుతం ఎటువంటి నిధి లేదు. రెండు లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా. దాని గురించి ఎవరినీ అడిగేంత పరిస్థితి లేదు. మన ఊరికి సంబంధించి బయట పని చేసేవారి నుంచి సేకరిద్దామని అనుకున్నాము.

నవరాత్రులలో ఏడవరోజు రాత్రి ఒక చిన్న మట్టి గణపతి ప్రతిమను తీసుకువచ్చి మండపం నిర్మించదలచిన చోట ఈశాన్యం మూల పెట్టి చిన్న పూజ చేశాము. ఆయనకు ఈ మండప నిర్మాణం సమస్య విన్నవించి, చాలా త్వరలో పూర్తి అయ్యేలాగ అనుగ్రహించమని ప్రార్థించాము. ఆ ప్రార్థన విని ఆలయ అర్చక స్వామి ఒకింత ఆశ్చర్యపోయారు. మొదలు ఎలా పెట్టాలో తెలియదు కానీ త్వరగా పూర్తవ్వాలని కోరుకుంటున్నారని.

మా తమ్ముడు కాకాని శ్రీహరిరావుగారి అబ్బాయి విశ్వనాథ్ అమెరికా వెళ్ళుతూ రాజమండ్రి AIR PORT లో నాకు ఒక రూ 10,000 ఇచ్చాడు. మా రెండవ అబ్బాయి కృష్ణ ఒక రూ 10,000 ఇచ్చాడు. మూడు రోజులు గడిచాక చీంద్రిం చిట్టిబాబు గారిని ఒక రూ 30,000 చూడమన్నాను Material తెద్దామని. ఆయన ఒక రోజులో సొమ్ము సిద్ధం చేశారు. మేము మరొక రూ 30,000 తీసుకుని రాజమండ్రి వెళ్ళాము. ముందుగా సిద్ధం చేసుకున్న Design ప్రకారంగా Material ని తీసుకున్నాము. మొత్తం రూ 56,000 అయ్యింది. పని తలపెట్టిన వారం రోజులకు Material వచ్చేసింది. ఈ లోపల రాజమండ్రిలో ఉన్నచీంద్రిం వెంకట కృష్ణ గారిని సంప్రతిస్తే రూ 20,116 ఇచ్చారు. అప్పుడు అదే సమయంలో అక్కడే ఉన్న ఆయన తోడల్లుడిగారి అబ్బాయి నడిశెట్టి శివశేఖర్ గారు ఆ మరునాడే రూ 10,116 పంపించారు. అలాగ పని ప్రారంభం అయ్యింది.

సెప్టెంబరు నెలాఖరు వచ్చేటప్పటికి తూర్పు పడమరలు 70 అడుగులు, ఉత్తర దక్షిణాలు 50 అడుగులు ఉండేలాగ Frame తయారు అయిపోయింది. నర్రావుల శ్రీనుగారు దానికి Painting చేయించారు. Frame Work బాగుందని అందరికీ తెలిసిపోయింది. ఇంక దానికి రేకులు వేయించాలి. దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చవుతుంది. రేకుకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఆసక్తి ఉన్న వాళ్ళు ఇవ్వవచ్చని కరపత్రాలు ప్రింటు వేయించి పంచి పెట్టాము. ఎవరినీ కలిసి అడగలేదు. కానీ అక్టోబరు నెలలో మా పిలుపుకి గొప్ప స్పందన వచ్చింది. కావలసిన సొమ్ము జమ అయ్యింది. వెంటనే నవంబరు నెల మొదటి వారంలో రేకులు బిగించే పని పూర్తయ్యింది. ఆ తరువాత ఒకటి రెండు రోజులలోనే మన ప్రధాన మంత్రి గారు పెద్ద నోట్ల రద్దుని ప్రకటించారు. అంత విచిత్రంగా ఆ పని మొదలు పెట్టడం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవ్వడం జరిగిపోయింది.

DSC_0458DSC_0454

యాగశాల తీసివేసిన ప్రాంతం టైలు పని

గుడికి దక్షిణంగా పాత యాగశాల తీసివేసిన ప్రాంతం టైలు పని చేయకుండా ఉండిపోయింది. దానిని పాలిష్ రాళ్ళతో అందంగా తయారు చెయ్యాలని నా అభిమతం. దానికి రూ 50,000 ఖర్చవుతుంది. తరువాత పనిగా చేద్దామనుకున్నాను. ఒకరోజు రాజమండ్రి నుండి శ్రీ C.V.R. రెడ్డి గారు, వారి భార్య, అత్తగారు గుడి చూడటానికి వచ్చారు. అంతకు ముందు ఎప్పుడూ ఆవిడ రాలేదు. రెడ్డిగారు చెప్పిన మాటలు విన్నారంతే. గుడిని చూడకుండానే శ్రీ C.V.R. రెడ్డి గారి అత్తగారు ఆ పని నేను చేయిస్తానని చెప్పారంట. అదే విధంగా వారం గడవకుండా మొత్తం వెయ్యి అడుగులు తెలుపు, నలుపు రంగు పాలిష్ రాళ్ళు పంపించేశారు. మరొక వారం రోజులలో ఫొటోలో కనపడినట్లు పని పూర్తిచేసేశాము.

DSC_0441

20) ఆలయంలో ఎవరి పేరూ లేదు

దాత అంటే దానం చేసినవాడు అని అర్థం. తీసుకునే వాడిని గ్రహీత అంటాం. సాధారణంగా దానం ఇచ్చేవాడు ఉన్నవాడు తీసుకునేవాడు లేనివాడిగా ఉంటారు. కొన్ని క్రతువులో దానం చేసేవాడి కంటే దానం పట్టేవాళ్ళు ఎన్నో రెట్లు అధికులుగా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరే సంగతి.

కాని ఇక్కడకు వచ్చేటప్పటికి దేవాలయ నిర్మాణానికిగాని, నిర్వహణకు గాని ధన సహాయం చేసే వారిని దాత అనే పదం కంటే సేవకుడు, భక్తుడు అనే పదాలు వాడటమే సబబు అని నా అభిప్రాయం. దాతలు అనిగాని సేవకులు అనిగాని ఎవరి పేరు గోడల మీద రాయటం జరుగలేదు. వెయ్యి రూపాయలు ఇచ్చిన వారి పేరూ లేదు లక్ష రూపాయలు ఇచ్చిన వారి పేరూ లేదు. అన్నీ ఆలయం రికార్డులలో పదిలంగా ఉన్నాయి. భగవంతుడి దృష్టిలో ఎప్పుడూ ఉంటాయి.

ఆలయానికి ఇచ్చిన ద్రవ్యం ఒక రకమైన ఖర్చు. ఇతరత్రా పనులకు పెట్టేది ఇంకొక రకమైన ఖర్చు. కానీ రెండింటి ఫలితాలు వేరు. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. ఆయన కోసం ఇచ్చిన దానిని దేనిని ఉంచుకోడు. అంతకు అంతో ఇంకా ఎంతో వేసి తిరిగి ఇచ్చేస్తాడు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అంశం. ఇది పంట కోసం భూమిలో జల్లే విత్తనాలు వంటిది. భూమిలో ఒక బస్తా గింజలు పోస్తే వంద బస్తాల పంట వస్తుంది. భూమి తనకు ఇచ్చిన దానిని తిరిగి ఎన్నో రెట్లు చేసి తిరిగి ఇచ్చేస్తుంది. మనం ఆయన మనకు ఇచ్చిన దానిలొంచే ఆయనకు కొంచెం ఇస్తున్నాము. ఆయన ఇవ్వనిదే మనకు ఏదీ లేదు. అందుకని దేవుడికి మనం ఏదో ఇచ్చేస్తున్నామన్న భావన ఎవరికీ ఉండక్కరలేదు. ఇస్తే ఏదయినా తరిగిపోతుందేమో అని దాచుకోనక్కరలేదు. ఇచ్చిన దాని కంటే ఎక్కువే తిరిగి వచ్చేస్తుంది. ఇదికూడా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకే అర్థమవుతుంది.

ప్రతి ఒక్కరూ కూడా ఏదో సమయంలో దేవాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఒక నమస్కారం పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఖర్చు అవ్వదు. గుడికి వెళితే రూపాయి ఖర్చవుతుందని మానక్కరలేదు. నెలకు ఒకసారి కూడా గుడికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పండగలప్పుడు కూడా రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎక్కడో కాశీనుంచి భగవానుడు మన ఊరికి వస్తే ఆయన మనకు ఇచ్చిన కాళ్ళతో గుడికి వెళ్ళి ఆయన ఇచ్చిన చేతులతో నమస్కారం చేసుకోలేకపోయిన ఈ కాళ్ళకి, కళ్ళకి ప్రయోజనం ఏముంది. ఒకసారి సద్గురు జగ్గీ వాసుదేవ్ గారిని ఒక మహిళ ఇలా అడిగింది. ఏమండీ నాకు శివుడిమీద భక్తి కలగటం లేదు అని. దానికి ఆయన వెంటనే ఏమన్నారంటే “శివుడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు”. అలాగ కొందరికి గుడి కట్టక పూర్వము గుడి కట్టిన తరువాత ఎటువంటి మార్పు రాలేదు.

అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం. గుడి నిర్మాణానికి పూర్వం ఊరంతా పాడు బడ్డట్లు ఉండేది. ఎన్నో సంవత్సరాలనుండి పాడుబడిన ఇళ్ళల్లోనే ఉండేవారు. ఎటువంటి కళ లేదు. ఊరికి ఎటువంటి గుర్తింపు లేదు. అనేకమంది పెళ్ళికాని పిల్లలు (మగ, ఆడ) ఉండేవారు. పెళ్ళిళ్ళు అవ్వటం లేదని వాపోవటం కూడా విన్నాను. గుడి కట్టాకా ఊరికి కళ వచ్చింది. చాలా మంది కొత్త ఇళ్ళు కట్టుకున్నారు. ఊరి రూపురేఖలు మారి పోయాయి. చాలా మందికి వివాహాలు కూడా జరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ఇది నిజమా కాదా అని ఆలోచించుకుంటే ఎవరికి వారికే అర్థమయిపోతుంది.

కృష్ణ భగవానుడి కారణంగానే గోకులంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి. అలా అని వారికి తెలియదు. ఆయనేదో మాయింట్లో చొరబడి పాలు, వెన్న దొంగిలిస్తాడనుకుని ఆయనకు వెన్నదొంగ అని పేరు కూడా పెట్టారు. ఆయనకు పెట్టకుండా దాచుకుందామని చూశారు. ఈ వెన్న, పాలు ఆయనవే కదా. ఇంక దొంగతనం ఎక్కడ నుంచి వచ్చింది. ఆయనకు పెట్టకుండా దాచుకుందామనుకునే వాళ్ళే దొంగలు. అలాగ మనం కూడా భగవంతుడు మనకు ఇచ్చిన దానిలో కొంత ఆయనకు తిరిగి ఇవ్వాలి. ఈ ప్రాంతం రోజు రోజుకు అభివృద్ధి చెంది త్వరలోనే గుర్తింపు పొందే స్థాయికి చేరుకుంటుంది.

మన అవయవాలు మన మాట వినేటప్పుడే మంచి పనులు చేసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ జరిగింది. దిడ్డి మాధవరావు గారి తండ్రి కొండలరావు గారు ప్రతిరోజూ వారి బారన్ల దగ్గర కూర్చుండేవారు. అటు వెళ్ళినప్పుడు ఆయన్ను ఇక్కడ దాకా వస్తున్నారు కదా అక్కడకు కూడా రండి అనేవాడిని. ఆయన నాతో “నేను ఇక్కడనుండి చూస్తున్నాను” అనేవారు. కొంతకాలానికి ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తరువాత గుడికి రావాలని తలంపు పుట్టింది. అయితే ఎవరు తీసుకు వస్తారు. మన కాళ్ళు మన మాట వినే రోజుల్లో ఆ తలంపు వస్తే ఇంకొకళ్ళ అవసరం లేకుండా వెళ్ళవచ్చు. ఇప్పుడు తలంపు వచ్చింది కానీ తీసుకు వెళ్ళేవారు లేరు. ఒకటి రెండుసార్లు చక్రాల కుర్చీలో తీసుకువచ్చారు. ఒకసారి ఇద్దరు రెండు చేతులు భుజాల మీద వేసుకుని నడుము పట్టుకుని ప్రదక్షిణ చేయించారు.

ఇది సెప్టెంబరు రెండవ తారీకు 2016 సంవత్సరం. ఇక్కడితో ఈ కథనం ఆపు చేస్తున్నాను. కథ పూర్తవలేదు. ఇంకా ఉంది. ఉంటూనే ఉంటుంది. గుడి చుట్టూ రేకులతో ఎండ, జల్లు పడకుండా బేడా మండపం నిర్మించాలని ఆలోచనలో ఉన్నాము. త్వరలోనే అది సాకారం అవుతుంది. ఇంకా వంటకు వేరే ప్రత్యేకమైన ఏర్పాట్లు, కోనేరు అభివృద్ధి. కోనేరు ఉత్తరం గట్టు రోడ్డుకి చేర్చి ఉన్నదాన్ని రేవు క్రింద అభివృద్ధి చెయ్యడం అలాగ ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ చేయించినవాడు వాటినీ చేయించుకోగలడు.

మూకం కరోతి వాచాలం

పంగుం లంఘయతే గిరిమ్

యత్కృపా తమహం వందే

పరమానంద మాధవం

కృష్ణా, నీ దయతో మూగవాడు మాటకారి అవుతాడు. కుంటివాడు కొండలెక్కగలుగుతాడు. అటువంటి దయతోనే ఎందుకూ పనికిరాని మావంటి వారు ఇటువంటి కార్యాలు చేయగలుగుతారు.

ఎవ్వనిచే జనించు జగము! ఎవ్వనిలోపల నుండు లీనమై! ఎవ్వని యందు డిందు!

పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం బెవ్వడు,

అనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము తానయిన వాడెవ్వడు

వానిన్! ఆత్మభవున్! ఈశ్వరు నే శరణంబు వేడెదన్!

19) ఆలయంలో క్రమశిక్షణ, పండుగలు

108 పాలరాతి శివలింగాలను కూడా కాశీ క్షేత్రం నుండే తీసుకు రావటం జరిగిందని ముందు రాసి ఉన్నాము. ఈ శివలింగాలను ఉంచడానికి ఒక Table, దాని మీద ఒక ఇత్తడి Plate 4’X4′ సైజుతో చేయించాము. సామూహికంగా అభిషేకాలు చెయ్యవలసి వచ్చినప్పుడు ఒకొక్కరు ఒక శివలింగాన్ని తీసుకుని ఎవరికివారు అభిషేకం చేసుకునేందుకు వాడుతున్నారు. పూలతో పూజించుకున్న తరువాత తిరిగి బల్ల మీద యధా స్థానంలో పెట్టేస్తారు. అంతా ఒక పద్ధతి ప్రకారం చెయ్యడం ముందు నుంచీ అలవాటు చేశాం.

im9

దేవీ నవరాత్రులప్పుడు 10 రోజులు కుంకుమ పూజలకు కూడా ఒక క్రమశిక్షణతో నిర్వహించుకునేందుకు అలవాటు పడ్డారు. 10 రోజులు 10 రకాల నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం జరుగుతోంది. ప్రసాదాలను Gate దగ్గర పంచి పెడతారు. అందరు Q లైనులో అక్కడ తీసుకుని వెళతారు. ఆఖరు రోజున స్వామి వారిని అమ్మ వారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుంది. ఆడపిల్లలు, మగవారు ఎంతో ఉత్సాహంతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. దశమినాడు రాత్రి శమీపూజ, తెప్పోత్సవంతో దసరా సంబరాలు పూర్తవుతాయి.

కృష్ణాష్టమి కూడా ఉట్టి కొట్టే సంబరం ఉత్సాహంగా జరుగుతుంది. వినాయక చవితి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపు చేసి, నిమజ్జనం చెయ్యటం జరుగుతుంది. ప్రతి ఉగాదికి చాలా మంది స్వామివారి దర్శనానికి వస్తారు. పెద్ద పండుగ రోజులలో కూడా సందడి బాగా ఉంటుంది. ఈ విధంగా ఆలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వివాహాలు కూడా జరుపుకుంటుంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు.

ముఖ్యంగా చాలా శివాలయాలలో కొబ్బరికాయలను శివలింగం మీద నీళ్ళు పడేలాగ కత్తితో కొట్టి, ఆ చిప్పలనే పానుపట్టం మీద పెట్టి, నివేదన చేసి ఇస్తూ ఉంటారు.ఇది చాలా తప్పుడు పని. పరమ ఘోరమయిన అపచారం. పానుపట్టం మీద కొబ్బరి చెక్కలు, అరటి పళ్ళు, గంట లాంటివి ఉంచరాదు. అభిషేకం చెయ్యటానికి కొబ్బరి నీరుని ఉపయోగించిన కాయ నివేదనకు పనికి రాదు. ఇక్కడ గుడిలోపల ఒక్క కాయను కూడా కొట్టరు. అలా కొట్టడానికి ఎటువంటి ఏర్పాటు లేదు. ప్రతి ఒక్కరు కొబ్బరి కాయలను బయట కొట్టి తీసుకు రావలసిందే. శివారాధన అత్యంత భయ, భక్తి, శ్రద్ధలతో చేయవలసిన పని. నిర్లక్ష్యం పనికిరాదు.

కార్తీక మాసం 30 రోజులు ఆకాశ దీపం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఒక రోజు లక్ష దీపోత్సవం కూడా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కింద నుంచి స్వామి వారిని అమ్మ వారిని పల్లకీలో ఉంచి మూడు సార్లు దాటిస్తారు. ఆఖరున భక్తులు కూడా  జ్వాలా తోరణం దాటుతారు. పెరుగు, వడపప్పు, పానకం, అరటి పళ్ళతో నివేదన చేసి హారతి ఇచ్చి స్వామి వారిని అమ్మ వారిని లోపలకి తీసుకు వెళతారు. కార్తీక మాసం ప్రతీ సోమవారం అన్నదానానికి కూడా ఎక్కువమంది డబ్బులు కడతారు (నలుగురు లేదా అయిదుగురు), అలాగే ఆ రోజులలో నాలుగైదు వందల మంది భోజనం చేస్తారు. 2016 లో ఒక కార్తీక సోమవారానికి 1300 మంది భోజనం చేశారు.

18) గులాబీ సువాసనలు, కృష్ణ భగవానుడి లీల

గులాబీ సువాసనలు

అంతకు ముందు ఒకసారి ఆలయం ప్రారంభానికి ముందు మల్లెపూల వాసనలు వెదజల్లడం గురించి ప్రస్తావించాను. అటువంటి అనుభవం ఇంకొకసారి జరిగింది. మూడు సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు సాయంత్రం మా ఇంటికి రాజమండ్రి నుండి నలుగురు బంధువులు వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో అర్చకులు లేరు. నాకు గుడి తీయవలసిన సమయం అయిపోతుండటం వలన స్నానం చేసి గుడికి బయలుదేరాను. వాళ్ళు కూడా వచ్చారు. సాంప్రదాయ ప్రకారంగా ముందు గంటను కొట్టి తలుపులు తెరిచాను. లోపల నుండి గులాబీల వాసన రావటం మొదలు పెట్టింది.

ఏంటి ఇంత గులాబీ వాసన వస్తోంది అని వాళ్ళు అడిగారు. ఉదయం స్వర్ణ గులాబీ అగరవత్తులు వెలిగించాం. ఇది దాని వాసనే అన్నాను. ఆ వాసన ఒక ఇరవై నిముషాలు అయినా తగ్గలేదు. అలా వస్తూనే ఉంది. ఎప్పుడో ఉదయం వెలిగించిన అగరువత్తుల వాసన సాయంత్రానికి కూడా ఇంతసేపు ఎలా వస్తుంది, అంత గొప్పగా ఉంటాయా ఆ అగరువత్తులు మేము కూడా కొంటాము అన్నారు.

ఇది స్వామివారి మరియొక లీల అని నాకు అర్థమవుతున్నా అదే మాట వాళ్ళతో అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మూర్ఖులకు చెప్పినా అర్థం కాదు. అందుకని వాళ్ళకు చెప్పటానికి ప్రయత్నం చేయకూడదు. ఇదే విషయాన్ని భర్తృహరిగారు తన పద్యంలో వివరించారు.

తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు

దవిళ మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు

తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు

చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు

అర్థం:

కష్టపడి ఇసుకలోంచి నూనెనయినా తియ్యగలం

పరిగెత్తికెళ్ళి ఎండమావిలో నీరైనా తాగగలం

తిరిగి తిరిగి కుందేలు కొమ్మునైనా తేగలం

కానీ మూర్ఖుడి మనస్సును మార్చలేము

అని అర్థం అవుతుంది. అయితే ఇక్కడ గ్రహించవలసిన మరి ఒక సందేశం ఉంది. ఒకటి మూర్ఖుడిని ఒప్పించడం ఎంత కష్ఠమో తెలుసుకోమని చెప్పుతూ, చివర రంజింపరాదు అని అన్నారు. ఇది చెప్పటానికి ప్రయత్నించే వారికి ఇచ్చిన హెచ్చరిక (warning). మూర్ఖుడు అంటే చదువురానివాడు అని కాదు అర్థం. చదువురాని వారు, లేక తక్కువ చదువుకున్న వారంతా మూర్ఖులు కారు. అందులో అతి తక్కువ మంది మాత్రమే ఈకోవలోకి వస్తారు. వాళ్ళు ఎలాంటివారు అని విడిగా వివరించనక్కరలేదు. మూర్ఖులుకాని వారికి ఏదయినా తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే వారికి చెప్పవచ్చును.

ఇంకొక కోవకు చెందిన వారు బలవంతులయిన మూర్ఖులు. బలం అంటే దేహబలం లేక కండబలం కావచ్చు, ధనబలం కూడా కావచ్చు. వీళ్ళు ఇంకా ప్రమాదకరమైన వారు. వీరిని ఆ దేవుడు తప్ప ఎవరూ మార్చలేరు. దున్నపోతుల మంద ఎదురుగా వస్తే, వాటిని తప్పించి ముందుకు వెళ్ళే కంటే మనమే తప్పుకుని అవి వెళ్ళిపోయాక ముందుకు వెళ్ళటం మంచిది కదా! వీళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళకి కూడా ఏదయినా సంఘటన కారణంగా వయస్సు మళ్ళిన కొద్దీ మార్పు రావచ్చు. ఎప్పటికి రాక పోయినా రాక పోవచ్చు. అందుకనే గాంధీగారు తన ప్రార్థనా గీతంలో ‘బలవాన్ కో దేదే జ్ఞాన్’ (బలవంతుడికి జ్ఞానాన్ని ప్రసాదించు) అని భగవంతుడిని ప్రార్థించారు. వీళ్ళకు సాధారణంగా భయంవల్ల భక్తి కలుగుతుంది. ఆ వెంటనే పోతుంది. వీళ్ళకి చేసే పని కంటే పేరు రావాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా పేరు వేయించుకోవాలని ఆరాట పడుతుంటారు. వీళ్ళకు జ్ఞానం రావటం చాలా కష్ఠం.

మూడవ వర్గం వారు బాగా చదువుకున్నవారు. వీరిలో కూడా మూర్ఖులు ఉంటారు. వీరిని చదువుకున్న మూర్ఖులు అని పిలవవచ్చు. వీరికి సైన్సు మరియు లౌకిక జ్ఞానం ఎక్కువ, దేవుడి పట్ల నమ్మకం తక్కువ. వీరికి దేవుడే ఒక పెద్ద మూర్ఖుడు లాగ కనపడతాడు. ఆ దేవుడిని నమ్ముకునే భక్తులు పిచ్చివాళ్ళలాగ కనపడతారు. పూజలు పునస్కారాలకు మూఢనమ్మకం అని ఒక ముద్దు పేరు పెట్టుకుంటారు. సైన్సుని నమ్మవద్దని ఎవరూ చెప్పరు. సైన్సుకి, దైవత్వానికి మధ్య చిన్న గీత ఉంటుంది. ఆ గీత మీద నిలబడి చూడ గలిగితే ఒక పక్క సైన్సు మరొక పక్క దైవత్వం రెండూ కనపడతాయి. అలా చూడము అంటే చేయ గలిగింది ఏమీ లేదు.

అంతా Natural అంటారు. ఆ Nature ని అర్థం చేసుకునేదే సైన్సు. ఒకే విషయంని ఒక విధంగా అర్థం చేసుకుంటే అది scientific out look. మరోవిధంగా అర్థం చేసుకుంటే Religion out look. బాగా బాగా ఉన్నతమైన చదువులు చదివిన మహా మేధావులు ఇంకా బాగా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది మాత్రం మేము నాస్తికవాదులం లేకపోతె హేతువాదులం అని పేరు పెట్టుకుని మేమేదో చాలా గొప్పవాళ్ళమని భావిస్తారు. లోకో భిన్న రుచీః అన్నారు కాబట్టి వాళ్ళకు ఎప్పటికయినా జ్ఞానం కలిగితే భగవతత్వాన్ని అర్థం చేసుకుంటారు. లేకపోతే అలాగే ఉంటారు.

ఇలాంటి సంఘటనలు కొన్ని కోట్లు జరిగాయి ఈ ప్రపంచంలో ఎంతో కాలంగా. అవేవీ కల్పనలు కావు. వాటిని అర్థం చేసుకోగలిగినవారు చేసుకుంటారు. చేసుకోలేనివారు చేసుకోలేరు. చేసుకోలేనివారు ఇతరులను విమర్శించడం మానేస్తే చాలు. కొన్ని నెలల తరువాత వాళ్ళే దసరాలలో అమ్మవారి పూజల సందర్భంగా వచ్చారు. అప్పుడు వారితో పాటు అందరికీ గులాబీ వాసనల మతలబు వివరించడం జరిగింది. అంతకు ముందు జరిగిన మల్లె వాసనలు గురించి కూడా చెప్పడం జరిగింది.

కృష్ణ భగవానుడి లీల

ఒకరోజు సాయంత్రం సుమతిగారు, వెంకటస్వామిగారి భార్య ఆంజనేయస్వామి వారి మండపం మీద కూర్చుని శ్రీకృష్ణ భగవానుడి మందిరం వైపు చూస్తున్నారు. సాయం సమయంలో గుడి దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి sound box లో ఏదో పాట వినిపిస్తోంది. ఇంతలో కృష్ణ భగవానుడు విగ్రహం బయటకు వచ్చి పాటకు అనుగుణంగా నాట్యం చేస్తున్నాడు. అది సుమతిగారికి కనపడింది. అలా చూడు కృష్ణుడు బయటకు వచ్చి నాట్యం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. నీకెలా కనపడుతోంది అని పక్క ఆవిడని అడిగారు. నాక్కూడా అలాగే అనిపిస్తోందని అంది ఆవిడ. ఈ లోపల పాట ఆగిపోయింది. కృష్ణుడు కూడా ఆగిపోయాడు. ఈ విషయం వాళ్ళిద్దరిని సంభ్రమాశ్చర్యంలో ముంచి వేసింది. తరువాత ఎంతో తన్మయత్వంతో ఆ విషయాన్ని చెప్పారు. ఇది ఎవరికి యోగ్యత ఉందో వారికే అర్థమవుతుంది అని వేరే చెప్పనవసరం లేదు.

సాధారణంగా శివాలయాలలో పాలు, పెరుగు అభిషేకాలలో వాడటం వలన, అవి సరిగా బయటకు పోయే మురుగు వ్యవస్థ లేక పోవటం వలన కొంచెము దుర్వాసన వస్తూ ఉంటుంది. దీనికి అనేక మంది నిర్లక్ష్యత కారణం. అలాగే పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచడానికి శ్రద్ధ తీసుకోరు. ఇక్కడ శుభ్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పని చేయడం గమనించ తగ్గ విషయం. అభిషేకం చేసిన ద్రవ్యాలు నేరుగా ఒక ఇత్తడి పాత్రలో పడి, అక్కడనుండి ఒక గొట్టం ద్వారా బయట కుండీలో పడి, అక్కడ నుండి నేరుగా భూమిలో కప్పెట్టబడిన పైపుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. Drainage System బాగుండటం వలన, నీరు నిలవ ఉండకుండా ఉండటం వలన ప్రాంగణంలో ఎటువంటి వాసనా రాదు.

17)భోజనశాల నిర్మాణం. గుడి కాంపౌండు లోపల, కోనేరు మెట్లకు టైలు పని

భోజనశాల నిర్మాణం

2015 సంవత్సరం వర్షాకాలం వచ్చేసరికి, అప్పటిదాకా అన్నదానానికి వాడుతున్న పాక శిధిలావస్తకు వచ్చేసింది. దానిని అక్కడ తీసేసి ఇప్పుడు ఉన్న చోట కొత్తగా నిర్మించాలని నిర్ణయించాము. ఆ చోటు కూడా ఎప్పటిలాగా పల్లంగా ఉన్నదే. అందులో ఒక పెద్ద వేపచెట్టు, ఒక మారేడు చెట్టు ఉన్నాయి. వాటిని తీసేసి, తుప్పలు బాగు చేసి పూజారిగారి ఇంటి లైనుకు, కోనేరు compound లైనుకు కలిసేలాగ pillers పోసి, lock beams పోసి, బయటకు వెళ్ళే గేటు మట్టానికి పునాది తయారు చేశాము. దాని మట్టానికి మట్టి పోసి లెవలు చేశాము. తరువాత రేకులు slope ఎలా ఉండాలని, ఎత్తు ఎంత అయితే బాగుంటుందో అనేక అంచనాలు వేసి ఇప్పుడు ఉన్న విధంగా తయారు చేశాము.

అప్పటికి ముందే కట్టి ఉన్న గుడి దక్షిణం compound wall పిల్లర్ల మీద లైట్లు పెట్టడానికని 2″ ప్లాస్టిక్ పైపులను ఉంచి పిల్లర్లు పోయటం జరిగింది. ఆ పైపులలోనే 2″ ఇనప పైపులను Double slot చేసి OIL రాసి దిగగొట్టేశాము. అలాగే కొత్త పిల్లర్లలో కూడా 2″ ఇనప పైపులను ముందు design ప్రకారంగా slope వచ్చేలాగ అమర్చి పలక పైపులతో ఫ్రేము వెల్డింగు చేయించాము. దానిమీద ఒక్క జాయింటు మాత్రమే వచ్చేలాగ 16 అడుగులు 12 అడుగులు పొడవుగల రేకులు వాడి Roof తయారు చేశాము. ఒకేసారి 60 మంది భోజనం చేసేలాగ రెండు వైపుల అనుకూలంగా sitting and dining టేబుళ్ళను పాలిష్ రాళ్ళతో నిర్మించాము. క్రింద మొత్తం కాంక్రీటు ఫ్లోరింగు చేశాము.

ఈ పనంతా రెండు నెలల వ్యవధిలో పూర్తయ్యింది. 2015 దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి నాడు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి, వారితో గృహప్రవేశం లాంటి ప్రారంభోత్సవం చేసి, వారిని ఉత్తరం చివర ఉంచి, అన్నదానంతో ప్రారంభించాము.

కొద్దిరోజుల తరువాత రాజమండ్రి నుండి వచ్చి ఈ ఊరిలో రెండెకరాల పొలం కొన్న రెడ్డిగారు దానికి Tiles వేయించడానికి ముందుకు వచ్చారు. వారి సహకారంతో Flooring అంతా Tile Work చేయించాము. ఆ వెంటనే కార్తీక మాసంలో వచ్చిన సోమవారాలలో ఎప్పటి కంటే ఎక్కువగా అన్నదానం జరిగింది. కనక దుర్గ అమ్మవారి Flexie వేయించి ఉత్తరం చివర అమర్చాము. తప్పని పరిస్థితులలో తెగించి మొదలు పెట్టిన నిర్మాణము ఆ పరమాత్మ దయవల్ల పూర్తి అయ్యింది. ఇది ఎవరి అంచనాలకు అందలేదు. పూజారిగారి ఇంటికి కూడా ముందు భాగంలో రేకులతో ఇంపుగా ఒక Portico లాగ పూర్తి చేయగలిగాము. అందువలన నీడతోపాటు వర్షపు జల్లులు అరుగుల మీద, ఇంటిలోను పడకుండా రక్షణ ఏర్పడింది.

DSC_0453

గుడి కాంపౌండు లోపల, కోనేరు మెట్లకు టైలు పని

రాజమండ్రిలో బంగారం వర్తకులు శ్రీ కాళేపల్లి తారకేశ్వరరావు, వారి కుమారుడు ప్రసాద్ గార్లకు ఈ ఊరిలో కొంత భూమి ఉంది. గుడి నిర్మాణం ప్రారంభించినప్పుడు ఊరిలో భూములు ఉన్న రైతులందరి దగ్గర విరాళాలు సేకరించే ప్రయత్నంలో వారి దగ్గరకు కూడా వెళ్ళాం. అప్పట్లో వారు రూ 10,000 తమ వంతు విరాళంగా ఇచ్చారు.

నిర్మాణం పూర్తి అయిన తరువాత అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకునే వారు. ప్రతి శివరాత్రికి రూ 2,000 విరాళంగా అన్నదానానికి ఇచ్చేవారు. 2015 వ సంవత్సరంలో దసరాలకు ముందు ఒకసారి గుడికి వచ్చినప్పుడు ఈ ప్రాంగణమంతా Tile Work చేయించడానికి అంగీకరించారు. అంతకు ముందు ఒక సంవత్సరం నుండి అంటున్నారు. మేము మొత్తం కొలతలు తీసి సుమారు ఆరువేల అడుగులు వస్తుందని నివేదిక ఇచ్చాము. కొంతమంది Phone చెయ్యమని అన్నారు కాని నేను చెయ్యలేదు. నేను చెప్తే అయ్యేది కాదు. స్వామి ఎప్పుడు ప్రేరణ కలిగిస్తే అప్పుడే అవుతుంది. 2015 డిశెంబరు నెలలో Tiles ని, మేస్త్రీలని పంపించారు. ఇసుక దొరకటం చాలా ఇబ్బందిగా ఉన్న రోజులు అవి. ఒక ట్రక్కు ఖరీదు నాలుగు వేలు అవుతోంది. మొత్తం ఖర్చు మూడు లక్షల రూపాయలు దాటింది. పనంతా పూర్తయిన తరువాత ఊరంతా అన్నదానం చేశారు. వారి కుటుంబాలను వస్త్రాలు పెట్టి సత్కరించి పంపించాము. ఒక్కొక్కరికి నాలుగు పుస్తకాల Set బహుమతిగా ఇచ్చాము. అవి

  1. ఒక యోగి ఆత్మ కథ
  2. నాహం కర్తా హరిః కర్తా
  3. నడిచే దేముడు
  4. శివుడే దేవాది దేవుడు

ఈ పుస్తకాలను శ్రద్ధగా చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది. మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఎన్నో దివ్యమయిన విషయానుభూతులు కలుగుతాయి. ఆ ఫ్లోరింగు పని పూర్తయ్యేటప్పటికి దేవాలయం రూపురేఖలు ఎంతో మారిపోయాయి. ఈ పనులు 2016 జనవరి నెలలో పండగ ముందు పూర్తి అయ్యాయి.

DSC_0454DSC_0458DSC_0429

16)రేవులో ఈశ్వరుడి మందిరం, పూజారి ఇల్లు, ఆంజనేయస్వామి వారి మందిరం

రేవులో ఈశ్వరుడి మందిరం

ఎప్పుడో తెచ్చి గాలికి వదిలేసిన శివలింగం విగ్రహాలను ఇక్కడకు తరలించి రేవులో ఏర్పాటు చేస్తే అందరికి స్వయంగా నీళ్ళు పోసుకుని దీపాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని వాటిని తీసుకురావటానికి నిశ్చయించాం. అక్కడ పునాదుల చుట్టూ తుప్పలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. కొందరిని తీసుకుని కత్తులు తీసుకుని ఒక టైరు బండి కూడా పెట్టుకుని అక్కడకు వెళ్ళాము. తుప్పలు నరికి దారి బాగు చేశారు. కొందరు ప్రబుద్ధులు ఆ పునాదులతో పోసిన ఇసుకను తోడుకుపోవటం వల్ల విగ్రహాలు ఒక గజం లోతు గోతిలో దిగిపోయి ఉన్నాయి. ఆ ఇసుక తోడుకుపోయిన వాళ్ళు కనీసం ముందుగా ఆ విగ్రహాలను పునాది మీదకు ఎక్కించడానికి కూడా ప్రయత్నించలేదు. ఇసుకను మాత్రం తోడేసుకున్నారు.

శివుని పానుపట్టం పెద్దదిగా ఉండటం వలన బరువుగా ఉంది. కొంతమంది లోపలికి దిగి మెల్లిగా పునాది మీదకు ఎక్కించారు. దానిని బండి మీదకు గెంటి నంది విగ్రహాన్ని, వినాయకుడిని తీసుకువచ్చాము. అమ్మవారి విగ్రహం తల దగ్గర విరిగిపోయి ఉంది. దానిని కూడా తీసుకువచ్చి బయట చెట్టు దగ్గర పెట్టాము. అలాగ అవి కొన్నాళ్ళు రేవు దగ్గర ఉంది పోయాయి. వినాయకుడి విగ్రహాన్ని మాత్రం ఆలయంలో వినాయకుడి గుడి బయట మండపంలో ఇప్పుడు ఉన్నచోట పెట్టాము. కొన్నాళ్ళకు మా బంధువు ఒకాయన రూ 10,000 ఇచ్చాడు. దానికి ఇంకొక అయిదు వేలు ఖర్చు చేసి రేవులో ఇప్పుడు ఉన్న మాదిరిగా నిర్మాణం చేయడం జరిగింది.

DSC_0437

పూజారి ఇల్లు

అర్చకులకు సరి అయిన వసతి లేదు. పల్లెటూరు అవటం వలన ఎవరికి వారికి సరిపోయేలా ఇళ్ళు కట్టుకుంటారు. ఇంకొక కుటుంబం ఉండే అవకాశం లేదు. మా ఇంటి దగ్గర అంతకు ముందు మేము వాడుకున్న ఒక పెద్ద గది విడిగా ఉంది. అది 20 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పు ఉంటుంది. 2013 వరకూ అర్చకులు ఉండటానికి దానినే ఇచ్చాము. గుడికి దూరంగా, ఒకే ఒక్క గది ఆధారంగా, పాపం చాలా ఇబ్బందిగా ఉండేది. వినాయక్ గారు భార్యతో, చిన్న పిల్లవాడితో అందులోనే చిన్న పిల్లవాడితో ఉండి, ఎటువంటి complaints లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా లెక్క చెయ్యకుండా ఎంతో శ్రద్ధగా పని చేశారు.

2013 సంవత్సరంలో మా కోడలు శ్రీదేవి రెండు లక్షల రూపాయలు ఇచ్చింది. దానికి ఇంకొక 80,000 రూపాయలు కలిపి ఇప్పుడు ఉన్న ఇల్లు కట్టించాము. దానికి నీళ్ళ టేంకు కట్టించి నీటి వసతిని కూడా కల్పించాము. ఆ స్ధలం కూడా పెద్ద గొయ్యి. అక్కడ అలాగ కడితే అనుకూలంగా ఉంటుందని గ్రహించడానికి కూడా చాలా సమయం తీసుకుంది. అంతకు ముందు కట్టిన గది కూడా వాడుకోవడానికి వీలయ్యింది.

im12

ఆంజనేయస్వామి వారి మందిరం

శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి ఒక మందిరం నిర్మించాలని యువకులు నట్టే శ్రీనివాసు ఆధ్వర్యంలో కొంతమంది కలిసి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్కడ కడితే బాగుంటుందో సరిగ్గా అర్థం కాలేదు. స్వామివారి విగ్రహం కూర్చున్నట్లు ఉంటే బాగుంటుందని భావించాము. ముందు ఒక 60,000 అయితే సరిపోవచ్చనుకున్నాము. ఎంతో ఆలోచన చేసి ఇప్పుడు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేశాము. పునాదులు పోసి pillers పోశాక పని ఆగిపోయింది. ఇదంతా మామూలే. అంచనాలకు మించి ఖర్చు అవ్వటం, ఒకో పని ఎక్కువ సమయం పట్టటం. నేను ముందే అన్నాను. ప్రారంభం చేద్దాం. పూర్తి అవుతుంది. ఎప్పటికో చెప్పలేము.

అలాగ ఆగిపోయిన పని దాదాపు ఒక సంవత్సరం తరువాత తిరిగి ప్రారంభం అయ్యింది. కూర్చున్న ఆంజనేయ స్వామి Flexie వేయించి అదే మోడల్ లో విగ్రహం చేయించాము. మిగతా అన్ని పనులు చేసిన శివ చేతే గోపురం పని, విగ్రహం పని, రంగులు వేయించాము. మండపం సైజు, ఎత్తు అన్నీ చాలా బాగా వచ్చాయి. గ్రానైటుతో ఫ్లోరింగు, Tile work అన్నీ చేసేటప్పటికి ఖర్చు రెండు లక్షలు దాటింది. అనంత తేజో దివ్య దర్శనం ప్రారంభం అని 02-Aug-2014 తేదీన జరిపించాము. పులిహోర, అప్పాలు చేయించి పంచి పెడదామనుకున్నాను. కానీ అందరూ కలిసి మళ్ళీ ఊరందరికీ సంతర్పణ చేశారు.

0302245673

అసలే శ్రావణ మాసం వర్షాకాలం కనుక ఏమయినా ఇబ్బంది వస్తుందేమోనని భయపడ్డాం. కాని ఆరోజు పెద్దగా ఎండ లేకుండా ఆకాశం మబ్బులతో చల్లగా ఉంది. వాన రాలేదు. అనుకున్న దాని కన్నా చాలా బాగా కార్యక్రమం జరిగింది. ఆంజనేయస్వామి వారి విగ్రహం ఎంతో అందంగా, తేజోమయంగా, జీవకళ ఉట్టి పడేలాగ మొత్తం ప్రాంగణానికే అందం తెచ్చి పెట్టింది. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆంజనేయ స్వామి వారి రక్ష మొత్తం ఊరికి లభించింది.

DSC_0440

15)అంతులేని కథ ఇంక ప్రారంభం అయ్యింది

అది నిత్య పూజాదికాలు నిర్వహించడం, అనేక పండుగలు చెయ్యడం. నిర్వహణలో ఎదురయ్యే అనేక సమస్యలను నిరంతరం పరిష్కరించడం. ఇంకా కొన్ని నిర్మాణాలు పూర్తి చెయ్యడం. గుడి నిర్మాణంలో ఉండగా బొబ్బిలి లంక నుంచి ఒకాయన వచ్చి గుడి పూర్తయిన తరువాత పూజారిగా ఉంటానని అనేవాడు. గుడి నిర్మాణం అనేక సంవత్సరాలు సాగుతూ ఉంది. ఆయన అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళుతూ ఉండేవాడు. అందువలన పూజారి గురించి పెద్దగా ఆలోచించలేదు.

గుడి పని పూర్తవుతున్న దశలో ఆయనకు కబురు చేశాను. గుడిని చూసి నేను చెయ్యలేనన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో పొద్దున్న వచ్చి, కసేపు దీపారాధన చేసి, రాజమండ్రి పనికి వెళ్ళి, తిరిగి వెళ్ళేటప్పుడు ఒకసారి ఏదో సమయంలో సాయంత్రం పూజ అని చిన్న తంతు చేసుకుని వెళ్ళిపోవచ్చని. వాళ్ళు ఇచ్చే జీతం, గుడి పని Part Time Job గా ఉండాలి, అసలు ఆదాయం వచ్చే పని వేరే. ఇంకా ముఖ్యంగా ఏదో గంట కొట్టి, హారతి ఇచ్చి, రెండు చెంబుల నీళ్ళు, రెండు పువ్వులతో పని కానిస్తే సరిపోతుందనే రకం అని అర్థమయ్యింది.

చాలా పల్లెటూరి గుళ్ళల్లో పూజార్లు వైద్యం చేసుకుంటూనో, ఇతర కార్యక్రమాలు చేసుకుంటూనో గుడి అనేది ఉదయం, సాయంత్రం తంతు లాగానే నిర్వహిస్తున్నారు. అందుకని Part Time అర్చకులకు నెలకు రూ 2,000 కూడా ఇచ్చేవారు కాదు. ఇక్కడ పరిస్థితి చూస్తే అలాగ జరిగేలా కనపడటం లేదు. Full Time అర్చకుడుగా ఉండాల్సిన అవసరం కనపడుతోంది. అటువంటి పరిస్థితిలో తెల్లవారిన దగ్గర నుండి అర్చకుడి అవసరం ఏర్పడింది. కొత్తగుడి. సందర్శకులు ఉంటారు.   అర్చకుడు లేకపోతే తెల్లవారే తలుపులు తీసేవారు ఉండరు.

అందుకని గురువుగారిని సంప్రతించి వారి శిష్యులలో ఎవరయినా ఒకరిని నియమించ వలసినదిగా కోరాము. చాలామంది ఎవరూ ఉండటానికి ఇష్ఠపడలేదు. ఆఖరకు ఒకతను రఘు అనే బ్రహ్మచారి ఉండటానికి సిద్ధపడ్డాడు. అతనికి మా ఇంటిలోనే బస, భోజనం పెట్టేలాగ, నెలకు రూ 3,500 జీతం ఇచ్చేలాగ ఒప్పించి తీసుకున్నాము. పళ్ళెంలో వచ్చే ఆదాయం అతనిదే.

శనివారం ప్రతిష్ఠ అయ్యింది, వెంటనే ఒకరోజు తేడాతో సోమవారం వచ్చేసింది. అతనికి కూడా పూజారిగా ఎటువంటి అనుభవం లేదు. సోమవారం అన్నదానం చేద్దామని అనుకున్నాం. ప్రతిష్ఠ అన్నదానంలో వాడగా కొన్ని సరుకులు మిగిలిపోయాయి. వాటి జతకు రూ 200 పెట్టి కొన్ని కూరలు కొని, ఒక వంద మందికి యాగశాలలో వంట చేశారు.

ఆరోజు సాయంత్రం ఒక 20 మంది గ్రామస్తులు (పెద్దలు) వచ్చి కూర్చున్నారు. అన్నదానం చెయ్యడం కుదరదన్నారు. అలా ప్రతి సోమవారం చెయ్యాలంటే ఎన్ని రూపాయలయినా చాలవు అన్నారు. అప్పుడు నేను వారితో నాకు అన్నదానం చెయ్యాలని కాని, ఈ గుడి నిర్వహణ బాధ్యత తీసుకోవాలని కాని లేదని చెప్పాను. ఏదో రెండు సోమవారాలు చేసి ఆపేస్తాం అని చెప్పాను. ఆ తరువాత అన్ని బాధ్యతలు ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుని వారికి అప్పచెప్ప మన్నాను.

ఆరోజు మధ్యాహ్నం గుడికి వచ్చి భోజనం చేసిన ఒక పొరుగూరు ఆయన ఆరోజు జరిగిన అన్నదానం ఖర్చు క్రింద ఒక రూ 1000 కట్టి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు భోజనం చేసిన మరొకాయన తరువాత సోమవారం అన్నదానం చెయ్యమని మరొక రూ 1000 కట్టేశాడు. అలాగ అనుకోకుండా రెండు సోమవారాలకు అన్నదానం చెయ్యడానికి డబ్బులు సమకూడాయి.

ప్రతిష్ఠ అప్పుడు హుండీలో పడిన డబ్బులు, నా దగ్గర అనేక సందర్భాలలో పోగయిన చిల్లర అంతా ఒక డబ్బాలో వేసి సెట్టాను. అవన్నీ కలిపి సుమారు రూ 10,500 దాకా ఉన్నాయి. Maintenance కోసం గొల్లబాబు గారిని ఎన్నుకున్నారు. ఆయనకు ఈ సొమ్ములు, హుండీ తాళం చెవులు అప్పజెప్పాను. ఇంకొక వారానికి శివరాత్రి వచ్చేసింది. మేము ఎటువంటి ప్రత్యేకమయిన ఏర్పాట్లు చెయ్యలేకపోయాము. కనీసం ఒక 100kg ల పులిహార తయారు చేయించి పంచలేకపోయాము. ఈ విధంగా దగ్గర దగ్గరగా వచ్చిన సందర్భాలకు అనుగుణంగా పనిచేయడానికి కావలసిన సన్నద్ధత ఇంకా జరుగలేదు.

గొల్లబాబు గారి అబ్బాయికి అనారోగ్యంగా ఉండటం వల్ల హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చి ఆయన కూడా ఆ బాధ్యతను కొండలరావు గారికి అప్పజెప్పారు.

ఇంతకీ సమస్య ఏమిటంటే నెల నెలా జీతాలు ఇవ్వటానికి, ఇతర ఖర్చులకు సొమ్ములు ఎలా సమకూరతాయి. హుండీలో వచ్చే ఆదాయం ఏమీ లేదు (అతి తక్కువ). అభిషేకానికి రూ 20 టిక్కెట్టు పెట్టాము. “శివాలయం డబ్బులున్నవాళ్ళకే రా” అని రక రకాల మాటలు వచ్చాయి. వెంటనే ఏ సేవకు ఎటువంటి రుసుములు లేకుండా చేశాము. అన్నదానానికి మాత్రం ఎవరో ఒకరు డబ్బులు కడుతున్నారు. అది మాత్రం ఆటంకం లేకుండా జరుగుతోంది. కొంతమంది ఉత్సాహంగా వచ్చి వంట చెయ్యడానికి సాయం చెయ్యడానికి వస్తున్నారు. స్వామివారితో పాటు అన్నపూర్ణమ్మ తల్లికూడా కాశీ నుండి వచ్చేసింది మరి.

నిర్వహణ ఖర్చులు సమకూర్చుకోవడానికి ఒక పధకం ఆలోచించాము. దాని ప్రకారం ఊరిలో ఉండే రైతులు అందరూ ప్రతీ సంవత్సరం వారి తాహతును పట్టి కొంత మొత్తం చెల్లించాలి. ఆ ప్రకారం చాలా మందిని అనునయించి వారి ఇష్ట ప్రకారం ఎంత ఇవ్వగలరో రాయించాము. కాని అది కూడా సక్రమంగా అమలు కాలేదు. ఇది ఒత్తిడి చేసే విషయం కాదు. మన ఊరిలోని దేవాలయాన్ని నిర్వహించుకోవటానికి కావలసిన నిధిని మనమే సమకూర్చుకోవడం మన బాధ్యత అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

ప్రారంభంలో చేరిన గురువుగారి శిష్యుడు మూడు నెలలు తిరక్కుండా మానేశాడు. తెల్లవారి గుడి తెరిచి సేవా కార్యక్రమాలు చేసే బాధ్యత మామీద పడిపోయింది. మాకు ఇంటిలో నిత్యం దేవతార్చన అలవాటు ఉంది కాని, ఇంటిలో పనికి గుడిలో పనికి చాలా తేడా ఉంటుంది. ఇంటిలో పనికి బయటివారితో సంబంధం ఉండదు. గుడిలో అర్చకులు నిర్వహించే విధులు చేయటం అలవాటులేదు. అందువలన కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయినా తప్పదు. ఇది రాసే సమయానికి గుడి ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. 5 గురు అర్చకులు మారారు. ఒకాయన వెళ్ళిపోయాక మరొకరు చేరే మధ్య కాలంలో మేమె విధులు నిర్వహించవలసి వచ్చేది. అలా మధ్య మధ్యలో పనిచేసిన మొత్తం కాలము రెండు సంవత్సరాలకు సమానం అయ్యింది. ఆ సమయంలో ఎటువంటి జీతాలు, పళ్ళెం డబ్బులు తీసుకోకపోవడం వల్ల గుడికి కొంత ఆదాయం సమకూడి మిగులులోకి వచ్చేది.

ప్రతి సోమవారం అన్నదానం మాత్రం నిరాటంకంగా సాగిపోతున్నది. మొదటి సంవత్సరం కార్తీక మాసంలో మొత్తం నెల అంతా చేద్దామని కొండలరావుగారు అన్నారు. ప్రతి సోమవారం చేయడమే కష్టంగా ఉంది. పని అంతా స్వచ్ఛందంగా చేయటం వల్లనే జరుగుతోంది. ఎవరికీ ఎటువంటి ఖర్చులు ఇవ్వటం లేదు. 30 రోజులు ప్రతిరోజు చేయటం కష్టం, దానికి కావలసిన దానం సమకూరడానికి 30 మంది కావాలికదా చూద్దాం అన్నాను.

కానీ కార్తీక మాసం వచ్చాకా 30 కంటే ఎక్కువ పేర్లే నమోదయ్యాయి. చేసేవారు కూడా దీక్షగా 30 రోజులు వండటానికి వచ్చారు. అంచనాలకు మించి ఆ నెల అన్నప్రసాద వితరణ జరిగిపోయింది. యాగశాలలో క్రింద మట్టి. వండటానికి పుల్లలే వాడారు. కూర్చోవడానికి పొడవుగా కుట్టిన బరకం గుడ్డలు వాడారు. అయినా అందరూ సంతృప్తి చెందారు.

తరువాత రెండు సంవత్సరాలకు గాని కూర్చోవడానికి Polish రాయి బల్లలు, Polish రాయి టేబుళ్ళు, క్రింద cement గచ్చు చెయ్యలేకపోయాము. తరువాత పుల్లల పొయ్యికి బదులు గ్యాసు పొయ్యి వాడటం మొదలు పెట్టాము. కొన్నాళ్ళకు యాగశాల పడిపోయింది. దానిని తిరిగి పొడుగు పాకలాగ మార్చడం జరిగింది.

రెండవ సంవత్సరం నుండి ప్రతి శివరాత్రికి భారీ అన్నదానం చేయటం మొదలయింది. మొత్తం ఊరిలో ఉండే వారందరికి, మరియు చుట్టుపక్కల ఊళ్ళనుండి వచ్చేవారికి మొత్తం సుమారు రెండు వేల మందికి అన్నదానం జరుగుతూ వస్తోంది.

ప్రతిష్ఠ అయిపోయిన ఒక నెల రోజుల లోపే M.L.A శ్రీ చిట్టూరి రవీంద్రగారు వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని 50,000 రూపాయలు ఇచ్చారు. వాటిని ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులు చేయటానికి వినియోగిస్తామని చెప్పాను. అప్పటికి నవగ్రహ మండపం గోపురం ఫినిషింగు అవ్వలేదు. కృష్ణభగవానుడి విగ్రహం మీద గోపురం లేదు. ధ్వజస్తంభం దిమ్మకు ఫినిషింగు అవ్వలేదు. ఈ పనులు చేయటం మొదలు పెట్టాము.

రేవులో ఈశ్వరుడి మందిరం

14)ప్రతిష్ఠా కార్యక్రమం

12-Feb-2008 ఉదయం మా అబ్బాయి కొవ్వూరు వెళ్ళి గురువుగారిని, వారితో పాటు మా బావమరిది భార్య, వారి అక్కగార్లను తీసుకు వచ్చాడు. వారి శిష్యులు సుమారు 15 మంది ప్రతిష్ఠకు నిర్దేశించిన రాగి యంత్రాలు వగయిరా తీసుకుని వచ్చారు. ఈ యంత్రాలు, వాటి జపాలు ఒక వారం రోజులు ముందు విజయనగరంలోని వారి ఆశ్రమంలో పూర్తి చేసుకువచ్చారు.

01

గురువుగారు ఒక మహోన్నతమైన వ్యక్తి, శక్తి. దేవీ ఉపాసకులు. అటువంటి వ్యక్తులు మన సమాజంలో చాలా అరుదుగా ఉన్నారు. ఆయన గురించి వ్రాయటానికి నా దగ్గర వ్యాక్యాలు లేవు. అంటే నా శక్తి చాలదు అని అర్థం. ఆయన మన గుడి ప్రతిష్ఠ చెయ్యడానికి అంగీకరించడమే మన అదృష్టం. ఆ పని మీద మన ఊరిలో 5 రోజులు ఉండటం మన ఊరికి లభించిన మహా భాగ్యం. ఆయన చేతుల మీదుగా జీవ ప్రతిష్ఠ, శిఖర కలశ ప్రతిష్ఠ జరగటం వలన ఆలయం నిరంతరం తేజోమయంగా దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతోంది.

ఆయన తన తపశ్శక్తిని, దివ్య శక్తిని మన ఆలయంలో స్ధాపించి, ఈ ప్రాంతానికి, సన్నిధికి దివ్యత్వాన్ని ప్రసాదించారు. ఈ విషయం సునిశితమైన గ్రాహక శక్తి కలవారికి మాత్రమే అవగతమవుతుంది. ఆయనకు అనేక మంది ప్రముఖులయిన శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు అంటే ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినవారు అనే అర్థంలో కారు. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయనకు అనుయాయులుగా (Followers) ఉన్నవారు. అటువంటి వారిలో నేను చాలా చిన్నవాడిని. గురువుగారంటే ఒక రకమయిన భయంతో కూడిన భక్తి కలవాడిని.

8

ఆయన కోసం మా ఇంటిలో ఒక A.C. గదిని ఖాళీ చేసి ఒక చెక్క మంచం మీద ఒక కొత్త పరుపు దుప్పటి సిద్ధం చేశాము. అలాగే ఆయన గుడి దగ్గర కార్యక్రమాలలో కూర్చునేటందుకు కాను కొంచెం పెద్దదయిన 9″ ఎత్తు పీట (ఆసనం) చేయించాను. ఆ పీటను చూడగానే ఆయన అవసరం సరిగా గ్రహించి శ్రద్ధ వహించినట్లు ఆయనకు అర్థం అయ్యింది. అలాగే యాగశాల ఏర్పాట్ల పట్ల కూడా సంతృప్తి చెందారు. ఆయనకు అవసరమైన విధంగా యాగశాల నిర్మాణం జరిగిందో లేదో, లేకపొతే ఏవయినా మార్పులు చేర్పులు చేయడానికి ఒక పరిశీలకుడిని ముందుగా పంపలేకపోయారు. మాకు అంతంత మాత్రం అనుభవం వల్ల మేము చేసిన ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేవో అన్న భయం అప్పటికి తీరింది.

గురువుగారు మా ఇంటికి వచ్చాక నేను ఆయనకు ఒక నమస్కారం చేసి ఒక విన్నపం చేసుకున్నాను. “మీకు ఏమి కావాలో అడిగే ధైర్యం నాకు లేదు. ఏమి కావాలన్నా సమకూరుస్తాము. మీరు దయతో ఆదేశించినట్లయితే ఏమి కావాలంటే అది చేస్తాము”. అని. గురువుగారి కూడా వచ్చిన ఇద్దరు (మా బావమరిది భార్య, వారి అక్కగార్లు) ఆయనతో కొంచెము ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నవాళ్ళు. అందువలన వారిద్దరు గురువుగారి అవసరాలను కనిపెట్టి  పనిచేయగలరని తీసుకురావటం జరిగింది. ఆయనకు అంతకు ముందే అనారోగ్యం కారణంగా కొంత సులువుగా లేరు. కార్యక్రమం ప్రారంభమయిన దగ్గర నుండి పూర్తి అయ్యేదాకా సంస్కృతంలో తప్ప తెలుగు మాట్లాడరు. పచ్చి కూరలు, పండ్లు, పాలు తప్ప ఆహారం తీసుకోరు.

కార్యక్రమం ప్రారంభించడానికి ముందు అక్కడకు చేరిన వారిని ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. ఆ తరువాత కార్యక్రమాలు ఆహ్వాన పత్రంలో ముద్రించిన విధంగా వైభవంగా సాగాయి. ప్రతిరోజూ వాన పడింది.(నాలుగు రోజులు). ఒక్క యాగశాల ప్రాంగణం మాత్రం గోవర్ధనగిరి లాగ కనిపించింది. మొత్తం పొడిగా ఉంది. ఫిబ్రవరి నెలలో వానలేం పడతాయి, నీడ ఉంటే చాలు అని నేను అనుకున్న అంచనా తలక్రిందులయ్యింది.

చుట్టుపక్కల ఒక కిలోమీటరు దూరం వరకు వర్షం ముంచెత్తేసింది. నీరు వరదలైపారింది. రాజమండ్రిలో ఒక గంటసేపు తీవ్రమయిన వర్షం పడుతోంది, అక్కడ ఎలాగ ఉందని Phone లో అడిగేవారు. ఇక్కడ కేవలం బట్టతడి చినుకులు మాత్రమే పడ్డాయి. బూరుగుపూడి వరకు, మిర్తిపాడు వరకు తీవ్రంగా కురిసిన వర్షాలు మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు ఆరిపోయిన నేలను కొద్దిగా తడిపి అప్పుడు ఉన్న పంటలను బాగా తయారు అయ్యేలాగ సహకరించాయి. అయిదవ రోజున అన్న దానానికి కాని వచ్చిన జనానికి కాని ఎటువంటి ఇబ్బంది రాకుండా అసలు వర్షమే పడలేదు.

ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ పని నిరాటంకంగా జరగడానికి కావలసిన శక్తి ఎక్కడ నుండి వచ్చిందో తెలుస్తుంది. మూడవ రోజు గురువుగారు స్వల్ప అస్వస్థకు గురి అయ్యారు. ఆయనను వెంటనే విశ్రాంతికి ఇంటికి చేర్చాము. తులసి కోటలో ముందుగానే కొంచెం తులసి నాటి, పెంచి శ్రీకృష్ణ భగవానుని చేర్చాము. ఆయన చిద్విలాసంగా జరుగుతున్న కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.

ఆఖరు రోజు తొక్కిసలాట లేకుండా ఉండటానికి చాలా దూరం నుండి Q line వచ్చేలాగ తాళ్ళు కట్టి, ఎవరూ తిన్నగా లోపలికి రాకుండా గేటు మూసి పెట్టాము. ఈ ఏర్పాట్లు పూర్తవడానికి అర్థరాత్రి దాటిపోయింది. ఉదయం 8:24 కే ముహూర్తం కాబట్టి లోపల తొక్కిసలాట లేకుండా విగ్రహాల ప్రతిష్ఠ జరిగిపోయిన తరువాత జనాల్ని రానిద్దామని ఉద్దేశ్యం. గేటు బయట జనం చేరి ఉన్నారు. లోపల కొద్దిమందితో ఖాళీగా ఉంది. గేటు ఎందుకు వేశామో తెలుసుకోకుండా ఒకాయన గేటు తీసేశాడు. వెంటనే జనమంతా ఒక్కసారిగా లోపలకు వచ్చేశారు. అందువల్ల యాగశాల నుండి విగ్రహాలను లోపలకు తరలించడానికి కష్టమయ్యింది.

నాలుగవరోజు రాత్రి ద్వారపాలకులను, నందీశ్వరుడిని, పానుపట్టాన్ని వాటి స్థానాలలో ఎక్కించారు. ద్వారపాలకులకు నామాలు పెట్టి దండలు వేసేటప్పటికే మండపానికి ఎంతో కళ వచ్చేసింది. కలశాల లోపలకు కావాల్సిన టేకు కర్రలు, ధ్వజస్తంభం క్రింద పెట్టడానికి కావలసిన వెండి ధ్వజస్తంభం ముందుగా చెప్పలేదు. అందువలన వాటిని స్వల్ప వ్యవధిలో సమకూర్చవలసి వచ్చింది.

im10im4im6im5

గురువుగారు ఆలయ శిఖరాల మీద కలశాలను ఉంచడానికి ఎక్కినప్పుడు మా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన శరీరం అందుకు అనువుగా లేదు. అయినా లెక్క చేయకుండా ఎక్కేశారు. మొదటి రోజు రాత్రి మేళం కోసం వచ్చిన వాళ్ళలో ఒకతను చూసుకోకుండా నడచి వచ్చేసి ధ్వజస్తంభం నిలబెట్టడానికి తయారు చేసిన 5 అడుగుల లోతు కుండీలో పడిపోయాడు. అతనిని బయటకు తీశారు. పాపం పెద్దగా దెబ్బలు ఏమీ తగలలేదు. కాసేపటికి అడబాల సోమరాజుగారు కూడా అందులో నిలువునా పడిపోయారు. ఆయన అసలే అవిటి మనిషి, భారీ కాయం. అలాగ పడిపోయిన వాళ్ళకు ఏ ఎముకలు విరగకుండా ఉండటం అసంభవం. అయినా దేవుని దయకు నిదర్శనంగా ఇద్దరికీ ఏమీ జరుగలేదు. ఆ గోతితో ఇటువంటి ప్రమాదం వస్తుందని ముందుగా ఊహించలేకపోవటం మా అసమర్ధతకు నిదర్శనం. ఏమీ జరగకుండా బయట పడటం ఆ పరమాత్మ కృపకు నిదర్శనం.

వెంటనే నాలుగు సప్లై కంపెనీ టేబుళ్ళను నాలుగు వైపులా పడుకోపెట్టి అడ్డు ఏర్పాటు చేశాము. ఆ తరువాత వాటితో గొయ్యి మీద మూత లాగా వేశాము. మళ్ళీ అంచనా తప్పింది. వాటిమీద ఒక్కసారిగా పదిమంది దాకా ఆడవాళ్ళు నిలబడ్డారు. మా ప్రయత్నం గోతిలో ఎవరూ పడకుండా రక్షణకు వేశాము. ఇలా దానిమీదకు ఎక్కి నిలబడతారని ఊహించలేకపోయాం. ఆ పాత టేబుళ్ల దగ్గర అంత మంది బరువు మోసే బలం లేదు. అయినా ఎలా ఆగాయో ఆగాయి. ఆ వెంటనే అంది మీదకు ఎవరూ ఎక్కకుండా ఏర్పాటు చేశాము. మొత్తం మీద ఎవరికీ ఏ ఆపదా రాకుండా రోజులు గడిచి పోయాయి.

ధ్వజస్తంభాన్ని గోతిలో నిలబెట్టడం

ఇది అన్నింటికన్నా కష్ఠమయిన పని. 36 అడుగుల బలమైన కొయ్యని 5 అడుగుల గోతిలో నిలబెట్టాలి. గురువుగారు ధ్వజస్తంభానికి చేయవలసిన పూజాదికాలు పూర్తి చేశారు. గొయ్యి అడుగున వెండి ధ్వజస్తంభాన్ని రాగియంత్రాన్ని ఉంచారు. మనుషులతో తాళ్ళతో పైకి లేపటానికి నేను ఇష్ట పడలేదు. Manage చెయ్యటం కష్ఠం. ఏ మాత్రం తేడా వచ్చినా ఒక పక్కకి పడిపోతుంది. దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పెద్ద Crane ని రాజమండ్రి నుండి తేవటానికి అవకాశం కనపడలేదు. తూరల ఫ్యాక్టరీ లో ఒక J.C.B ఉంది. దానితో ప్రయత్నం చేద్దామని వాళ్ళని వెళ్ళి అడిగాము. ఇవ్వటానికి అభ్యంతరం లేదు కాని దీనితో పని జరగదన్నారు. ఇంతకంటే తక్కువ బరువు ఎత్తు ఉన్న ధ్వజస్తంభం గుమ్ములూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఎత్తడానికి తీసుకు వెళ్ళి కుదరక పంపేశారని చెప్పారు.  సరే ఏదయితే అదే అవుతుందని J.C.B ని తీసుకువచ్చాము.

జనం తక్కువగా ఉన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పని మొదలు పెట్టాము. పైన పక్కన తాళ్ళు నాలుగు వైపులా లాగటానికి వీలుగా కట్టి, ధ్వజస్తంభం Balance అయ్యేలాగ ఒక మోకును కట్టి J.C.B తో లేపాము. అనేక రకాల ప్రయత్నాలు చేసినా మొదలు గోతిలోకి దింపలేక పోయాము. J.C.B ఇంజను చేసే విపరీతమయిన శబ్దము వలన గట్టిగా అరిచినా వినపడటం లేదు. ఆఖరి ప్రయత్నంగా అప్పటిదాకా వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని మరొక రకమైన ఆలోచన చేసి ప్రయత్నం చేశాము.

భగవంతుని దయవల్ల ఈసారి ఫలితం కనపడింది. మెల్లిగా మొదలు గోతిలోకి దిగింది. వెంటనే దానిని సరిగా మధ్యలో ఉండేలాగ జరిపి, వాలిపోకుండా పైన కట్టిన తాళ్ళను నాలుగు వైపులా బిగించి కట్టాము. మేము తెచ్చిన తాళ్ళు సన్నగా ఉన్నా బలమైన Quality ఎంపిక చేసి తెచ్చాము. అనుకున్న పని అయ్యింది కాబట్టి J.C.B Driver కి మామూలు ఇచ్చి తిరిగి ఫ్యాక్టరీ వారికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళాము. ఈ J.C.B తో 36 అడుగుల పెద్ద కొయ్యను గోతిలో నిలబెట్టగలిగామంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత వెంటనే Line కరెక్టుగా చూసి, నిలువుకూడా సరిగ్గా ఉందని నిర్ధారించుకుని  1 1/2 feet మెటలు, ఇసుక, సిమెంటుతో ఆ గోతిని భూమి మట్టం వరకు concrete తో నింపేశాము. సుమారు 1/2 లారీ మెటలు పట్టింది.

ఈ లోపల మేము కట్టిన తాళ్లుతో నిలబడిన స్థంభాన్ని చూడటానికి బాదే రామచంద్రంగారు వచ్చారు. ఆయనకి ఆ తాళ్ళు దారాలలాగ కనపడ్డాయి. ఇంత సన్న తాళ్ళతో ఆ స్తంభం ఎవరిమీదయినా పడకుండా ఎలా ఉంటుంది. పెద్ద పెద్ద మోకులు ఉండాలని ఒకటే గంతులు వేయటం మొదలు పెట్టాడు. దానితో ఆవేశం ఆయాసం రావడం మామూలే. ఏదయినా జరిగి, ఈ తాళ్ళు ఆపు చేయలేక కొయ్య ఎవరిమీదయినా పడిపోతే ఆ బాధ్యత మీదే అని కోపంగా వెళ్ళిపోయారు. ఒకసారి కొయ్య దాని మొదలు మీద నిలబడిపోతే తాళ్ళ మీద పెద్ద భారం ఏమీ ఉండదని చెప్పినా వినిపించుకోలేదు. ఇదంతా మామూలే కదా. ఇలాంటివి ఎన్నో పడి పడి అలవాటయిపోయింది. అందువలన ఒక రెండు గంటల పాటు concrete తో గోతిని నేలమట్టం వరకు నింపివేశాక మాకు కూడా బరువు దిగి పోయింది.

ఐదవరోజు 10 గంటల కల్లా యాగశాలలో పూర్ణాహుతి అయిపోయింది. అక్కడ రాత్రి నుండి ఒక 60 మంది వంటవాళ్ళు సహాయకులు వంటలు తయారు చేస్తున్నారు. వాన దేవుడి కరుణ వలన చినుకులు లేవు. షామియానాలు వేశారు. పదకొండు గంటలనుండి అన్నదానం ప్రారంభం అయ్యింది.

కొత్తూరు, పాతూరు మధ్య రోడ్డు మీద ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు. బూరుగుపూడి రోడ్డు, మిర్తిపాడు రోడ్డు కూడా వచ్చే పోయే వారితోను, వాహనాలతోను ఖాళీలేదు. ఊర్లో కూడా అన్ని రోడ్ల నిండా జనమే, అంతా ప్లేట్లలో భోజనమే. వచ్చేవాళ్ళు వస్తున్నారు. తినేవాళ్లు తింటున్నారు. వండేవాళ్ళు వండుతున్నారు. పెట్టేవాళ్ళు పెడుతున్నారు. ఇదంతా ఎలా Regulation జరుగుతోందో మతిలేదు. తెచ్చిన ప్లేట్ల లెక్క ప్రకారం మొత్తం 15,000 మంది దాటిపోయారు. సాయంత్రం 2 లేక 3 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది.

ఆ రాత్రి గురువుగారి చేతుల మీదుగా స్వామివారికి జరిపిన శాంతి కళ్యాణం తో తతంగం పూర్తయ్యింది. ఆరోజు సాయంత్రం 6 గంటలకు నలుగురం మాధవరావుగారి బారన్ల దగ్గర కూర్చుని ఇంకా ఎవరెవరికి ఏమి ఇవ్వాలో లెక్కలు చూస్తున్నాము. వంటవాళ్ళు, లైటింగువాళ్ళు, మేళం, ఫోటోగ్రాఫర్లు ఇంకా ఇతర చిల్లర మల్లర బాకీలు ఉన్నాయి. కంఠం రామ మోహన్ గారు ఒక చోట కూర్చుని ఇంకొందరి సహాయంతో భోజనాలు చేసి వెళ్ళేవారు, పొరుగు ఊరివారు గుడికి విరాళంగా ఇచ్చిన పదులు వందలు లాంటి వాటిని అప్పటికప్పుడు వారి పేరు చదివి పోగుచేశారు. అలావచ్చినవి రూ 60,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. అవి, మా దగ్గర ఉన్న మిగతా డబ్బులు పెట్టి ఒకొక్కళ్ళ Balance లు సద్దుబాటు చేయగలిగాము. గురువుగారికి రూ 50,000 ఇచ్చాము. ఆయనకోసం మరొకరు పంపించిన కారులో వెళ్ళిపోయారు. అంతకు ముందు జపాలు నిమిత్తం వారి అబ్బాయికి రూ 90,000 పంపించామని చెప్పాను.

im11im3

(ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయిన తరువాత గ్రామ పెద్దలు దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ సత్తిరాజు జగన్నాధ రావు గారు, ఆయన సతీమణి శ్రీమతి దుర్గా సూర్య కుమారి గారికి చేసిన సన్మాన కార్యక్రమము)

ఇంకా ధ్వజస్తంభం తొడుగు ఇతర మకర తోరణాలు తయారు చేసినందుకు, తలుపులు తయారు చేసినందుకు బాకీలు ఉన్నాయి. ఈ విషయాలను పట్టించుకోవడానికి ఎవరూ సుముఖంగా లేరు. అలా ఇవ్వతేలిన బాకీలు సుమారు రూ 65,000 వరకూ ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పించుకోవడానికి ఇష్టంలేక, ఫలానా గుడికి ఈ పని చేశాం, మాకు డబ్బులు సద్దుబాటు చెయ్యడానికి నానా తిప్పలు పెట్టారు అనే మాట రాకుండా ఉండటానికి ఆ సొమ్ములను నేనే సద్దుబాటు చేయవలసి వచ్చింది.

గుడి నిర్మాణం ప్రారంభించిన నుండి అప్పటి వరకు ఒక్క మనిషి కూడా నాకు ఒక్క రూపాయి వస్తుందని నిలబడి అడిగే అవసరం లేకుండానే పని చేసుకువచ్చాము. ఇసుకకు కాని, సిమ్మెంటుకు కాని, ఇతరత్రా ఏ Material కి కాని ఒక్క గంట కూడా అరువుకు తేలేదు. అలాగే నిర్మాణ సమయంలో ఎవరినీ కానీ ఒక చేత్తో సిగరెట్టు పట్టుకునో లేక నోట్లో సిగరెట్టు ఉంచుకునో పని చెయ్యనియ్య లేదు. వారికి ఆ అవసరం అనిపించినప్పుడు రోడ్డుమీదకు వెళ్ళి కాల్చుకుని ఆ తరువాతే వచ్చి పని చెయ్యమన్నాము. ఇక్కడికి ఒక అంకం ముగిసింది.