ఆలయ ప్రాంగణం కాంక్రీటు పని
ఆలయ ప్రాగణం చుట్టూ తరువాత కోనేరు మెట్లు కట్టడానికి Ramp సుమారు 6000 అడుగులు కాంక్రీటు కొట్టవలసి ఉంది. గొల్లబాబుగారి బావగారు రామకృష్ణారావుగారిని అంతకు ముందు అందరిలాగే చందా అడిగారు. నాకు బుచ్చింపేట శివాలయంలో ఏమీ పని లేదు. నేను ఇవ్వనన్నారు. అది విన్నాక చందా కోసం ఇంకా మీ దగ్గరకు రాము అనేదాకా వ్యవహారం వెళ్ళింది. ఇది జరిగిన ఒక నెల రోజులు తరువాత ఒక నలుగురం వాళ్ళింటికి వెళ్ళాము. మాలో ఎవరికీ ఆయన్ను ఈ విషయంలో మాట్లాడే ఉద్దేశ్యం లేదు. కానీ మమ్మల్ని చూడగానే బీరువాలోంచి 20,000 రూపాయలు తీసి అడక్కుండానే ఇచ్చారు. ఆశ్చర్యపోవడం మావంతు అయ్యింది. రెండు రోజులలో దానికి ఇంకొక 20,000 కలిపి మొత్తం 6,000 అడుగుల కాంక్రీటు 1X6 పాళ్లతో కొట్టడం జరిగింది. ఒక వారం రోజుల తరువాత ఆయన కనపడినప్పుడు ఈ విషయం చెప్పాను.
దరిమిలా వారి అబ్బాయికి ఈ ఊరి అమ్మాయినే చేసుకోవడం, వారి సంతానానికి ఈ గుడిలోనే శాంతి చేసుకోవడం జరిగింది. గుడితో పని ఉందో లేదో ఆ విధంగా స్వామివారు ఎరుక పరిచారు.
ప్రహారీగోడ, కోనేరు మెట్లు, గేట్లు
గుడి చుట్టూ ప్రహారీగోడ ఎటు చూసినా 100 అడుగులు ఉంది. 400 అడుగులు. 10 అడుగుల దూరానికి ఒక piller చొప్పున పోశాము. లోపలపక్క 6 అడుగుల దూరంలో ఒకటి వదిలి మరొక దానికి రెండవ వరస pillers పోశాము. బొమ్మలో చూపినట్లుగా బయట పిల్లర్ల మీదుగా Beams నేల మట్టానికి పోశాము. లోపల పిల్లర్లను కలుపుతూ Lock Beams పోశాము. అందువల్ల కాంపౌండ్ గోడ బయటకు కాని లోపలకు కాని వాలే అవకాశం లేకుండా బలంగా నిలబడుతుంది. ఉత్తరం గోడకు ఈశాన్యం మూల Main Gate, దక్షిణం గోడకు, పడమటి గోడలకు రెండు చిన్న gates, నైరుతి మూల ఒక 16X10 గది, అరుగు, ఉత్తరానికి రోడ్డుమీదకు ఒక shop ఉండేలాగ compound wall నిర్మించాము. తూర్పు వైపు గుడికి ఎదురుగా కోనేటిలోకి దిగటానికి 50 అడుగుల వెడల్పుతో 10 మెట్లు వచ్చేలాగ Ramp మొత్తం 8mm ఊచలతో కట్టి concrete పోశాము. ఆ తరువాత దాని మీద మెట్లు కట్టాము. అందువలన మెట్లు విడిపోవటం కాని, జారటంగాని జరుగదు.
కొంతకాలంగా ఎక్కడికి వెళ్లినా రక రకాల గేట్ల డిజైన్లు చూడటం మొదలు పెట్టాము. ఒకసారి రాజమండ్రిలో ఒకరి ఇంటికి ఇలాంటి Gate ఉండటం చూసి ఆ Design ని ఎంపిక చేశాము. గుమ్ములూరు అప్పటి సర్పంచి వెంకటేశ్వరరావు గారు Gate ఇస్తామన్నారు. Welder ని ఆ గేటు దగ్గరకు తీసుకు వెళ్లి చూపించి ఆ Design లో పెద్దగేటు తయారు చేయమన్నాము. అదే డిజైనులో రెండు చిన్న గేట్లు మేము చేయించుకున్నాము. ఈ గేట్లని కూడా 2008 సంవత్సరం ఫిబ్రవరి 8 వ తేదీ వరకు పెట్టడం కుదరలేదు. అంటే ప్రతిష్ఠకు ముందు నాలుగు రోజులు ఉందనగా మాత్రమే పని అయ్యింది.
హుండీ
—————-గారి పాత ఇనుపపెట్టి ఎండకు ఎండి వానకు తడిసి బాగా తుప్పు పట్టి ఉంది. దానిని హుండీ గా మారుద్దామని బయటకు లాగి ఒక Tyre బండికి ఎత్తాము. కోరుకొండ తీసుకువెళ్లి ఎత్తి పడేస్తే అప్పుడు తలుపు తెరుచుకుంది. దానికి వెల్డింగులు చేయించి లోపలి రేకుతో పైన డబ్బులు వేయటానికి అనుకూలంగా తయారుచేసి కొత్త తాళాలు తయారు చేయించి మక్కుపెట్టి రంగు వేశారు. ఒక్కొక్క రకం పని ఒకళ్ళు చేయవలసి రావటం వలన ఒక నెల రోజులకు కాని పూర్తికాలేదు. తరువాత దానిని మళ్ళీ టైర్ బండి మీదకు ఎత్తి తీసుకువచ్చి ఇప్పుడు ఉన్నచోట పెట్టడం జరిగింది.
గురువుగారి కోసం శివకోడు
శివకోడు గ్రామంలో ఒక గ్రామ దేవత గుడి ప్రతిష్ఠ కోసం గురువుగారు వచ్చినట్లు 2007 నవంబరులో తెలిసింది. ఆయన్ను కలవాలంటే విజయనగరం దాకా వెళ్ళాల్సివస్తుందని కొంతమందిమి కలిసి శివకోడు వెళ్ళాం. గుడి పనులు దాదాపుగా ఒక రెండు నెలలలో పూర్తికావచ్చని అంచనాతో ప్రతిష్ఠ చేయడానికి వారిని రమ్మని కోరడం, ముహూర్తం పెట్టించుకోవడం, కార్యక్రమ వివరాలు రాయించుకోవడం (ఆహ్వాన పత్రికలు ముద్రించడానికి) మొదలైన వివరాలు మాట్లాడుకోవాలని ఉద్దేశ్యం.
అయ్యా, గుడి కట్టడానికి చాలా ఖర్చయ్యింది. కొంచెం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాము. మీరు దయ తలచి కాస్త తక్కువ ఖర్చులో ప్రతిష్ఠ అయ్యేలాగా చూడమని కోరాను. ఆయనకు కోపం వచ్చింది. గుళ్ళు కట్టడానికి ఖర్చు పెట్టగలరు కాని ప్రతిష్ఠ దగ్గరకు వచ్చేటప్పటికి డబ్బులు లేవంటారు (అందరూ అలాగే అంటారేమో). ఇది కూడా పెద్ద పనే, ముఖ్యమయినదే అని తేలికగా అయ్యేది కాదని అన్నారు.
వారి అబ్బాయిగారు సంతర్పణ ఖర్చులతో సహా సుమారు నాలుగు లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని ఒక అంచనా చెప్పారు. 16-02-2008 ఉదయం ముహూర్తం పెట్టారు. 12-2-2008 నుండి 5 రోజుల కార్యక్రమాలు మొదలవుతాయి. యాగశాల ఎలా చెయ్యాలో, అందులో హోమ గుండాలు ఎక్కడ ఎలా ఉండాలో, అధివాసాలకు ఒక కుండీ ఎక్కడ కట్టాలో గీసి ఇచ్చారు. 30’X30′ యాగశాల తయారు చేయించమన్నారు. కాశీ నుండి నర్మద బాణ లింగం తెచ్చుకోమన్నారు.
అంతా విని సాయంత్రానికి బయట పడ్డాం. ప్రస్తుతం వేలకు లెక్కలు వెయ్యటానికే దేముడు కనపడుతున్నాడు. ఈ లక్షల ఖర్చు తప్పదని తెలిసినా ఎలా నెరవేరుతుందో తెలియదు. సమయం కూడా ఎక్కువ లేదు. మిగతా నడుస్తున్న పనులు కూడా ముగింపు దశలో ఉన్నాయి. వాటికి కూడా పెట్టుబడి ఖర్చు విపరీతంగా అవుతోంది. నిశ్శబ్దంగా తిరుగు ప్రయాణమయ్యాం. ప్రతిష్ఠకు కావాల్సిన సామాన్లు లిష్టు తరువాత విజయనగరం వచ్చి తీసుకోమన్నారు.