9) గ్రానైటు ఫ్లోరింగు, గంట, తలుపులు

గ్రానైటు ఫ్లోరింగు

మండపానికి, గుళ్ల లోపల టైల్సుతో కానీ పాలరాతితో కాని ఫ్లోరింగు చేద్దామన్నారు. పాలరాయి కొత్తలో బాగుంటుందేమోకాని జనం ఎక్కువగా తిరిగే చోట చాలా తొందరగా కళ తప్పి పోతుంది. అలాగ కొంచెం పాత బడిన పాలరాతి ఫ్లోరింగులను చూడమన్నాను. అలాగే Tiles (అప్పటికి vitrified టైల్స్ ప్రాచుర్యంలోకి రాలేదు) కూడా కొన్నాళ్ళు తరువాత Enamel పొతే మార్చడం కష్టం. అందువల్ల గ్రానైటు వాడదామన్నాను. కోరీ లోని లక్ష్మీనరసింహ స్వామి గుడికి అప్పట్లో గ్రానైటు వేశారు. వాళ్ళని తీసుకువెళ్లి అది చూపించాను. అందరికీ నచ్చింది. నీడ ఆనేలాగా ఉంది.

ఆ రాయి ఖమ్మంలో దొరుకుతుంది కాబట్టి ఒక రోజు అయిదుగురం ఖమ్మం మాధవరావు గారి కారులో వెళ్ళాం. ఇక్కడ మెట్లకు, మండపానికి, స్తంభాలకు ఏ ఏ సైజులు కావాలో రాసుకుని ఇంకొంచెం ఎక్కువ ఉండేలాగ 1″ (అంగుళం) మందం Z black గ్రానైటు రాయికి ఆర్డరు ఇచ్చి 30,000 అడ్వాన్సుగా ఇచ్చాము.

ఒక నెల రోజుల తరువాత, 16 టన్నుల భారీ మోతతో ఒక లారీ వచ్చింది, బాలెన్సు సొమ్ము కట్టి వచ్చి తీసుకు వెళ్ళమని Phone చేశాడు. సరుకు ఇక్కడ చేరిన వెంటనే Money Transfer చేస్తామన్నాము. నిన్ను నమ్మి 30,000 Advance ఇచ్చాము, మమ్మల్ని నమ్మి సరుకు ఎందుకు పంపలేవని అడిగాం. లారీ దిగుమతి అయిన వెంటనే ఖమ్మంలోని Account కి రాజమండ్రి SBI ద్వారా Transfer చేసి, ఫోను చేసి సొమ్ము జమ అయ్యింది చూసుకుని చెప్పమన్నాం.

ఆ తరువాత విజయవాడ నుండి పనివారు వచ్చారు. వారికి కావలసిన భోజనాలు వసతి ఏర్పాటు చేశాం. కాని కరంటు రోజులో సాగ భాగమే ఉండేది. మధ్యాహ్నం కరంటు అప్పుడు కాస్త పరవాలేదు కాని ఉదయం కరంటు అప్పుడు పని మొదలెట్టిన కాసేపటికే పొయ్యేది. అందువలన వాళ్ళ పనికి ఆటంకం కలగా కుండా ఉండేందుకు మా జనరేటర్ ని తీసుకువెళ్లి అక్కడ బిగించి కరంటు లేకపోయినా పని ఆగకుండా ఏర్పాటు చేశాము. సుమారు రెండు వారాలకు పని పూర్తయ్యింది. తరువాత అనేక డిజైన్లు వెతికి ఆలయాల లోపలి గోడలకు టైలు వర్కు చేయించాము. ఇప్పుడు చాలా వరకు ఆకారం ఏర్పడింది. ఎప్పటిలాగే మనకు తెలిసినవాళ్ళు ఉన్న పొరుగు ఊళ్లు వెళ్లి చందాలకు ప్రయత్నం కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. లోటు బడ్జటు లోంచి బయట పడటం కూడా లేదు.

గంట

మిర్తిపాడులో ———————- గంట ఇస్తామన్నారు. గంట అంటే వాళ్ళ ఊహలో 60kg ల గంట ఏమీ ఉండదు. గంట సుమారు 20,000 అవుతుందన్నాము. ఇదొక విడ్డూరం లాగ అనిపించింది. మాకేమయినా పిచ్చి పట్టిందేమో అని కూడా అనిపించి ఉంటుంది. గంట ఇస్తామన్న పాపానికి ఇంత ఖరీదు అవుతుందని అనుకుని ఉండరు. గంట కు Hyderabad ఆర్డరు పెట్టాము. 63 kg ల గంట రాజమండ్రి S.R.M.T. కి వచ్చింది. దానిని విడిపించి కారులో వేసుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి చూపించాము. తరువాత కొన్నాళ్ళకు 13,000 ఇచ్చారు. ఇప్పుడు ఆ గంట కొడితే ఊళ్ళో వినిపించని ఇల్లు అంటూ ఉండదు. దానికి Stand వడ్రం మేస్త్రీ చేసి ఇచ్చాడు.

dsc_0452

తలుపులు

మిగతా అన్ని పనులు ఏదో ఒక రకంగా అవుతున్నాయి కానీ తలుపులు కట్టించే పని ఒక కొలిక్కి రావటం లేదు. దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి మల్లేపల్లి గిరిబాబు గారు తలుపులు చేయిస్తానంటున్నారు. వారి ఇంట్లో ఒక పెద్ద దుంగ ఉంది మేస్త్రిని పంపండి అనేవారు. ఎన్నాళ్లయినా పని ఒక్క అడుగు కూడా కదల లేదు.

తలుపులు, బయట చట్రాలకు డిజైన్లు అంతా చాలా సమయం తీసుకునే పని. ఇంకా Late చేసే అవకాశం లేదు. అందువల్ల దానికి కావలసిన కలప సీతానగరంలో కొందామని మేస్త్రి సలహా ఇచ్చాడు. దాని ప్రకారం సీతానగరం అడితిలో ఒకే రంగు ఉన్న కర్రలలో సైజులు కోసి ఇవ్వడానికి మాట్లాడుకున్నాము. ఆ మరునాడు వడ్రం మేస్త్రీ గారు రాసుకు వచ్చిన సైజులు ప్రకారం బాగా ముదురు రంగు ఉన్న పెద్ద పెద్ద టేకు దుంగల నుండి సైజులు కోయటం మొదలు పెట్టారు. ఏదయినా కర్రలో లేత రంగు తగిలితే వదిలేసి మంచి ఎంపిక చేసిన కర్రలలో  కావలసిన సైజులు కోసి ఇచ్చారు. ఒక పెద్ద దుంగలో లోపల అంతా తొర్రే ఉంది.

దానికి సుమారు 50,000 రూపాయలు అయినాయి. గండేపల్లిలో పనిచేయడానికి, బుచ్చింపేట గుడిలో ఉపయోగించుకోవడానికి వీలుగా ఫారెస్టు పర్మిట్లు తీసుకున్నాము. ఆవిధంగా కోసిన సరుకు గండేపల్లి చేరింది. పని వెంటనే ప్రారంభించేశారు.

ఆ మరునాడు రెండు కార్లలో మేము రాజమండ్రిలో గొల్లబాబు గారు ఉంటున్న ఇంటికి వెళ్ళాము. అప్పుడే సరిగ్గా గొల్లబాబు, గిరిబాబు ఒకే Motor Cycle మీద బయటకు వెళ్ళుతున్నారు. మమ్మల్ని చూసి వెనక్కు వచ్చారు. తలుపులు తయారు చెయ్యడానికి కలప తీసుకున్న సంగతి చెప్పాము. దానికి అయిన ఖర్చు ఇచ్చేయడానికి సమ్మతించారు.

ఇప్పుడు అర్థం అయ్యింది స్వామి వారి లీల. ఏడాది పాటు తలుపులు ఎందుకు తయారవ్వలేదో! ఆయన దగ్గర వున్న దుంగ చాలదు. దాని జతకి ఏదో ఒకటి కాని ఏదో Quality తలుపులు తెచ్చి ఇస్తే వాటిని బిగించలేము, అలాగని వదిలెయ్యలేని పరిస్థితి. ఇంత Quality తలుపులు, బయటి చట్రం చెక్కడాలు తయారవ్వాలంటే ఏది మార్గమో చూపించారు. సరిగ్గా సమయానికి రెండు రోజుల ముందు తలుపులు తయారవ్వటం, బిగించడం జరిగిపోయింది.

వ్యాఖ్యానించండి