2007 వ సంవత్సరం వానాకాలం ముగింపు దశకు వచ్చింది. కొద్ది రోజులలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభం కానున్నాయి. జనం ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ట్రాక్టర్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ అదను దాటితే మళ్ళీ కొన్ని నెలల దాకా మనుషులు ట్రాక్టర్లు రద్దీ కారణంగా పని కష్టం అవుతుందని పని మొదలు పెట్టాము. నేల మెత్తగా ఉంది. తోలే మట్టి కూడా తడిగా ఉంది. అందువలన లోపలకు వచ్చిన ట్రాక్టరు తొట్టిని తిప్పుకోలేదు. అందువలన మా ట్రాక్టరును వేరేగా పెట్టి కేవలం దిగిపోయిన ట్రక్కును వెనక్కు లాగటానికి వినియోగించాము. ఒక్కొక్క ట్రాక్టరు మట్టితో రావటం, మట్టిని దింపాక ట్రక్కును వెనక్కి లాగటం పంపటం, ఈ లోపల మరొక్క మట్టిలోడు. ఇలాగ కాస్త ఉత్సాహంగా, ఉద్వేగంగా, గందరగోళంగా పని జరుగుతోంది.
ఎప్పటిలాగే డబ్బులు ఇబ్బందిలోనే ఉన్నాయి. ఒక చోటనుండి ఒక లక్ష రూపాయలు అప్పుగా తెచ్చి పనులు కొనసాగిస్తున్నాము. మొదటిరోజు కొంతపని అవ్వగానే బాదే రామచంద్రం గారు చూడటానికి వచ్చారు. ఈ మట్టితో మెరక చెయ్యటం అంత అర్జంటు పనిలాగా కనపడలేదు. ఇంకా చెయ్యాల్సిన పనులు బోలెడు ఉండగా ఈ మట్టికి కంగారేమొచ్చిందని గడబిడ చేశాడు. అంతటితో ఆగకుండా సెంటరులోకి వెళ్లి అందరితో వివాదం మొదలు పెట్టాడు. ఇదంతా చూస్తున్న పనివాళ్ళు మేము రేపటి నుండి మట్టి తోలం అన్నారు. అలా అని ఆయన మాటలు విని పని ఆపు చెయ్యమని చెప్పటానికి ఎవరూ రాలేదు. అప్పుడు నేనేమన్నానంటే “మట్టి తోలించేది నేను, డబ్బులు ఇచ్చేది నేను. మనం ఏపని చేసినా నచ్చని వాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఏపనులు అవ్వవు. ఏదయినా గొడవలు వస్తే నేను చూసుకుంటాను. మీరు మట్టి తోలటం ఆపు చెయ్యక్కర్లేదు”. అంతే మరునాటి నుండి ఇంకా ట్రాక్టర్లు జనం పెరిగారు. మొత్తం 300 ట్రాక్టర్ల మట్టి తోలటం జరిగింది. తరువాత రెండు రోజులు మరొక 30 ట్రాక్టర్లు పల్లాలు మెరకలు సమానం చేసుకుంటూ రోడ్డు లెవలు దాకా మెరక చేయటం జరిగింది. అప్పుడు అంతా చక్కటి ఎర్రటి మైదానం తయారయ్యింది. కొన్ని రోజులు ఆరిన తరువాత మిర్తిపాడు వెళ్ళే రోడ్డు రిపేరు జరుగుతోంది. అక్కడ రోడ్డు రోలరు ఒకటి పనిలో ఉంది. ఆ కాంట్రాక్టరు గారిని అడిగి ఆ రోలరుని తీసుకు వచ్చి మట్టి అంతా బిగుసుకునేలాగ సమానంగా సానలాగా తొక్కించాము. అప్పటికి గొయ్యి అంతా పూడుకుపోయి అందమయిన గట్టి మైదానం ఏర్పడింది. గొడవలు చేసిన వాళ్ళు మాట్లాడకుండా ఊరుకున్నారు.

