గుడి నిర్మాణం పని చురుగ్గా జరుగుతుండటం వలన ఇతర అవసరాల కోసం ప్రయత్నం మొదలు పెట్టాం. భారత శిల్ప నిలయం వాళ్ళు వచ్చి మాట్లాడు కున్నారు. వినాయకుడు, పానుపట్టం, అమ్మవారు, నందీశ్వరుడు, ద్వార పాలకులు, బలి పీఠం, చండీశ్వరుడు, నవ గ్రహాలు. వారి సలహా ప్రకారం వినాయకుడు, పానుపట్టం, అమ్మవారు, నందీశ్వరుడు గ్రానైటు రాయితో తయారు చేసేలాగ మిగిలినవి గౌరీపట్నం రాయితో చేసేలాగ సుమారు రెండు లక్షల రూపాయల ఒప్పందం కుదిరింది. మళ్ళీ మాములే, రూపాయలు అయితే లేవు. ఇవి తయారుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం పడుతుంది. నిజానికి ఒక సంవత్సరం తీసుకున్నారు. మిగతా పనులతో భాగంగా ఇవి చెక్కాలి కాబట్టి, మాకు కూడా డబ్బులు పూడటం అంత సులభం కాదు కాబట్టి మేము కూడా ఏమి తొందర పెట్టలేదు.
వినాయకుడిని ఇవ్వడానికి శ్రీ చప్పిడి రామకృష్ణ గారు ముందుకు వచ్చారు. అయన దృష్టిలో ఒక 5 వేల రూపాయలతో విగ్రహం చేయించి, ఒక రోజు గుడిలో పెట్టేసి, ఒక 50 మందికి భోజనం పెట్టేద్దామని ఆలోచన. దాంతో ఆయన పని అయిపోతుందనుకున్నారు. కానీ మేము order ఇచ్చిన విగ్రహం 30,000 రూపాయలు. తరువాత ఎవరి విగ్రహం వాళ్ళు పెట్టుకు పోవడం కాదు. అన్నింటికీ కలిపి జీవ ప్రతిష్ఠ జరగాలి. ఆయన ఆలోచనలో పడ్డారు. కొన్నాళ్లకు ఆయన కొడుకులతో సంప్రదించి ఒక రోజు రమ్మని phone చేశారు. మేము కొన్ని పళ్ళు అవి కొనుక్కుని వాళ్ళ ఇంటికి రాజమండ్రి వెళ్ళాము. ఆయన అప్పటికే 30,000 రూపాయలకు చెక్కురాసి మాకోసం ఎదురు చూస్తున్నారు. మేము వెళ్లిన వెంటనే చెక్కు ఇచ్చేసి, మేము ఇచ్చిన పళ్ళు తీసుకుని పంపేశారు. ఆ cheque ని వెంటనే బ్యాంకులో collection కి ఇచ్చి ఆ సొమ్ము రాగానే శిల్పనిలయం వాళ్ళకి ఇచ్చేసి రసీదు తీసుకున్నాము.
అలాగే మా బంధువు (రాజమండ్రి) ఒకసారి 15,000 మరొకసారి 10,000 రూపాయలు ఇచ్చాడు. వస్తూ వస్తూ ఆ సొమ్ము కూడా వారికి ఇచ్చేసి రసీదు తీసుకున్నాము. ఇలా దఫ దఫాలుగా సొమ్ము జమ చేసుకుంటూ వస్తున్నాము. ఒక రోజు సాయంత్రం యర్రంశెట్టి రాంబాబు గారు నంది విగ్రహానికి నేను పెట్టుకుంటానన్నారు. అది ఒక 45,000. పానుపట్టానికి దిడ్డి మాధవరావు గారు 40,000 ఇచ్చారు, నవ గ్రహాలకు పోలిన సర్వేశ్వరరావు గారు, శ్రీహరి గారు 40,000 ఇచ్చారు.
ఇంకొక 20 రోజులలో ప్రతిష్ఠ జరుగుతుందనగా ఒకాయన కార్లో వచ్చి గుడి దగ్గర ఆగాడు. ఆయనెవరో నాకు తెలియదు. గుడి గురించి వివరాలు అడుగుతూ ఒక అరగంట ఉండిపోయాడు. నేను కూడా ఏదో మాట్లాడుతూ సమాధానాలు చెబుతున్నాను. ప్రతిష్ఠ ఇంకొక 20 రోజులలో ఉందన్నాను. అదేంటండి నాకు ఇప్పుడే దేముడు వచ్చేసినట్లు అనిపిస్తోంది. నేను ఎక్కడా 5 నిముషాల కంటే ఉండను. అప్పుడే అరగంట గడిచి పోయింది. నాకేమి లేదా? అని అడిగాడు. ఆ ప్రశ్నని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియలేదు. ఇంకా అమ్మవారి విగ్రహానికి ఎవరూ పేరు పెట్టలేదు అన్నాను. అయన వెంటనే అమ్మవారంటే మా ఆవిడకు చాలా ఇష్టం. అందుకోసమేనేమో మాకోసం ఉండిపోయినట్లుంది. అదెంతవుతుందో మేము కడతాం అన్నాడు. 30,000 రూపాయలు అవుతుందన్నాను. దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఒక జత మంగళ సూత్రాలు కూడా చేయించాడు. తరువాత ఆయన పేరు మంగారావు అని తెలిసింది.
ఏంటీ మంగారావు 30,000 ఇస్తానన్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది అని కొందరు ఆయన్ను ఎరిగినవారు అన్నారు. ఏది ఏమయినా, ఆయన ఎలాంటి వాడయినా ఒక అరగంట వ్యవధిలో ఒక అపరిచితుడు(నాకు) ద్వారా స్వామివారు 30,000 ఇప్పించారు. ఇలాగ ఇంచు మించుగా శిల్ప నిలయం వారికి ఇవ్వాల్సిన సొమ్ములు ఒక సంవత్సర కాలంలో ఎప్పుడు అందినవి అప్పుడు జమ చేయగలిగాము.
ధ్వజస్తంభం