3)శంకుస్థాపన

శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు(తేదీ గుర్తులేదు). ఒక షామియానా వేసి ఏర్పాట్లు చేశాము. కోరుకొండ శివాలయం నుంచి ఒక శివలింగాన్ని తెచ్చిపెట్టి పూజలు చేసి వచ్చిన బ్రాహ్మణుని చేతనే కార్యక్రమం జరిపించాము. ఎవరినీ పీటల మీద కూర్చునే పని పెట్టలేదు. అనవసర రాజకీయాలకు దూరంగా ఉండటం కోసం అందరికీ కొబ్బరికాయలు కొట్టుకునే అవకాశం ఇచ్చాము.

91

పని ప్రారంభం

పని వెంటనే మొదలు పెట్టాము. అసలే పల్లం. దానిలో చెరువులాగా తవ్విన పునాది. లోపలంతా బ్రహ్మాండమయిన ఎర్ర కంకర. ఆ లోపలనుండి కనీసం రోడ్డు కంటే రెండు అడుగుల ఎత్తు ఉండేలాగ

పునాది నిర్మించాము. అదంతా పూడ్చటానికి చాలా మట్టి కావాలి. అందువల్ల లోపలికి తిన్నగా ట్రాక్టరు తొట్టి వెళ్ళిపోయేలాగ రెండు దార్లు ఉంచి మిగతా పునాదిని నిర్మించాము. అందువలన పెద్దగా ఎత్తి పోయ వలసిన అవసరం లేకుండా పునాదిని మట్టితో నింపగలిగాము. 9X9 అడుగుల గర్భగుడి, 6X6 అడుగుల ఉపాలయాలు, 6X9 అడుగుల అంతరాలయం వచ్చేలాగ, పైనే ప్రదక్షిణ చేయటానికి వీలుగా బయటకు 2 అడుగులు plate పెంచి నిర్మాణాన్ని పూర్తి చేశాము. మధ్యలో కొంతమంది భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు, నేను కూడా మామూలు మనిషినే, నన్ను చేయించమన్నారు కాబట్టి చేస్తున్నాను, నన్ను విసిగిస్తే నేను వదిలేస్తాను. మీకు కావలసినట్లు చేసుకోండి. చేతనయితే ఏదయినా సహాయం చెయ్యండి. లేకపోతే మాట్లాడకుండా చూడండి. సాధ్యమయినంత వరకు ఏ తప్పులు దుబారా ఖర్చులు చెయ్యము. ఇలాంటి పని ఎప్పుడు చెయ్యలేదు కాబట్టి ఏది మంచో ఏది చెడో నాక్కూడా తెలియదు. నేను చేస్తే నాదైన విధానంలోనే చెయ్యగలను. ఇంకొకరి ఆలోచనలకు అనుగుణంగా చెయ్యలేనని చెప్పాను. దానితో కొంతవరకు తలనొప్పి తగ్గింది.

గుమ్మాలు తయారు చెయ్యడానికి బాదే వెంకటస్వామిగారు, వెంకటప్పారావుగార్ల వద్ద నుండి కొన్ని టేకు చెట్లు సేకరించి చేయించాము. ఈ లోపల ఎవరో గిట్టని వాళ్ళు ఫారెస్టువారికి మేము ఏదో పెద్ద ఎత్తున టేకు (అడవి నుండి అక్రమంగా) తెచ్చి పని చేస్తునట్లు సమాచారం ఇచ్చారు. సరిగ్గా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఏదో సోదా పనులు మొదలు పెట్టారు. అదే సమయంలో మేము ఏదో పని ఉండి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉండేవాళ్ళు అలాంటిది ఏమీ లేదని, గుడికి గుమ్మాలు చేయించడం కోసమని రైతుల దగ్గర కొద్దిపాటి దుంగలు సేకరించి చేయించారని, కావాలంటే గుడి దగ్గరకు వెళ్ళి చూసుకోవచ్చని చెప్పారు. వాళ్ళు మాత్రం మేము పక్కా సమాచారం తోటే వచ్చాము అని చెప్పి ఇంకా అనుమానం గానే ఉన్నారు. మేము వచ్చాకా రాజమండ్రి ఫారెస్ట్ ఆఫీసుకు వచ్చి కలవ వలసిందిగా రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయారు.  తరువాత ఇంకొంచెం వివరంగా విచారణ జరిపిన తరువాత రావక్కర్లేదని మళ్ళీ చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఇబ్బందులు పెట్టవలసిన అవసరం ఎవరికి వచ్చిందో తెలియలేదు. తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. అలాంటి వాళ్ళకు బుద్ది చెప్పే బాధ్యత స్వామివారు ఎలాగా తీసుకుంటారు కాబట్టి మనకేం పనిలేదు. సరిగ్గా రెండు నెలలకు slab పొయ్యటంతో మొదటి దశ నిర్మాణం పూర్తయ్యింది.

వ్యాఖ్యానించండి