యాగశాల నిర్మాణం
గురువుగారు సూచించిన విధంగా యాగశాల ఏర్పాటు అయ్యేలాగ పనులు మొదలు పెట్టాం. ఒక Tractor ఆవిరి గడ్డిని అంతకు ముందే సిద్ధం చేశాం. రాటలు కర్రలు అన్నీ తరలించాం. నాలుగు మూలలకు కావాల్సిన 12 కర్రలు పొడుగు చాలలేదు. ఎంత పొడుగువి కావాలో కొలుచుకుని రాత్రి 8 గంటల తరువాత కానీ రాజమండ్రి వెళ్ళలేకపోయాం. ఆ సైజు కర్రలు ఒక చోట దొరికాయి కానీ అప్పుడు ఇవ్వము, రేపు ఇస్తామన్నారు. అప్పటికి రాత్రి 9:30 అయ్యింది. మాకు ఖాళీ లేకపోవటం వలననే ఇంత Late గా రావలసి వచ్చిందని, రేపు రాలేమని, ఆ కర్రలు మేమే తీసుకుంటామని, జట్టు పనివారితో అవసరం లేదనీ చెప్పాము. వాళ్ళు కూడా ఎదో గుడి పని అంటున్నారు సాయం చేద్దామని ఆ కర్రలను బయటకు లాగారు.
రాత్రి 10 గంటలకు వాటిని తీసుకువచ్చే ఆటో దొరికేలాలేదు. అదే సమయంలో ఒక ఆటో అక్కడ ఎదో సరుకు దిగుమతి చేస్తోంది. ఆ డ్రయివరు మా మధ్య జరుగుతున్నసంభాషణ అంతా వింటున్నాడు. అతనే మా ముందుకు వచ్చి అతనిది దోసకాయలపల్లి అని చెప్పాడు. ఆ కర్రలను మిర్తిపాడు రోడ్డుకి వేసుకువచ్చి గుడి దగ్గర దింపేసి వెళ్ళిపోతానన్నాడు. అతను అడిగిన కిరాయి ఇచ్చేసి కర్రలను అతనికి అప్పజెప్పేసి మేము ఇంటికి వచ్చేసి పడుకున్నాము. అతని సరుకు దిగుమతి పూర్తయిన తరువాత ఆ కర్రలను ఎక్కించుకుని ఆ రాత్రి గుడి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. మరునాటి పనికి ఆటంకం లేకుండా జరిగిపోయింది.
ఫిబ్రవరి నెలలో పని కదా, పెద్ద వర్షాల ముప్పు ఏమీ ఉండదు. ఎలాగోలాగ నీడ వెసెయ్యండి. ఆవిరి గడ్డి తక్కువ వచ్చిందంటే ఇప్పుడు తేలేము. ఆ ఉన్న గడ్డిని జాగ్రత్తగా సరిపెట్టండని చెప్పాను. ఆ పని అయిపొయ్యాక తాపీ మేస్త్రీలకు యజ్ఞకుండాలు మార్కింగు చేసి, మధ్యలో విగ్రహాలు ఉంచడానికి, కలశాలకు వేదిక ఎలా కట్టాలో, అధివాసాలకు కుండీ ఎలా కట్టాలో పురమాయించి మా పని మేము చూసుకుంటున్నాము. అన్నీ ఎలా కడుతున్నారో దగ్గర ఉంది చూసే వెసులుబాటు లేదు.
విజయనగరం నుండి పిలుపు
ఈ లోపల 10,000 ఆహ్వాన పత్రాలు print చేయించాము. అప్పటి వరకు అందిన విరాళాల వివరాలు తెలుపుతూ 50 అడుగుల పొడవు 4 అడుగుల ఎత్తు ఉన్న Flexi చేయించాము. దాన్ని ఉత్తరం వైపు compound wall లోపల కొట్టించాము. Computer Operator పొరపాటు వల్ల ఒక 10 పేర్లు Miss అయినాయి. అందులో అనపర్తి సుబ్బారావుగారు ఇచ్చిన రూ 5,000/- పడలేదు. ఉన్నవాళ్ళు జరిగిన పొరపాటుని అర్థం చేసుకున్నారు. ఈయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరు వెయ్యలేదని అనుకున్నారు. ఆ అభిప్రాయం ఎంత కాలానికి మారలేదు.
09-Feb-2008 తారీకు నాడు విజయనగరం రమ్మన్నారు. మాధవరావుగారికి Phone చేశాను తెల్లవారగట్ల 4 గంటలకు బయలు దేరదామని. ఆయన వచ్చారు. కారులో రాజమండ్రి వరకూ వెళ్ళి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఎక్కాము. బస్సు అన్నవరం చేరే సరికి వర్షం మొదలయింది. చాలా జోరుగా కురవటం మొదలు పెట్టింది. అప్పట్లో రోడ్లు బాగాలేకపోవటం వలన ప్రయాణం ఎక్కువ సమయం పట్టేది. విశాఖపట్నం చేరినా తగ్గలేదు. అక్కడ దిగి విజయనగరం బస్సు ఎక్కాము. అక్కడ దిగేటప్పటికి పరిస్థితిలో మార్పులేదు. ఆ వర్షంలోనే ఏదో హోటల్ లో కాస్త భోజనం చేసి ఆటోలో పూల్ బాగ్ లోని గురువుగారి ఆశ్రమానికి చేరాము.
ఆ సమయానికి గురువుగారు హైదరాబాదులో ఉన్నారు. మేము వెళ్ళిన 3 గంటలు తరువాత విశాఖపట్నం వరకు విమానంలో వచ్చి Car లో ఆశ్రమానికి చేరుకున్నారు. మాకు కావలసిన సామాగ్రి లిస్టులు తయారుచేసి ఇచ్చేటప్పటికి పొద్దుకూకి పోయింది. అందులో దీక్షా వస్త్రాలు అని ఒక 30 దాకా రాశారు. అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు. అందువలన వాటిని వారి ద్వారానే కొనిపించి ఇస్తే మేము తీసుకువెళ్ళి ఉన్నవి రాజమండ్రిలో కొంటామన్నాము.
వాన చూస్తే ఆగలేదు. అప్పటికి పన్నెండు గంటలనుండి ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. మాకు మతి స్థిమితంగా లేదు. ఈ నెలలో ఇంత వాన పడితే మాఊరు అంతా వరద ముంచెత్తి రైతులంతా దిబ్బ అయిపోతారు. ఇంకా ప్రతిష్ఠ ఏమీ లేదు. ఎవరికీ ఎటువంటి ఉత్సాహం ఉండదు. ఎవరూ రారు అని నిరుత్సాహ పడ్డాము. ఇన్ని గంటలు వాన కురుస్తూ ఉంటే అక్కడ ఎలాగ ఉందని అడగను కూడా అడగలేదు. అక్కడ పరిస్థితి కూడా ఇలాగే ఉండదు అని అనుకుంటానికి చిన్న సందేహం కూడా రాలేదు.
ఒక శిష్యుడిని తీసుకుని ఆ వానలోనే బట్టల కొట్టుకు వెళ్ళి కూర్చున్నాము. అతను కావలసిన దీక్షా వస్త్రాలు కట్టించి ఒక పెద్ద బండిల్ తయారు చేసి మాకు అప్పచెప్పారు. తడవకుండా ప్యాకింగు చేశారు. ఆ మూటను ఆటో లో వేసుకుని విజయనగరం బస్టాండుకు వచ్చాము. రాత్రి 10 గంటలు అయ్యింది. వాన ఆగలేదు. మాలో ఏ ఉత్సాహం లేదు. ఆకలి లేదు. నీరసం వచ్చింది. ఆయనే వెళ్ళి రెండు టిఫిన్ పార్సిళ్ళు కట్టించుకు వచ్చారు. బస్సు వచ్చాక మూటను అందులో వేసుకుని విశాఖపట్నం బయలుదేరాము. బస్సులో ఒక 20 మంది కూడా లేరు.
మళ్ళీ వానలోనే విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కాము. చిమ్మ చీకటి, వాన లో బస్సు నడుస్తోంది. ఒళ్ళు నొప్పులు, కళ్ళు మంటలతో ఉన్నాము. నాకయితే బస్సు ఏ ఊరి దాకా వచ్చిందో తెలియటం లేదు. ఆయన మల్లేపల్లి దాకా వచ్చాక ఇంటికి ఫోను చేసి కారుని రాజానగరం రమ్మందామన్నారు. అదేదో ఆయన్నే చేయమన్నాను. మా అబ్బాయి పలికాడు. వెంటనే అతను, శ్రీదేవి(మా కోడలు) కారులో రాజానగరం వచ్చారు. మేము దిగేటప్పటికి వాళ్ళు ముందే చేరిపోయారు. ఎంతో దిగులుగా రాజానగరంలో దిగేటప్పటికి నెల పొడిగా ఉంది. ఒక్కసారిగా మా బాధ అంతా పోయింది. తెల్లవారకుండా ఇంటికి చేరిపోయాము. 20 గంటల సేపు ఆగకుండా వాన కురవడం చూశాము.
ప్రతిష్ఠ ఏర్పాట్లు
అంతకు ముందే యాగానికి కావలసిన ఇంధనం(పుల్ల) 2 టన్నులు మరియు 5 రకాల సమిధలు రకానికి 50kg లు తగ్గకుండా సమకూర్చుకోవడం అయ్యింది. 5 రోజులకు సన్నాయి మేళం, Photo and Videographer లను ఏర్పాటు చేశారు. కొత్త ఊరు సెంటరు వినాయకుడి గుడి దగ్గర నుండి శివాలయం వరకు Lighting వేశారు.
ఆటోలో మైకు పెట్టుకుని కొందరు చుట్టు పక్కల ఊర్లన్నీ తిరిగి ఆహ్వాన పత్రాలు ప్రతీ ఇంటికి పంచి పెట్టారు. కొందరు మూల మూర్తులను ట్రక్కులో పెట్టుకుని పూల మాలలతో అలంకారం చేసి చుట్టు పక్కల ఊళ్ళన్నీ తిప్పి ఊరేగించారు. రోజూ ఎంతో కొంత వర్షం పడటం వలన రోడ్లన్నీ చిత్తడిగా ఉన్నాయి. ఊరేగింపు వీడియోలో రోడ్ల మీద గోతులలో ఉన్న నీళ్ళు కనపడతాయి.


మేము ఆదివారం 10-Feb-2008 తెల్లవారగట్ల విజయనగరం నుండి List లతో దీక్షావస్త్రాల మూటతో ఇంటికి చేరామని అంతకుముందే రాశాను. ఆదివారం మార్కెట్ కి శెలవు, మంగళవారం నుండి కార్యక్రమాలు మొదలు. అందువలన సోమవారం ఉదయం బయలుదేరి రాజమండ్రి మార్కెట్ లో లిస్టు ప్రకారం కావలసిన ప్రతిష్ఠ ద్రవ్యాలను కొనడానికి వెళ్ళాము. ఆ లిస్టు అంతా ఒక షాపువాడు కట్టడానికి సమయం చాలదని దానిని రెండు భాగాలు చేసి రెండు షాపులలో ఇచ్చాము. రెండువేల కొబ్బరికాయలు రాశారు. ఇంకా కలశలు, 5 ఇత్తడి బిందెలు కొనుక్కుని సాయంత్రానికి ఇంటికి చేరాము. రోజూ కావలసిన అరటి గెలలు, పువ్వులు, పూల దండలు, తమలపాకులు వగయిరా ఏరోజుకి ఆరోజు సాయంత్రం చేరేలాగ ఏర్పాటు చేశాము. ఆవునెయ్యి 36 kg లు (రెండు డబ్బాలు) తీసుకున్నాము.
16-Feb-2008 ఉదయం ప్రతిష్ఠ అయ్యాక 11 గంటల నుండి మహా అన్న సమారాధన జరుగుతుందని కారపత్రాలలో ప్రముఖంగా వేయించాము. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఎంతమంది రావొచ్చు? ఎంతమందికి వంట ఏర్పాట్లు చెయ్యాలి? రోజూ ఏదో సమయంలో పడుతున్న వాన వల్ల ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? వాన పడకుండా చెయ్యటం పూర్తిగా దేవుడి అనుగ్రహం మీదే ఆధారపడి ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఒక వేళ పడ్డా కార్యక్రమం సక్రమంగా జరిగేలా చేయగల ఏర్పాట్లు కాని శక్తి కాని ఎవ్వరి వద్ద లేవు.
కొంత మంది ఒక 5 వేల మంది రావచ్చన్నారు. మరికొంత సేపటికి చుట్టుపక్కల ఊళ్ళు గురించి ఆలోచించి అంచనాను 10 వేల వరకూ పెంచారు. నాకు ఎందుకో 15 వేల మంది వరకూ భోజనం ఏర్పాట్లు అవసరం అవుతాయని అనిపించింది. చుట్టుపక్కల చెరుకు తోటలలో చెరుకు నరకడానికి అనేక పొరుగూరు బంటాలు పని చేస్తున్నాయి. ఊళ్ళో ప్రతీ ఇంటిలోను వారి తాలూకు దగ్గర బంధువులు అందరూ వస్తారు. అలాగ ఎవరింట్లో వాళ్ళకు కనీసం ఇంటికి 10 మందన్నా వచ్చే అవకాశం ఉంది. మేము పంచిపెట్టిన ఆహ్వాన పత్రాలే కనీసం ఒక ఎనిమిది వేల ఇళ్ళకు చేరాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆఖరు అంచనాగా పదిహేనువేల మందికి సరిపడగా వంట సరుకులు, పని వారిని ఏర్పాటు చేశారు. ఒక వంద దాకా అరటి పళ్ళ గెలలను కూడా తీసుకువచ్చారు. రోడ్డుకి ఉత్తరంగా ఉన్న సుమారు రెండు యకరాల వరి కోసేసిన మళ్ళను తొక్కించి వంటలకు, షామియానాలకు ఏర్పాటు చేశారు.
మూడు నెలల ముందుకు
2007 డిశెంబరు నెలలో ప్రతి రోజు రాత్రి 8 గంటలకు కరంటు తీసివేసి 9 గంటలకు ఇచ్చేవాడు. శీతాకాలం రాత్రి అవటం వలన వాతావరణం చల్లగా ఉండేది. చిమ్మ చీకటి, కరంటు లేక పోవటం వలన పూర్తి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండేది. ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది గంటలకు రెండు నిమిషాలు ముందుగా గుడికి ఒక్కడినే చేరుకునే వాడిని. కరంటు పోగానే ఒక కొవ్వొత్తిని వెలిగించి గర్భగుడి గడప మీద మధ్యలో పెట్టి గర్భగుడిలో కూర్చొనేవాడిని. ఆ కొవ్వొత్తి కాంతి లోపలికి, బయట మెట్ల వరకూ విస్తరించేది. గది చుట్టూ తెల్లని Tiles, క్రింద నీడ ఆనేలాగా ఉన్న గ్రానైటు ఫ్లోరింగు ఆ వాతావరణం ఆ ప్రశాంతత మరో లోకంలో ఉన్నట్లు ఉండేది. స్వామీ నీవు మరికొన్ని రోజులలో ఇక్కడ కొలువు తీరబోతున్నావన్న భావనతో అదేదో మైకంలాగ చెప్పలేని ఆనందం కలిగేది. మళ్ళీ 9 గంటలకు కరంటు రాగానే ఆ వింత అనుభూతి పోయేది. వెంటనే కొవ్వొత్తి ఆర్పేసి ఇంటికి వచ్చేసేవాడిని. ఒకనాడు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా రాసుల కొద్దీ మల్లెపూల మీదుగా గాలి వీస్తే ఎలాంటి సువాసన వస్తుందో అలాంటి వాసన నాలుగు మూలల గుబాళించడం మొదలు పెట్టింది. గాలి ఎటు వీస్తే అటు చుట్టబెట్టడం మొదలు పెట్టింది. మల్లెతోట మధ్యలో ఉన్నట్లు ఉంది. గుడి చుట్టూ, లోపల అంతా ఒకటే సువాసన. ఆ చుట్టు పక్కల ఒక మల్లెపొద కూడా లేదనేది పచ్చి నిజం. మరి ఈ సువాసన ఎక్కడ నుంచి వస్తోంది? స్వామివారు తన రాకను తెలియజేయడానికి ఎలాంటి వింతను ప్రదర్శిస్తున్నారు. మల్లెల వాసనను ఆస్వాదించడానికి ఎటువంటి గొప్ప జ్ఞానము ఏమీ అక్కరలేదు కదా. అలాగ ఒక పది నిమిషాల పాటు సువాసనలు వెదజల్లి ఒక్కసారిగా మాయం అయిపోయాయి. మళ్ళీ గాలి మామూలు అయిపోయింది. ఇటువంటి అనుభూతి అంతకు ముందు ఎప్పుడూ కలగలేదు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు మళ్ళీ అలాంటి వింతే జరిగింది. దానిని తరువాత వివరిస్తాను.
M.L.A. శ్రీ చిట్టూరి రవీంద్ర గారిని ఆహ్వానించడానికి కొంతమంది కాకినాడ వెళ్ళాము. అక్కడ వారిని కలిసి స్వయంగా ప్రతిష్ఠ జరిగే 5 రోజులలో ఒకసారి రావలసినదిగా ఆహ్వానించాము. కొన్ని గ్రూపు రాజకీయాల కారణంగా ఆయన వస్తారన్న నమ్మకం లేకపోయినా పిలవడం మన బాధ్యత కాబట్టి పిలిచి వచ్చాం. కొంతమంది రెండు మూడు రోజులు మా కారులో దూర ప్రాంతాలదాకా తిరిగి, ఆ ఊళ్ళలో గుడికి చందాలు ఇచ్చిన వారిని కలిసి ఆహ్వాన పత్రాలు అందచేశారు. అన్ని రకాల ఏర్పాట్లు ఇంచు మించుగా పూర్తయినాయి. ధ్వజ స్తంభం నిలబెట్టడానికి 4′ X 4′ 5 అడుగుల లోతు ఉండేలా గొయ్యి తవ్వి నెల మట్టం వరకు లోపల ఇటుక గోడ కట్టించాము. అడుగున 18″ మందం కాంక్రీటు కొట్టాము. కాంక్రీటులో మళ్ళీ ఒక అడుగులోతు చిన్న కన్నం వేయవలసి వచ్చింది. 1 అడుగు వెండి ధ్వజ స్తంభాన్ని అందులో పెట్టాలన్నారు.






