1) ఇది ఎలా జరిగింది? ఎలా సాధ్యమయ్యింది?

బుచ్చింపేట అనే ఒక కుగ్రామంలో ఒక గొప్ప శివాలయం నిర్మాణం జరిగిన విధానం కలలో కూడా ఊహించనిది. ఇది ఎలా జరిగింది? ఎలా సాధ్యమయ్యింది? అనేవి పని పూర్తయిన తరువాత కూడ ఆశ్చర్యంతో వేసుకునే ప్రశ్నలు అయిపోయాయి. ఇది నిజమేనా అని అనిపిస్తుంది.
ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు అనేక అనుభవాలు ఎదురయ్యాయి. అనేక వింత అనుభూతులు కలిగాయి. వీటిని గ్రంధస్థం చెయ్యాలని అనుకుంటున్నా చాలాకాలం జరగలేదు.
ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ ఊరిలో ఉండే భక్తుల మీద కలగటం వలన, స్వామివారు అనుగ్రహించి ఈ ఊరిలో వెలసి(విచ్చేసి) వారిని సేవించుకునే భాగ్యం కలిగించడానికి చూపించిన దయకు నిదర్శనంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన తనే ముందుండి ఎలా నడిపించాడన్న విషయాలను తెలుసుకుందాం.
నాకు ఏదో శివాలయం కడితే బాగుంటుంది అన్న ఆలోచన కొద్దిగా వుండేది. అలా ఎందుకు అనిపించిందో తెలియదు. ఆలోచనలన్నీ సాకారం అవుతాయని ఎవరూ అనుకోలేరు. కట్టగలమన్న నమ్మకం లేదు. ఎక్కడ కట్టాలో తెలియదు. ఎటువంటి అనుభవం లేదు. దానికి కావలసిన నిధి ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఎలా సేకరించాలో తెలియదు. మొదలుపెట్టగలమేమో కాని పూర్తి చేయగలమన్న నమ్మకం లేదు. ఎన్ని బాధలు పడటానికి సిద్ధం కావాలో ఆ పరమాత్ముడికే ఎరుక. అందరి సహకారం ఉంటేనే కాని పని చెయ్యటం కష్టం. అలాంటి సహకారం లభిస్తుందని నమ్మకం కూడా తక్కువ. పని పూర్తి చెయ్యలేకపోతే పడాల్సిన నిందలు ఎక్కువ. వర్గ రాజకీయాలు తప్పవు. వ్యతిరేక వర్గం ఒకటి ఎప్పుడూ ఉంటుంది. విమర్శించే వారికి లోటు ఉండదు. నన్ను 1998వ సంవత్సరంలో మే నెలలో మండిపోయే ఎండలలో గడ్డకాల్వ మీద వంతెన కట్టించమని ఊర్లో పెద్దలు అడిగారు. మీరు ముందు ఉండి పని చేయించండి, మేము వెనకాల ఉంటాం అన్నారు. ఆ ఎండలలో ఒక 20 రోజులలో నేను మాడి మసి అయిపోయి పని పూర్తిచేశాను కానీ నా వెనకాల ఒక్కడు కూడా కనపడలేదు. పని ప్రారంభించిన పాపానికి పూర్తి అయ్యేదాకా వదలలేదు. కాకపోతే ఊరి ప్రజలు అందించే సహకారం ఎంత బాగా ఉంటుందో నాకు బాగా అర్థం అయ్యింది. ప్రజలకు కూడా నేను ఏదయినా బాధ్యత తీసుకుంటే అది పూర్తి చేయడానికి నేను తీసుకునే తపనకూడా ఎలా వుంటుందో అర్థమయ్యింది.

(ఈ క్రింది ఫోటోలు 2017వ సంవత్సరంలో తీసినవి.   20 సంవత్సరాలుగా ఈ వంతెన చెక్కు చెదర కుండా వున్నది)

b1b2b3
40 సంవత్సరాల క్రితం ముందుతరం వాళ్ళు ఒక శివాలయం కడదామని ప్రయత్నం చేసి ఊరికి దక్షిణంగా చెరువుకి దగ్గరగా పునాదులు నిర్మించారు. పుంతలో ఇసుకలాంటి దానితో నింపి దానిమీద ఒక శివలింగం, ఒక గణపతి విగ్రహం ఒక మాదిరి అమ్మవారి విగ్రహం, నంది అరకొరగా చెక్కినవి తెచ్చి పెట్టేశారు. ఒక పాకలాంటిది వేసి కొన్నాళ్ళకు సరిగ్గా 10 తాటాకులు కూడా లేకుండా వదిలేశారు. చుట్టూ కంచి విత్తనం తుప్పలు బలిసిపోయి ఉన్నాయి.

20170130_21425820170130_21434720170130_214325

ఊరు ఉమ్మడి వ్యవహారాలు చూసే కమిటీలు ఉన్నా దానిమీద కనీసం ఒక సారి అయిన పాక అయినా వేసి నిర్వహించడం కూడా చేయలేదు. కాకపోతే అప్పుడు పోగుచేసిన చందాలు కొన్నిరకాల ఖర్చులు చేయగా మిగిలినవి ఒక లక్ష రూపాయలు దాకా ఉన్నాయి. 2000వ సంవత్సరంలో గొల్లబాబుగారి ఎన్నికల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ఇంకొక లక్ష ఎనభై వేల రూపాయలు సమకూరాయి. అంతకుముందు మిర్తిపాడు, ఉండేశ్వరపురంలలో తిరగటం వలన పోగుచేసిన రూపాయలు 15,000 బ్యాంకులో ఉన్నాయి. వీటన్నింటితో శివాలయం నిర్మాణం మళ్ళీ తెరమీదకు వచ్చింది. గ్రామస్తులు నన్ను మళ్ళీ పిలిచి శివాలయం నిర్మాణం బాధ్యత తీసుకోమన్నారు. గత అనుభవాలు పీకుతున్నా ఎందుకో ఒప్పుకున్నాను.
ఆలయ నిర్మాణం అంటే ఇల్లు కట్టుకున్నట్లు కాదు. ముందు ప్రస్తావించిన సమస్యలకంటే ఎన్నో రెట్ల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు. సరిలె అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మొదలు పెడదాం ఏం జరిగితే అదే జరుగుతుందని సమస్యల సాగరంలోనికి దిగిపోయాను.

వ్యాఖ్యానించండి