2) ఎక్కడ కట్టాలి?

గుడి నిర్మాణం ఎలాగా చేయాలని నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఈ పని ఎక్కడ చెయ్యాలి అనేది మొదటి సమస్య. ఊరవతల దక్షిణంగా పునాదుల వరకు తయారయ్యి 40 సంవత్సరాలుగా ఆగిపోయిన దానిమీద గోడలు కట్టి, స్లాబువేసి పని పూర్తి చెయ్యవచ్చు.
ఒక వర్గం అభిప్రాయం ప్రకారం అది సరి అయిన స్థలం కాదు, అక్కడ పని అవ్వదు, అది వద్దని. నేను కూడా గుడి కట్టినా ఆమూలకు ఎవ్వరూ వెళ్ళరని అనుకున్నాను. అక్షరాలు కడదాకా నేర్చుకోని ఒక సిద్ధాంతిని నమ్ముకున్న మరొక వర్గం ఆయన్ను తీసుకువచ్చారు. ఆయనేం చెప్పాడంటే – ఊరికి నైరుతి మూల శివాలయం ఉండాలి. నేను మాఊళ్ళో అలాగే కట్టించాను. మీరు కూడా ఊరవతల నైరుతి మూల దిబ్బల మీద కట్టుకోండి. దానికోసం మీరు ఎక్కువగా కష్టపడక్కరలేదు. నా దగ్గరకు చాలామంది వస్తూవుంటారు. వారిలో ఒకడిని ఒక లారీ ఇసుక వెయ్యమంటాను. మరొకడిని కంకర తోలమంటాను. ఇంకొకడిని 10 బస్తాలు సిమ్మెంటు ఇమ్మంటాను. ఇలాగ రకరకాలుగా ఏదో రూపంలో సహకారం తీసుకుంటూ పని పూర్తి చేసేస్తాను. మీ దగ్గర ఉన్న డబ్బుకి వీటి సహకారం తోడయితే పని సులువుగా అయిపోతుందని, చిటికలేస్తే పని ఎంత అన్నట్లుగా మాట్లాడాడు. ఎందుకో ఆ నైరుతి మూల పని అంటే నాకు నచ్చలేదు. ఊరవతల ఆమూలకు ఎవరూ వెళ్ళరనుకున్నాను.
ప్రస్తుతం గుడి కట్టిన ప్రాంతం ఊరికి ప్రారంభంలో ఉంది. రోడ్డు పక్కన ఉంది. గుడికి తూర్పుభాగంలో కోనేరు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఎవరు ఊరిలోకి వచ్చినా వెళ్ళినా గుడి కనపడుతుంది. ప్రత్యేకంగా దానికోసమని ఊరి చివరకు వెళితేనే కానీ కనపడదన్న బాధ లేదు. ఇక్కడ అయితే అందంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం.
గురువుగారు శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారు కొవ్వూరులో ఉన్నారు. భగవంతుడి దయవల్ల వారితో ఏర్పడిన కొద్దిపాటి పరిచయంతో వారి దగ్గరకు వెళ్ళి సమస్యను వివరించాము. వారిని ఒక్కసారి వచ్చి చూసి ఏ ప్రదేశం అనుకూలంగా ఉంటుందో చెప్పవలసినదిగా కోరాము. ఆయన మా విన్నపాలను ఆలకించి సరే వస్తామన్నారు. వారు వచ్చే విషయాన్ని ఊరి వాళ్ళకు చెప్పాము. వారు వచ్చిన తరువాత రామాలయానికి తీసుకువెళ్ళాము. ఆయన్ను కూర్చోపెట్టి ఆ చుట్టుపక్కల ముఖ్యమయిన వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాం.
గురువుగారు పరిశీలన చేసి మేము ఎంపిక చేసిన ప్రదేశమే బాగుంటుందని అన్నారు. ఊరికి ముందు శివాలయం ఉండాలన్నారు. పడమర విష్ణ్వాలయం ఉండాలన్నారు. అగ్రే హరః. అంటే ముందు ఈశ్వరుడు ఉన్న గ్రామం అగ్రహారం. శివుని తూర్పు దృష్టి నీటి మీద పడేలాగ తూర్పున కోనేరు ఉంది. పశ్చిమ ముఖం సద్యోజాత ముఖం ఊరుని చూస్తూ ఉంటుంది. ఇది అన్ని విధాలా శ్రేష్ఠమయినదని చెప్పారు.

ఈ లోపల సిద్ధాంతిగారిని తీసుకురావడానికి ఆ వర్గం వారు ఏర్పాటు చేశారు. గురువుగారితో సమావేశం అయిపోయింది, అందరూ సిద్ధాంతిగారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపయినా ఆయన రాలేదు. గురువుగారిని తీసుకుని అందరం మా ఇంటి దగ్గరకు వచ్చాము. ఆయనకు ఒక చివర కుర్చీ వేసి ఇరుకుగా ఉన్న మా ఇంటి ముందు వసారాలో అందరం కూర్చున్నాం.

(ఈ క్రింది ఫొటో గురువుగారు శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారు ప్రతిష్ఠకు ముందు ఇంకొక మారు వచ్చినప్పుడు తీసినది)

m

ఇంక గురువుగారు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా సిద్ధాంతిగారిని తీసుకురావడానికి వెళ్ళిన Motor Cycle వచ్చింది. ఆయన లోపలకి వచ్చారు. ఆయనకు కూడా గురువుగారికి దగ్గరగా ఒక కుర్చీ వేశాము. ఆయన ఆ కుర్చీలో కూర్చోవడానికి వెళ్ళబోయి గురువుగారిని చూసి ఒకింత సందేహించారు. గురువుగారి వర్చస్సును చూసి ఆయన గొప్ప పండితుడని గ్రహించాడేమో ఒక అడుగు వెనక్కి వేసి నేల మీద కూర్చుండి పోయాడు. గురువుగారు ఆయన వంక చెప్పమనట్లు చూశారు. సిద్ధాంతిగారు ఆలయం ఊరికి నైరుతి మూల కట్టాలని నసిగారు. అలా చెప్పడానికి మీ దగ్గర ఏదయినా శాస్త్ర ప్రమాణం ఉందా అని గురువుగారు అడిగారు. ఏదయినా సరిగ్గా తెలిస్తే చెప్పండి అన్నారు. దానికి ఆయన నేను పెద్దగా చదువుకోలేదు అన్నారు. గురువుగారు ఆయనతో స్వల్పంగా వివరించి ఇలా అన్నారు. నన్ను ఇక్కడకు స్థలం నిర్ణయం చేయడానికి రమ్మని పిలిస్తే చూడటానికి వచ్చాను. ఏది సరి అయిందో చెప్పాను. అంతవరకే నా పని. మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. మీకు తోచినట్లు చేసుకోండి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. సిద్ధాంతి మారు మాట్లాడలేదు. ఆ విధం గా గుడిని ఎక్కడ నిర్మించాలనే వివాదం సమసిపోయింది.

ఎంపిక చేసిన స్థలం ఎలా ఉంది?

ఎక్కడ కట్టాలి అనే నిర్ణయం జరిగిపోయింది. కానీ ఆ స్థలం ఎలా వుంది? అది రోడ్డు కంటే గజం పల్లంగా ఉంది. చిత్తడి నేల. విపరీతంగా పెరిగిన కంచి విత్తనం ముళ్ళ పొదలు. మధ్యలో నాలుగు తాడి చెట్లు, గడ్డిమేటు, చిన్నపాక. ఇద్దరి ఆధీనంలో ఉంది. ఆ ఇద్దరికి ఒక 20,000 రూపాయలు ఇచ్చి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే వాళ్ళు ఊరు వదిలి హైదరాబాదులో ఏదో పని చేసుకుంటున్నారు.

ఒక J.C.B ని మాట్లాడి తుప్పలు అవీ తీసేసి తాడి చెట్లని కూడా తీసేసాము. అయినా పెద్ద పెద్ద ముళ్ళు భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. స్థలం మధ్యగా 50 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు ఉండేలాగ ఒక గజం లోతు J.C.B. తో మట్టి తీయించి చుట్టూ సద్దించాము. అప్పటికి ఒక ఆకారం వచ్చింది.

1) ఇది ఎలా జరిగింది? ఎలా సాధ్యమయ్యింది?

బుచ్చింపేట అనే ఒక కుగ్రామంలో ఒక గొప్ప శివాలయం నిర్మాణం జరిగిన విధానం కలలో కూడా ఊహించనిది. ఇది ఎలా జరిగింది? ఎలా సాధ్యమయ్యింది? అనేవి పని పూర్తయిన తరువాత కూడ ఆశ్చర్యంతో వేసుకునే ప్రశ్నలు అయిపోయాయి. ఇది నిజమేనా అని అనిపిస్తుంది.
ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు అనేక అనుభవాలు ఎదురయ్యాయి. అనేక వింత అనుభూతులు కలిగాయి. వీటిని గ్రంధస్థం చెయ్యాలని అనుకుంటున్నా చాలాకాలం జరగలేదు.
ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ ఊరిలో ఉండే భక్తుల మీద కలగటం వలన, స్వామివారు అనుగ్రహించి ఈ ఊరిలో వెలసి(విచ్చేసి) వారిని సేవించుకునే భాగ్యం కలిగించడానికి చూపించిన దయకు నిదర్శనంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన తనే ముందుండి ఎలా నడిపించాడన్న విషయాలను తెలుసుకుందాం.
నాకు ఏదో శివాలయం కడితే బాగుంటుంది అన్న ఆలోచన కొద్దిగా వుండేది. అలా ఎందుకు అనిపించిందో తెలియదు. ఆలోచనలన్నీ సాకారం అవుతాయని ఎవరూ అనుకోలేరు. కట్టగలమన్న నమ్మకం లేదు. ఎక్కడ కట్టాలో తెలియదు. ఎటువంటి అనుభవం లేదు. దానికి కావలసిన నిధి ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఎలా సేకరించాలో తెలియదు. మొదలుపెట్టగలమేమో కాని పూర్తి చేయగలమన్న నమ్మకం లేదు. ఎన్ని బాధలు పడటానికి సిద్ధం కావాలో ఆ పరమాత్ముడికే ఎరుక. అందరి సహకారం ఉంటేనే కాని పని చెయ్యటం కష్టం. అలాంటి సహకారం లభిస్తుందని నమ్మకం కూడా తక్కువ. పని పూర్తి చెయ్యలేకపోతే పడాల్సిన నిందలు ఎక్కువ. వర్గ రాజకీయాలు తప్పవు. వ్యతిరేక వర్గం ఒకటి ఎప్పుడూ ఉంటుంది. విమర్శించే వారికి లోటు ఉండదు. నన్ను 1998వ సంవత్సరంలో మే నెలలో మండిపోయే ఎండలలో గడ్డకాల్వ మీద వంతెన కట్టించమని ఊర్లో పెద్దలు అడిగారు. మీరు ముందు ఉండి పని చేయించండి, మేము వెనకాల ఉంటాం అన్నారు. ఆ ఎండలలో ఒక 20 రోజులలో నేను మాడి మసి అయిపోయి పని పూర్తిచేశాను కానీ నా వెనకాల ఒక్కడు కూడా కనపడలేదు. పని ప్రారంభించిన పాపానికి పూర్తి అయ్యేదాకా వదలలేదు. కాకపోతే ఊరి ప్రజలు అందించే సహకారం ఎంత బాగా ఉంటుందో నాకు బాగా అర్థం అయ్యింది. ప్రజలకు కూడా నేను ఏదయినా బాధ్యత తీసుకుంటే అది పూర్తి చేయడానికి నేను తీసుకునే తపనకూడా ఎలా వుంటుందో అర్థమయ్యింది.

(ఈ క్రింది ఫోటోలు 2017వ సంవత్సరంలో తీసినవి.   20 సంవత్సరాలుగా ఈ వంతెన చెక్కు చెదర కుండా వున్నది)

b1b2b3
40 సంవత్సరాల క్రితం ముందుతరం వాళ్ళు ఒక శివాలయం కడదామని ప్రయత్నం చేసి ఊరికి దక్షిణంగా చెరువుకి దగ్గరగా పునాదులు నిర్మించారు. పుంతలో ఇసుకలాంటి దానితో నింపి దానిమీద ఒక శివలింగం, ఒక గణపతి విగ్రహం ఒక మాదిరి అమ్మవారి విగ్రహం, నంది అరకొరగా చెక్కినవి తెచ్చి పెట్టేశారు. ఒక పాకలాంటిది వేసి కొన్నాళ్ళకు సరిగ్గా 10 తాటాకులు కూడా లేకుండా వదిలేశారు. చుట్టూ కంచి విత్తనం తుప్పలు బలిసిపోయి ఉన్నాయి.

20170130_21425820170130_21434720170130_214325

ఊరు ఉమ్మడి వ్యవహారాలు చూసే కమిటీలు ఉన్నా దానిమీద కనీసం ఒక సారి అయిన పాక అయినా వేసి నిర్వహించడం కూడా చేయలేదు. కాకపోతే అప్పుడు పోగుచేసిన చందాలు కొన్నిరకాల ఖర్చులు చేయగా మిగిలినవి ఒక లక్ష రూపాయలు దాకా ఉన్నాయి. 2000వ సంవత్సరంలో గొల్లబాబుగారి ఎన్నికల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ఇంకొక లక్ష ఎనభై వేల రూపాయలు సమకూరాయి. అంతకుముందు మిర్తిపాడు, ఉండేశ్వరపురంలలో తిరగటం వలన పోగుచేసిన రూపాయలు 15,000 బ్యాంకులో ఉన్నాయి. వీటన్నింటితో శివాలయం నిర్మాణం మళ్ళీ తెరమీదకు వచ్చింది. గ్రామస్తులు నన్ను మళ్ళీ పిలిచి శివాలయం నిర్మాణం బాధ్యత తీసుకోమన్నారు. గత అనుభవాలు పీకుతున్నా ఎందుకో ఒప్పుకున్నాను.
ఆలయ నిర్మాణం అంటే ఇల్లు కట్టుకున్నట్లు కాదు. ముందు ప్రస్తావించిన సమస్యలకంటే ఎన్నో రెట్ల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు. సరిలె అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మొదలు పెడదాం ఏం జరిగితే అదే జరుగుతుందని సమస్యల సాగరంలోనికి దిగిపోయాను.